మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

వరద ప్రభావ జిల్లాల్లో సహాయక చర్యలకు రూ.5 కోట్ల చొప్పున.. కరెంట్‌ సరఫరా వెంటనే పురుద్దరించాలి : అధికారులకు సీఎం ఆదేశం

Update: 2024-09-02 07:41 GMT

భారీ వర్షాలు, వరదలతో మృతిచెందిన కుటుంబాలకు సీఎం రేవంత్‌ రెడ్డి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సోమవారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఇంకా భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అలర్ట్‌ గా ఉండాలని, అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై అధికారులు వెంటనే నివేదికలు తయారు చేసి కేంద్రానికి పంపాలన్నారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం అందించాలన్నారు. భారీ వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. రాష్ట్రానికి తక్షణ సాయం కోరుతూ కూడా లేఖ రాయాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని తెలిపారు. రాష్ట్రంలో వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.5 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలు ఉన్నచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని కలెక్టరేట్‌లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో విపత్తు నిర్వహణ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్‌ఎఫ్‌ తరహా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీస్‌ కమిషనర్లు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలన్నారు. కరెంట్‌ సరఫరాను వెంటనే పునరుద్దరించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News