రేవంత్‌ టార్గెట్‌ ఆ ముగ్గురేనా?

వేటు వేయబోయేది కేటీఆర్‌, హరీశ్‌, జగదీశ్‌ పైనే.. అసెంబ్లీలో సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్న బీఆర్‌ఎస్‌.. కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి జాబితాలో

Update: 2024-07-31 14:42 GMT

అసెంబ్లీ సమావేశాలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. అదే అసెంబ్లీలో ప్రభుత్వానికి అడుగడుగునా ముచ్చెమటలు పట్టిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మీడియా చిట్‌ చాట్‌ లో ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. బయటికి ఎవరు పేర్లు చెప్పకపోయినా రేవంత్‌ టార్గెట్‌ ఆ ముగ్గురేనని తెలిసిపోతోంది. ఏ అంశాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చి ప్రచారం చేసుకోవాలని చూసినా సిరిసిల్ల, సిద్దిపేట ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు ఆధారాలతో సహా వాటిని ఎండగడుతున్నారు. కరెంట్‌ పై ఏదో చేద్దామని ప్రయత్నిస్తే మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటరే ఇచ్చారు. ఈ ముగ్గురు రేవంత్‌ సర్కారుకు కంటగింపుగా మారారు. వారిని అలాగే విడిచిపెడితే తమ సర్కారు పరువు అసెంబ్లీ సాక్షిగానే గంగలో కలుస్తుందనే అనుమానం.. అంతకుమించిన భయం సీఎం రేవంత్‌ రెడ్డికి పట్టుకుంది. అందుకే వేటు మాట ఎత్తుకున్నారు. తెలంగాణ మొదటి అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ లపై ఏ విధంగా వేటు వేశారో.. ఈ ముగ్గురిని అలాగే సభ నుంచి బయటకు పంపాలని సీఎం డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే అసెంబ్లీ రూల్‌ బుక్‌ లో ఉన్న అవకాశాలను వెదికే పనిలో పడ్డారు. బిజినెస్‌ రూల్స్‌ లో ఏ చాన్స్‌ ఉన్నా వారిపై వేటు వేసేందుకు ఉపయోగించుకోవాలనే యోచనలో సీఎం ఉన్నారని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్తున్నారు. అప్పుడు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హెడ్‌ ఫోన్స్‌ విసిరి కొట్టారని, అవి అప్పటి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయపడటంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఇప్పుడు అవసరమైతే అలాంటి పరిస్థితి క్రియేట్‌ చేసి మరి వేటు వేయాలనే ప్రయత్నాల్లోనే సీఎం ఉన్నారని ప్రభుత్వవర్గాలే చెప్తున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను తాము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తే.. కేటీఆర్‌, హరీశ్‌ రావు, జగదీశ్‌ రెడ్డి వాటిని హైజాక్‌ చేశారని.. ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీ రాకపోగా ప్రజల్లో అప్రతిష్ట కలిగేలా డ్యామేజ్‌ చేశారని సీఎం వారిపై కక్ష పెంచుకున్నారట. ఈ ముగ్గురే కాదు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపైనా వేటు వేసే అవకాశాలను సీరియస్‌ గానే పరిశీలిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులపై కాకుండా కౌశిక్‌ పైనే మొదట వేటు వేయడానికి అవకాశాలున్నాయని, ప్రతి అంశంలో సభ నిర్వహణకు అడ్డుతగలడాన్ని సాకుగా చూపించి కౌశిక్‌ పై వేటు వేయవచ్చని చెప్తున్నారు. ఏపీ అసెంబ్లీలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ఎలా వేటు వేశారు.. ఏ నిబంధనలు అనుసరించారు.. వాటిని తెలంగాణ అసెంబ్లీలో ఏయే ఎమ్మెల్యేలపై ప్రయోగించవచ్చో స్టడీ చేస్తున్నారు. బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్‌ రెడ్డిని సభ నుంచి వేటు వేసి పంపడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. సభ లోపలే కాదు.. సభ బయట కూడా అధికార పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కీలక ప్రజాప్రతినిధులపైనే ఫోకస్‌ పెట్టారు. వాళ్లు సభలో ఉంటే ప్రభుత్వం ఏం చెప్పినా దానిని కౌంటర్‌ చేస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతోందని సీఎం రేవంత్‌ ఆందోళనలో ఉన్నారు. ఒకరిద్దరిపై వేటు వేస్తే మిగతా వారు కామ్‌ అవుతారని, అసెంబ్లీలో తాము చెప్పిన వాదనే ప్రజల్లోకి బలంగా వెళ్తుందనే ఆలోచనలో సీఎం ఉన్నారు.

'మీటర్ల' వ్యవహారంలో అడ్డంగా బుక్కవడంతోనే

వ్యవసాయ బావుల కాడ మీటర్లు పెట్టేందుకు కేసీఆర్‌ ప్రభుత్వమే కేంద్రానికి అండర్‌ టేకింగ్‌ ఇచ్చిందని, గత ప్రభుత్వం చేసిన పాపానికి బావుల స్మార్ట్‌ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇందుకు ఉదయ్‌ స్కీంలో భాగంగా కేంద్రంతో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ ను సభలో చదివి వినిపించారు. ఇలా వినిపించే క్రమంలో 'అదర్‌ దేన్‌ అగ్రికల్చర్‌ కన్జ్యూమర్స్‌' అనే పదాలను ఉద్దేశపూర్వకంగానే చదవలేదు. అసెంబ్లీలో విద్యుత్‌ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి దీనిని బట్టబయలు చేశారు. సభలో సభానాయకుడిగా తాను తప్పుడు కామెంట్స్‌ చేసి దొరికి పోవడాన్ని సీఎం సీరియస్‌ గా తీసుకున్నారు. అలాగని తనను తాను సంస్కరించుకోవడానికి రెడీగా లేరు. తన తప్పులను తరచూ ఎత్తిచూపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కంకణం కట్టుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వపరంగానే ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టి.. ఆ సమయంలో వారి ప్రవర్తను సాకుగా చూపించి వేటు వేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇదే విషయాన్ని మీడియా చిట్‌ చాట్‌ లో ఆయనే బాహాటంగా చెప్పారు. సభా నాయకుడిగా ప్రజలకు నిజాలు చెప్పడానికి రేవంత్‌ సిద్ధంగా లేరని, తాను చెప్పిందే నిజమని ప్రజలంతా నమ్మాలంటే తనకు అడ్డుగా ఉన్నవారిని సభకే రాకుండా చేయడమే బెటర్‌ అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని వేటు మాటలను బట్టి స్పష్టమవుతోంది.

Similar News