మహిళ జర్నలిస్టులను వెంటాడిన రేవంత్ అనుచరులు.. ఠాణాలోనూ అదే దాష్టీకం

పోలీసుల సాక్షిగా మహిళ జర్నలిస్టులపై దాడికి ప్రయత్నం.. రేవంత్ మనుషులను పల్లెత్తు మాట అనని ఖాకీలు

Update: 2024-08-22 12:28 GMT

సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీపై కవరేజీకి వెళ్లిన మహిళ జర్నలిస్టులపై ఠాణాలోనూ ముఖ్యమంత్రి అనుచరులు అదే దాష్టీకం ప్రదర్శించారు. తెలుగు స్క్రైబ్, మిర్రర్ టీవీ జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప వాళ్లను పల్లెత్తు మాట కూడా అనలేదు. గురువారం ఉదయం సీఎం స్వగ్రామంలో మొదలైన రేవంత్ మనుషుల అరాచకం సాయంత్రం వెల్దండ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఉదయం కొండారెడ్డిపల్లిలో మహిళ జర్నలిస్టులపై దాడి చేసి, బెదిరింపులకు గురి చేసిన రేవంత్ అనుచరులు.. వారు తిరిగి వచ్చే క్రమంలోనూ వెంటపడి వేధింపులకు గురి చేశారు. రేవంత్ అనుచరుల అకృత్యాలపై వంగూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి.. హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన మహిళ జర్నలిస్టులను రేవంత్ అనుచరులు పదుల సంఖ్యలో కార్లతో వెంటాడారు. అంతుచూస్తామని.. ఇంకోసారి అటువైపు కన్నెత్తి చూడొద్దని బెదిరింపులకు గురి చేశారు. భయభ్రాంతులకు గురైన మహిళా జర్నలిస్టులు రక్షణ కోరుతూ వెల్దండ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా వందలాది వాహనాలతో ఠాణాను రౌండప్ చేశారు. ఠాణాలోకి చొరబడి సరితపై దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు కనీసం వారిని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇద్దరు మహిళలను తీవ్రంగా వేదిస్తున్నా, వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నా ఇది పద్ధతి కాదు.. దాడులు చేయొద్దని పోలీసులు కట్టడి చేసేందుకు కూడా యత్నించలేదు.




తన ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా.. తప్పులను ఎత్తి చూపించినా ఉపేక్షించేది లేదన్న సంకేతాలను ఈ ఘటన ద్వారా రేవంత్ రెడ్డి ఇవ్వదలుచుకున్నారా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఆడబిడ్డలకు కనీస రక్షణ కల్పించలేనంత అధ్వనమైన పరిస్థితుల్లో ఉన్నామా.. సీఎం రేవంత్ రెడ్డి అలాంటి పరిస్థితులు సృష్టించి తనకు ఎవరూ ఎదురుతిరగొద్దు అన్న హెచ్చరికలు జారీ చేస్తున్నారా? అనే సందేహాలు బలపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా, ఆయన సైగ చేయకుండా ఆయన అనుచరులు ఇద్దరు మహిళ జర్నలిస్టులు, ఇద్దరు కెమెరామెన్లను వెంటపడి వేధించడం అంటూ ఉండదు. ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉంది కాబట్టే పోలీసులు గట్టిగా చర్యలకు సాహసించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరు మహిళ జర్నలిస్టులు టార్గెట్ గా దుర్మార్గకాండ సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనలకు బాధ్యత వహించకుండా తప్పించుకోలేదు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే సమయం వచ్చినప్పుడు ప్రజలు కీలెరిగి వాతపెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. దీనికి ఎవరూ అతీతులు కారని ఎన్నో సందర్భాల్లో తేటతెల్లమైంది.

నీ ఇంటి ఆడబిడ్డకు ఒక న్యాయం.. మాకొక న్యాయమా? : సరిత

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు తమ బిడ్డ పెళ్లి ముందు అరెస్ట్ చేసి వేధించారని చెప్పుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తమను ఎందుకు వేధిస్తున్నాడని జర్నలిస్ట్ సరిత ప్రశ్నించారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు. తాము కొండారెడ్డిపల్లికి రుణమాఫీ గురించిన వాస్తవాలు తెలుసుకునేందుకే వెళ్లామని.. ప్రజలు ఏం చెప్తే దానిని మాత్రమే చూపించేవాళ్లమని.. అలాంటప్పుడు సీఎం ఎందుకు భయపడ్డారు.. తమను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులుగా విధి నిర్వహణకు వెళ్లిన తమను అడ్డుకోవడమే కాకుండా ఆయన అనుచరులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారని, వెల్దండ పోలీస్ స్టేషన్ లోనే ఒక వ్యక్తి తనపైకి చేయి లేపి కొట్టడానికి వచ్చాడని కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్ రెడ్డి బిడ్డకు ఒక న్యాయం ఆడబిడ్డలమైన తమకు ఒక న్యాయమా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరి రక్షణ చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ సక్రమంగా చేసి ఉంటే ముఖ్యమంత్రి ఇంతగా భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Tags:    

Similar News