తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లు చెరిపేస్తున్న రేవంత్‌

ప్రజాపాలనను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. విగ్రహాల పేరుతో ప్రజల నిగ్రహాన్ని పరీక్షిస్తే అంతిమంగా అది మరో పోరాటానికి దారి తీస్తుంది. దానికి అప్పుడు బాధ్యత రేవంత్‌ సర్కార్‌ అనాలోచిన నిర్ణయాలే కారణమౌతాయి.

By :  Raju
Update: 2024-08-21 04:56 GMT

ప్రజాపాలనను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. రేవంత్‌ సర్కార్‌ భేషజాలకు పోతూ మొండిగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చి కొత్తలో కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేస్తామని తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు మార్చే ప్రయత్నం చేసి ప్రజల నిరసనలతో వెనక్కి తగ్గింది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ఉద్యమం చరిత్ర. ఆ చరిత్రను సంఖ్యా బలం ఉన్నదని ఎలా పడితే అలా మారుస్తామంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు.

ఇప్పటికే ఈ తొమ్మిది నెలల కాలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న భావోద్వేగాలను రూపుమాపే ప్రయత్నం రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్నది. అందరితో చర్చిస్తాం.. అన్నివర్గాల అభిప్రాయాలు తీసుకునే పనిచేస్తామన్న దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మారుస్తామన్న రేవంత్‌ ప్రభుత్వం అది తమ సొంత ప్రైవేట్‌ కార్యక్రమంగా అనుకుంటున్నది. అక్కడితో ఆగకుండా తెలంగాణ సెక్రటేరియట్‌ ముందు తెలంగాణ విగ్రహం ప్రతిష్ఠించాలని గత ప్రభుత్వమే కాదు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. దీనికి భిన్నంగా అక్కడ రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతున్నది. తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మాణం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు వీటన్నింటి వెనుక చరిత్ర ఉన్నది. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సెక్రటేరియట్‌ ముందు ఉండాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్టికల్‌ 3 ద్వారానే రాష్ట్రం సిద్ధించిందని అందుకే రాజ్యాంగ నిర్మాత పేరు సెక్రటేరియట్‌కు పెట్టడమే కాకుండా ఆయన విగ్రహం అక్కడ నెలకొల్పింది. అలాగే ఉద్యమ సమయం నుంచి ఊరూరా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని నిర్ణయించింది. ఇవన్నీ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలు కాదు. ప్రజల ఆకాంక్షల మేరకు, ఉద్యమ సమయం నుంచి ప్రజల్లో ఉండే ఆలోచనలు ప్రతిబింబించేలా అక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసింది.

కానీ రేవంత్‌ సర్కార్‌ వాళ్ల పార్టీ అధిష్ఠానం స్వామి భక్తి కోసం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే చోట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడుతామని ఎవరినీ సంప్రదించకుండా.. ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఇది తెలంగాణ తల్లిని అవమానించడమే అవుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబంపై, తెలంగాణ ఏర్పాటు సోనియాగాంధీ సంకల్పం వల్లనే సాధ్యమైందని అందరూ అంగీకరిస్తున్నదే. దీనిపై ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ బీఆర్ఎస్‌ ఆనవాళ్లను చెరిపేస్తామంటూ ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నది. ఇందిరాగాంధీ హయాం నుంచి తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఒప్పందాల ప్రాతిపదిక ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు 1969లో జరిగాయి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో తెలంగాణకు న్యాయం చేయలేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. అయితే కాంగ్రెస్‌ హయాంలోనే కలిపిన ఆంధ్ర, తెలంగాణనలు, మళ్లీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే విభజించింది. అంతమాత్రానా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్‌ విగ్రహాన్ని సెక్రటేరియట్‌ ముందు పెట్టాలన్న రేవంత్‌ ప్రభుత్వ నిర్ణయం సరికాదు. ఈ చర్య ద్వారా ఇప్పటివరకు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన పౌరసమాజంలోని మేధావులు, బుద్ధిజీవులు, కవులు, జర్నలిస్టులకు కొత్త అస్త్రాలు అందిస్తున్నది. అందుకే రేవంత్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష నేత రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు.

ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందింది. అందుకే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్ని చోట రాజీవ్‌ విగ్రహాన్ని పెట్టడం ద్వారా అధిష్ఠాన మెప్పు పొందుతారేమో.. కానీ ప్రజల్లో మాత్రం ఉన్న పతారా పోగొట్టుకోవడం ఖాయం. రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని నెక్లెస్‌ రోడ్ లో ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉన్నది. నగరంలో ఆయన విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే, సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాకుండా మరెక్కడైనా ప్రతిష్ఠించాలని అన్నివర్గాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుకోకుండా సెక్రటేరియట్‌ ముందే పెడతామనడం ద్వారా ఇది ఇక్కడితో ఆగదు. పదేళ్ల పాలనలో రాజీవ్ ఆరోగ్య శ్రీ , రాజీవ్ రహాదారి హైవే పేరు , త్రిఫుల్ ఐటీ బాసరకు రాజీవ్ పేరు , ఉప్పల్ స్టేడియం, రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లు గత ప్రభుత్వం మార్చలేదు. ఇప్పుడు ప్రభుత్వ చర్యల ద్వారా భవిష్యత్తులో వీటన్నింటి పేర్లు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు రావొచ్చు. విగ్రహాల పేరుతో ప్రజల నిగ్రహాన్ని పరీక్షిస్తే అంతిమంగా అది మరో పోరాటానికి దారి తీస్తుంది. దానికి అప్పుడు బాధ్యత రేవంత్‌ సర్కార్‌ అనాలోచిన నిర్ణయాలే కారణమౌతాయి.

Tags:    

Similar News