రాహుల్ పై విషం కక్కిన వ్యక్తికి రేవంత్ అందలం

సర్కారు సొమ్ముతో సొంత ఎజెండా సెట్ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి.. జాతీయ పార్టీలో తెలంగాణ సీఎం ఇష్టారాజ్యం

By :  Raju
Update: 2024-08-28 04:52 GMT

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వ పటిమను అవహేళన చేసిన వ్యక్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక హోదా కల్పించారు. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీ పై విషం కక్కిన వ్యక్తిని అందలమెక్కించారు. జాతీయ పార్టీ లో రేవంత్ సొంత ఎజెండా సెట్ చేసుకుంటున్నారు. సర్కారు సొమ్ముతో తాను మాత్రమే వెలిగిపోయి కాంగ్రెస్ పార్టీ తేలిపోయే భారీ స్కెచ్ వేశారు. శ్రీరాం కర్రి నియామకం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది. అదానీ విషయం లోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. రేపు ఏదైనా తేడా వస్తే కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి సొంతగా నిలదొక్కుకునేలా మంత్రాంగం నదువున్నారనే అనుమానాలు కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తున్నారు.




 



 



 



నరేంద్రమోడీ ప్రభుత్వం సామాన్యుల కోసం పనిచేయదు కానీ అదానీ-అంబానీల సంపద పెరగడానికి దోహదపడే విధానాలు తీసుకుంటున్నదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. ఆపార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముగ్గురు నలుగురు పెట్టుబడిదారుల చేతిలోనే ఈ దేశం బందీ అయ్యిందని పార్లమెంటు వేదికగానే విమర్శలు గుప్పించారు. అదానీ- సెబీ ఛైర్‌ పర్సన్‌ వాణిజ్య ఒప్పందంపై హిండెన్‌బర్గ్‌ ఇటీవలే ఒక నివేదిక బైటపెట్టింది. అదానీ వ్యవహారంపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపైనే విపక్ష కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటును స్తంభింపజేసింది. అదానీపై చర్యలు తీసుకోవాలని, సెబీ ఛైర్మన్‌ను తప్పించాలని ఇటీవల ఆపార్టీ నిరసన కూడా చేపట్టింది. రాహుల్‌ గాంధీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం అదానీతో ఒప్పందాలు చేసుకుంటారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయనకు రెడ్‌ కార్పేట్‌ పరుస్తారు. రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు భిన్నంగా రేవంత్‌ వ్యవహారశైలి ఉంటుంది. రాహుల్‌ను పప్పు అని ట్వీట్‌ చేసిన వ్యక్తికి, ఈ దేశానికి పప్పు, ఫేకు, మఫ్లర్ అనే ముగ్గురితో ప్రమాదం అపాయం ఉన్నదని ట్వీటర్‌లో సెటైర్లు వేసిన వ్యక్తికి రేవంత్‌ ప్రభుత్వం ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టు కట్టబెట్టింది.

డక్కన్‌ క్రానికల్‌ మాజీ రెసిడెంట్‌ ఎడిటర్‌, ఒడిషా రాష్ట్ర మూలాలున్న శ్రీకాకులం ప్రాంతానికి చెందిన శ్రీరాం కర్రిని తెలంగాణ రాష్ట్ర మీడియా, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమిస్తూ నిన్న ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఆయన గతంలో కాంగ్రెస్‌పార్టీపై, రాహుల్‌ గాంధీపై చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో రెండో స్థానానికి చేరడంపైనా వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశాడు. మన్మోహన్‌ సింగ్‌ ఎన్నికల్లో గెలువలేదని, ఆయన ఓటు కూడా వేసుకోలేడని విమర్శించారు. మహాత్మాగాంధీ ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేసినా గెలుస్తాడు కావొచ్చు కానీ సోనియా-మన్మోహన్‌లు ఆయనను బ్రిటిష్‌ వాళ్లు కూడా చేయని విధంగా బాధపెట్టేవారు అని పోస్ట్‌ పెట్టారు.




 


కాంగ్రెస్‌ పార్టీ వల్లనే ఈ దేశానికి తీవ్ర నష్టం అనేలా పోస్టులు పెట్టే వ్యక్తికి రేవంత్‌రెడ్డి కీలక పదవి కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఆ మధ్య సీఎం పెట్టుబడుల కోసం దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా సీఎం బృందంలో శ్రీరాం కర్రి కూడా ఉన్నారు. ఆయన ఏ హోదాలో అక్కడి వెళ్లారనే చర్చ అప్పుడు కూడా జరిగింది. కేవలం రేవంత్‌ వ్యవహారాలు, మీడియా మేనేజ్‌మెంట్‌ చేయడానికే రేవంత్‌ తనతో తీసుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మీడియా మేనేజ్‌మెంట్ చేయడానికి, కంట్రోల్‌ చేయడానికి ఆయనకు ప్రభుత్వ పదవి కట్టబెట్టి కీలక బాధ్యతలు అప్పగించారని సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఏం చేసినా కాంగ్రెస్‌ అధిష్ఠాన విధానానికి వ్యతిరేకంగా ఉంటాయి. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రేతర వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారు అన్నది ఇటీవల కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం చేసేదే చేస్తాను అన్నట్లు సీఎం వ్యవహారశైలి ఉన్నది. రేవంత్‌ కోసం వాళ్లు, వాళ్ల కోసం తాను అన్నట్టు ఈ నియామకాలు ఉంటున్నాయి. అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పోరాటం.. ఆయనతో ఒప్పందాలు చేసుకోవడానికి రేవంత్‌ ఆరాటం. దీన్నిబట్టి సీఎం కాంగ్రెస్‌ వ్యక్తిలా కాకుండా కాషాయ పార్టీ ఆత్మ ఆవరించిన వ్యక్తిలా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది.




 


Tags:    

Similar News