ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం..సీఎంకు కేటీఆర్ లేఖ

ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

By :  Vamshi
Update: 2024-08-23 15:17 GMT

ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. గత ఎనిమిది నెలలుగా పారిశ్యుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా తీవ్రమైన దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియాతోపాటు చికెన్ గున్యా లాంటి విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్లా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు.

అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో దాదాపుగా 5,700 డెంగీ కేసులు నమోదయ్యాయని, కానీ అనధికారికంగా దీనికి పది రెట్లు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుందని తెలిపారు. డెంగీ కి సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు 50 మంది చనిపోయారని, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరమన్నారు. మొన్నటికి మొన్న ఒక్క రోజులోనే డెంగీ తో ఐదుగురు చనిపోయిన సంఘటన ప్రతిఒక్కరిని కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత మూడు నెలలుగా విష జ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని కేటిఆర్ ఫైర్ అయ్యారు.ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, సరిపడా మందులు కూడా లేని కారణంగా జనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు పేద, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అటు ఆరోగ్యం ఇటు డబ్బులు పోగుట్టుకుని జనం అవస్థలు పడుతుంటే.. పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని కేటిఆర్ దుయ్యబట్టారు. విష జర్వాలు ప్రబల కుండా ఉండాలంటే ముందుగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, దోమల బెడద లేకుండా ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేటిఆర్ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై సమీక్షలు, ముందస్తు ప్రణాళికలు ఉండేవని, ప్రభుత్వ సన్నద్ధత వల్ల జ్వరాలు ప్రబలకుండా అన్నిరకాల చర్యలు తీసుకునే వారిమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో ప్రజారోగ్యం పతనావస్థకు చేరుకుందని కేటిఆర్ మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా రాజకీయాలపై దృష్టి పెట్టడం మాని రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా ఇతర విషజ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేటిఆర్ డిమాండ్ చేశారు. పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తే సగం సమస్య పరిష్కారమవుతుందని కేటిఆర్ సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక కేంద్రాల్లో ఇప్పటికైనా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడాలని కేటిఆర్ బహిరంగ లేఖలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News