ప్చ్..! కండువా మార్చినా మంత్రి కాకపోతి

నైరాశ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. మంత్రి పదవిపై ఆశతోనే బీఆర్ఎస్ ను వీడిన పోచారం

By :  Raju
Update: 2024-06-29 05:11 GMT

కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి తేల్చిచెప్పింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒక్కరికి కూడా కేబినెట్‌ లో చోటివ్వొద్దని తేల్చిచెప్పింది. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నిరాశే మిగిలింది. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కాలె యాదయ్య, దానం నాగేందర్‌కు మంత్రి పదవులిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు. జూలై 2, 3 తేదీల్లో తమ ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుచరులు ఆ నాయకులు చెప్పుకున్నారు. మరో సీనియర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కేబినెట్‌ బెర్త్‌ ఆఫర్‌ చేశారు. పార్టీ మారినోళ్లకు మంత్రులుగా చాన్స్‌ ఇవ్వొద్దని పార్టీ హైకమాండ్‌ చెప్పడంతో ఎందుకు కాంగ్రెస్‌లోకి వచ్చామా అని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మంత్రిగా చాన్స్‌ ఇవ్వకపోతే తాను పార్టీలో చేరబోనని సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు రేవంత్‌కు డైరెక్ట్‌గా చెప్పారని సమాచారం. పార్టీ మారినందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కకపోతే కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని రేవంత్‌ హామీ ఇచ్చిన వాళ్లు ఆందోళనలో ఉన్నారట. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారట.

ముఖ్యంగా దీపా దాస్‌ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వచ్చిన తర్వాత కొంతమందికే (రేవంత్‌ సూచించిన లేదా ఆయన అనుయాయులకే) ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిలుగా ఉన్నవాళ్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ల షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలను పూర్తి చేసుకుని, పార్టీలో నెలకొన్న ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి, వాళ్ల పరిధిలో లేకుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తారు. కానీ దీపా దాస్‌ మున్షి మాత్రం దీనికి భిన్నంగా ఇక్కడే తిష్ట వేస్తున్నారని, రేవంత్‌ ఫిరాయింపు రాజకీయాలకు అన్నిరకాలుగా అండగా నిలుస్తున్నారనే విమర్శలున్నాయి.

పార్టీకి అవసరమైన మెజారిటీ ఉండగా ఇతర పార్టీలో వాళ్లను చేర్చుకుని, తమకు రావాల్సిన అవకాశాలను వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం వీళ్లిద్దరూ చేస్తున్నారే పార్టీలో అంతర్గతంగా చాలామంది సీనియర్‌ నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేత మొన్న ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటాననే విషయం కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద దుమారానికి దారితీసింది. కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులు ఇలాగైతే పార్టీలో సీనియర్లను కాపాడుకోవడం, కార్యకర్తలకు సర్దిచెప్పడం సాధ్యం కాదని తాడోపేడో తేల్చుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే హస్తిన పెద్దలకు ఫిర్యాదు చేశారట. రేవంత్‌ ఒంటెద్దు పోకడలకు చెక్‌ పెట్టకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ కోలుకోలేని విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్లు అధిష్ఠానానికి చెప్పినట్టు సమాచారం.

దీనికితోడు టీడీపీ పాత కాపులను రేవంత్‌ చేరదీస్తున్నారనే విమర్శలున్నాయి. టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నది. ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రేవంత్‌ పరోక్షంగా సహకరిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ను బలహీనపరచడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నారనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తక్కువ కాలంలోనే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి కారణం రేవంత్‌, దీపాదాస్‌ మున్షిల రాజకీయాలే కారణమంటున్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌పార్టీపై జాతీయస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫిరాయింపు చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన ఆపార్టీ తెలంగాణలో భిన్నంగా వ్యవహరిస్తుండటంపై విపక్షాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అందుకే కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారికే కేబినెట్‌లో చోటు అన్నది అధిష్ఠానం ఆలోచనే అంటున్నారు. పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. కానీ ఎలాంటి హామీ ఇవ్వేలనే సంకేతాలు రేవంత్‌ ద్వారానే ఇప్పించినట్టు తాజాగా ప్రకటన ద్వారా తెలుస్తోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం గుర్తించిందని, నష్టనివారణ చర్యల్లో భాగంగానే అలర్ట్‌ అయ్యిందనే టాక్‌ వినిపిస్తున్నది.

Tags:    

Similar News