పశ్చాత్తాపం కాదు.. రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన నిందితుడి భయం

సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు.. మీడియా వక్రీకరించిందని చెప్తూ వివరణలు

Update: 2024-08-30 10:08 GMT

ముఖ్యమంత్రిని అనే హోదా మరిచి.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి.. సుప్రీం కోర్టు లెఫ్ట్‌ రైట్‌ ఇవ్వడంతో జ్ఞానోదయమైన రేవంత్‌ రెడ్డి తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని వివరణ ఇచ్చుకున్నారు. ఏ మీడియా సాయంతో ఆయన సీఎం పీఠం వరకు ఎదిగారో ఇప్పుడు ఆ మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని నిందలేస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం కన్నా రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన నిందితుడికి ఉండే సహజ భయమే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వివరణలో కనిపించింది. ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీం కోర్టు ఎక్కడ మధ్యప్రదేశ్‌ కో, ఇంకో రాష్ట్రానికో తరలిస్తుందో.. అదే జరిగితే తన పదవి ఊడుతుందనే ఆందోళననే ఎక్కువగా అగుపించింది. రాజకీయాల్లోకి వ్యక్తిగత జీవితాలను లాగొద్దు. లాగితే ఆ పర్యవసనాలను తాము అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయం రేవంత్‌ కు తెలియనది కాదు.. కానీ తన బూతులను, పడికట్టు పద విన్యాసాలను ప్రజలు మైమరిచి వింటున్నారనే నమ్మకం.. తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే మితిమీరిన విశ్వాసం. అవతలి వాళ్లను ఎంత తిడితే.. ఎంత ఎక్కువగా కించ పరిస్తే తాను అంత గ్రేట్‌ అన్న అతి విశ్వాసం.. ఇవన్నీ కలగలిపి రేవంత్‌ నోటికి అద్దుఅదుపు లేకుండా చేస్తున్నాయి. అందుకే తాను ముఖ్యమంత్రిని.. తాను మాట్లాడే మాటలు రాష్ట్రానికి ఆపాదిస్తారు అన్న సోయి మరిచారు. రాజకీయ ప్రత్యర్థుల గురించి నీచాతి నీచంగా మాట్లాడి అవి మీడియాలో ప్రసారం అవుతుంటే ఎంజాయ్‌ చేయడం అలవాటు చేసుకున్నారు. ఆ అలవాటులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత కు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సీరియస్‌ గా తీసుకోవడంతో ''చాచా.. నా ఉద్దేశం అది కాదు.. నేను చాలా మంచోడిని.. న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం, అత్యంత గౌరవం ఉంది.. ఆగస్టు 29న కొన్ని పత్రికలు.. నేను న్యాయస్థానం విజ్ఞతను ప్రశ్నిస్తున్నాను అనే కోణంలో వార్తలు రాశాయి. నాకు న్యాయ ప్రక్రియపై గట్టి విశ్వాసం ఉంది.. పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్న.. భారత రాజ్యాంగాన్నిదృఢంగా విశ్వసించే వ్యక్తిగా న్యాయ వ్యవస్థపై గౌరవాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తాను'' అని విచారం వ్యక్తం చేశారు.

రేవంత్‌ రెడ్డిలో ఉన్నట్టుండి ఇంతటి కనువిప్పునకు కారణం.. తాను తప్పు చేశాననే అపరాధ భావన ఎంతమాత్రమూ కాదు. ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ ముఖ్యమంత్రి పీఠం వరకు వచ్చాను.. ఇప్పుడు ఎవడైనా అడ్డం వస్తే పాతాళానికి తొక్కేస్తానని రేవంత్‌ బాహాటంగానే చెప్తుంటారు. అలాంటి వ్యక్తిలో పశ్చాత్తాపం.. తప్పునకు ప్రాయశ్చితం అనేవి ఆశించలేం. శాసన వ్యవస్థకు సమాంతరమైన స్థాయిలో న్యాయ వ్యవస్థ ఉండటం.. ఇప్పుడు తన జుట్టు సుప్రీం కోర్టు చేతిలో ఉండటంతో సుప్రీం కోర్టు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిన కొన్ని గంటల్లోనే 'ఎక్స్‌' వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణలో భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై అంతులేని ప్రేమ ఒలకబోశారు. సుప్రీం కోర్టుతో చీవాట్లు పెట్టించుకునే స్థితిని రేవంత్‌ కు ఇంకెవరో కల్పించలేదు. తనకు తానుగా తెచ్చుకున్నారు. అది తన స్వయం కృతం. రాజకీయంగా ప్రధాన మంత్రిని, దేశంలోనే నంబర్‌ 2 పవర్‌ ఫుల్‌ లీడర్‌ గా పరిగణించే అమిత్‌ షాపై ఇష్టారాజ్యంగా కామెంట్స్‌ చేస్తేనే ఏమీ కాలేదు.. వాళ్లుమాత్రం తనను ఏం చేయగలరు అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. వీటన్నింటి ఫలితంగానే సుప్రీం కోర్టు ఆదేశాలకు రాజకీయాలు ఆపాదించారు. కవితకు బెయిల్‌ వచ్చిన తర్వాత మాత్రమే రేవంత్‌ ఈ అంశంపై మాట్లాడలేదు.. ఢిల్లీలో చిట్‌ చాట్ పేరుతోనూ బెయిల్‌ రావడానికి ముందే ఇదే తరహా కామెంట్స్‌ చేశారు. బీజేపీనే కవితకు బెయిల్‌ ఇప్పిస్తుందనే అర్థం ప్రతిధ్వనించేలా మాట్లాడారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లను త్యాగం చేసిందన్నారు.

రాజకీయ నాయకుడిగా రేవంత్‌ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై నీచమైన భాషలో విమర్శలు చేయడమే తప్పు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా తన ప్రవర్తనను మార్చుకోవాలి. రాష్ట్ర పాలకుడిగా తన వ్యవహారశైలి రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తారు అనే సోయి ఉండాలి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియూ తో మీటింగ్‌ సందర్భంగా రేవంత్‌ బాడీ లాంగ్వేజ్ పై అభ్యంతరాలు వెళ్లువెత్తాయి. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ చైర్మన్‌ తో సమావేశం సందర్బంగా రేవంత్‌ రెడ్డి కనీస మర్యాద పాటించలేదని సొంత పార్టీ వాళ్లే మండిపడుతున్నారు. వివిధ శాఖల సమీక్షల్లోనూ రేవంత్‌ ఆటిట్యూడ్‌ చూపిస్తున్నారని.. ముఖ్యమంత్రి హుందాగా ఉండాల్సింది పోయి తన చూపులతో అవతలి వాళ్లు హడలెత్తిపోయేలా చేస్తున్నారని ప్రభుత్వంలోని పెద్దలే చెప్తున్నారు. కాంగ్రెస్‌ లాంటి జాతీయ పార్టీలో రేవంత్‌ లాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయని.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తన ప్రవర్తనతో సీఎం స్థాయినే దిగజార్చుతున్నారని సొంత కేబినెట్‌ లోని వాళ్లే ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతున్నారు. ''రాజకీయ ప్రత్యర్థులనో, సొంత పార్టీలో ఉన్న మమ్మల్నో తిట్టినట్టుగా సుప్రీం కోర్టును తిడిగే సాగుతదా.. చూశారు కదా ఏమైందో..? తెలంగాణలోనే ఓటుకు నోటు కేసు విచారణ జరిగితే బయట పడుతడు.. సుప్రీం కోర్టుకు మంటపుట్టి మధ్య ప్రదేశ్‌ కో, ఇంకో రాష్ట్రానికో విచారణను బదిలీ చేస్తే అడ్డంగా బుక్కయితడు.. ఆ భయంతోనే సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చుకున్నడు.. విశ్వాసం ప్రకటించిండు.. '' అని ఆయన పార్టీలోని నేతలే చెప్తున్నారు. ఆ భయమే లేకుంటే సుప్రీం కోర్టు కామెంట్స్‌ ను సైతం రేవంత్‌ లైట్‌ తీసుకునే వారని.. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఎలాంటి వ్యతిరేక నిర్ణయం వెలువడుతుందో అన్న భయంతోనే నేలకు తగ్గాడని అంటున్నారు. రేవంత్‌ లో పశ్చాత్తాపం లేదని.. రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన భయం మాత్రమే ఉందని చెప్తున్నారు.

Tags:    

Similar News