ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నో పెన్షన్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో బిల్‌ పాస్‌ చేసిన కాంగ్రెస్‌ సర్కారు

Update: 2024-09-04 13:42 GMT

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్‌ అందకుండా చేసే చారిత్రక బిల్లును ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు మంగళవారం హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. హిమాచల్‌ ప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ (అలవెన్సెస్‌ అండ్‌ పెన్షన్‌ ఆఫ్‌ మెంబర్స్‌) అమైండ్‌మెంట్‌ బిల్‌ - 2024 పేరుతో దీనిని సభలో ప్రవేశపెట్టగా సభ దీనికి బుధవారం ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే ఇది చట్ట రూపం దాల్చనుంది. దేశంలోనే పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా హిమాచల్‌ ప్రదేశ్‌ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్‌ పార్టీ బీఫాంపై గెలిచిన సుధీర్‌ శర్మ, రవి ఠాకూర్‌, రాజిందర్‌ రాణా, ఇందర్‌ దత్‌ లక్నాపాల్‌, చేతన్య శర్మ, దేవిందర్‌ కుమార్‌ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డడారు. పార్టీ విప్‌ ను ధిక్కరించి 2024 -25 బడ్జెట్‌ పై సాధారణ చర్చకు, కట్‌ మోషన్స్‌ పై ఓటింగ్‌ కు ఆ ఆరుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని అతిక్రమించి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఆరుగురిపై వేటు వేయగా ఉప ఎన్నికల్లో సుధీర్‌ శర్మ, ఇందర్‌ దత్‌ లక్నాపాల్‌ మాత్రమే విజయం సాధించగా, మిగిలిన నలుగురు ఓటమి పాలయ్యారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వేటు పడిన ప్రజాప్రతినిధులు పెన్షన్‌ పొందడానికి అనర్హులని పేర్కొన్నదని, దానికి అనుగుణంగానే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి, పాస్‌ చేశామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెడతామని, పార్టీ మారిన రోజే సభ్యత్వం కోల్పోయేలా కఠినంగా చట్టాన్ని బలోపేతం చేస్తామని రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ప్రకటించారు. ఈక్రమంలోనే తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధిక్కారానికి పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి వారికి పెన్షన్‌ పాటు ఇతర అలవెన్స్‌ లు దక్కకుండా కఠినమైన బిల్లును తీసుకువచ్చారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జీవితాంతం పెన్షన్‌ తో పాటు వైద్య సదుపాయాలు, ఇతర సేవలు అందిస్తారు. హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం పాస్‌ చేసిన కొత్త బిల్లుతో అనర్హత వేటు పడిన వారికి ఏ సదుపాయాలు వర్తించే అవకాశం లేకుండా పోతుంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. తాము అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏ సదుపాయాలు దక్కకుండా కఠినమైన బిల్లును తీసుకువచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాష్ట్రాల్లో యథేచ్ఛగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బీఫాంపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లో చేరారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ బీఫాంపై లోక్‌ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ లో పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారని పేర్కొంటూ ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ ను వీడారు. వారిపైనా చర్యలు లేవు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తమకు ఫిర్యాదులు అందాయని, వారిపై చర్యలుంటాయని మండలి చైర్మన్‌, స్పీకర్‌ చెప్పడమే తప్ప చర్యలు తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్‌ ఒక్కో చోట ఒక్కోలా ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. మొదట పార్టీ వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ ను విచారించిన తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి గులాబీ పార్టీ రెడీ అవుతోంది. హిమాచల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ధిక్కారముల్‌ సైతుమా.. అన్నట్టుగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలను వెంటాడుతూ.. వాళ్లకు పెన్షన్‌ కూడా ఇవ్వబోమని బిల్లు పాస్‌ చేయడంతో మరోసారి ఫిరాయింపుల నిరోధక చట్టం.. దానికింద చర్యలు.. తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపుల వ్యవహారం తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News