రేపటి నుంచి లోక్‌సభ సమావేశాలు

18వ లోక్‌సభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనున్నది. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.

By :  Raju
Update: 2024-06-23 13:46 GMT

18వ లోక్‌సభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొదటిరోజు ప్రధాని మోడీ, విపక్ష నేత, ప్యానల్‌ స్పీకర్లు, కేంద్ర మంత్రులు సహా 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మంగళవారం తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు.

రాష్ట్రం పేరు ఆంగ్ల అక్షరంతో మొదలైన చోట నుంచి సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. చివరిగా పశ్చిమ బెంగాల్‌ కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శతాబ్దిరాయ్‌ ప్రమాణం చేస్తారు. జూన్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనున్నది. ఏకాభిప్రాయంతో స్పీకర్‌ను ఎన్నుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఓం బిర్లాకే మళ్లీ అకాశం దక్కవచ్చు అంటున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి తమకు ఇవ్వాలంటూ విపక్ష ఇండియా కూటమి, ఎన్డీఏ మిత్రపక్షాలు కోరుతున్నాయి. దీంతో డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక ఆసక్తికరంగా మారింది.

జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. జూన్ 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. జులై 2 లేదా 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు సమాధానం ఇస్తారని భావిస్తున్నారు.

నీట్‌ యూజీ లో అక్రమాలు, యూజీసీ నెట్‌ పేపర్‌ లీకేజీ, రైల్వే ప్రమాద ఘటనలు వంటివి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వీటిపై ప్రధాని ఇప్పటివరకు స్పందించలేదు. ప్రధాని మౌనంగా ఉండటాన్ని విపక్ష నేతలు తప్పుపడుతున్నారు. దీంతో ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. 

Tags:    

Similar News