పాలనను వదిలేసి.. ఫిరాయింపులపైనే దృష్టి సారించి

రేవంత్ వైఖరి వల్లనే జీవన్‌రెడ్డి అంశం రాజకీయమైంది. పాలనను వదిలేసి.. ఫిరాయింపులపైనే దృష్టి సారించిన సీఎం వ్యవహారశైలి వల్లనే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By :  Raju
Update: 2024-06-27 09:46 GMT

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ కు లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్ లేదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తన పార్టీలో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా?" అని సీఎం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే ఆయనకు అవగాహన లేదని అర్థమౌతున్నది. 2014లో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ రెండు పార్టీలలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి కారణం ఆ పార్టీ అధినేత జగన్‌ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం. ఏపీ హక్కులు, ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నం చేయకూడదనుకున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడానికి కారణం రేవంత్‌రెడ్డినే. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిన తర్వాతే తెలంగాణ రాజకీయ పునరేకీకరణ జరిగింది. ఉద్యమ సమయంలో రెండు కండ్ల సిద్ధాంతాన్ని వల్లె వేసిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించారు. ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్‌ పాలన సాగిస్తూ.. కొత్త ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంటే జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ రాజకీయ సంక్షోభం సృష్టించడానికి కుట్ర చేశారు. దాన్ని అమలు చేయడానికి రేవంత్‌రెడ్డిని ఆయుధంగా వాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. ఇదంతా ప్రజల కండ్ల ముందు జరిగిన చరిత్ర. ఈ విషయాన్ని మరిచి సీఎం రేవంత్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాడుతున్నారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించలేదు. మీలా ఒక్కొక్కరిని చేర్చుకోలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతామంటే అందుకు అంగీకరించారు. ఇదంతా ఫిరాయింపు చట్టానికి లోబడే జరిగిందనే విషయాన్ని సీఎం మరిచిపోయినట్టున్నారు. అలాగే ప్రభుత్వాన్ని కూలగొడ్తామంటే ఊరుకుంటామా? అని ప్రశ్నిస్తున్నారు. కూలగొడ్తామన్న, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీల సంఖ్యా బలం గురించి మాట్లాడిన కడియం శ్రీహరిని ఎలా చేర్చుకున్నారు? దీనికి సీఎం దగ్గర సమాధానం ఉన్నదా? మరో ముఖ్యమైన విషయం బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తామని బాహాటంగానే అంటే దానిపై మాట్లాడటం లేదు ఎందుకు? తెలంగాణలో బీఆర్‌ఎస్‌సార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు కుమ్మక్కై అయ్యానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుమ్మక్కు రాజకీయ ఫలితమే తెలంగాణ సింగరేణి గనులను వేలం వేస్తున్నాయని బీఆర్‌ఎస్‌తో పాటు కార్మికులు ఆరోపిస్తున్నాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేను ఒక్కరినైనా టచ్‌ చేసి చూడండి 48 గంటల్లో రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి అనలేదా? ఈ రెండు పార్టీలు ఒకటి కాకపోతే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలనే రేవంత్‌ ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని విపక్షాలు చూశాయని సీఎం అన్నారు. జీవన్‌రెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాల కారణంగానే తన పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని చేర్చుకోవడానికి ఆయన వ్యతిరేకించారు. పార్టీలో సీనియర్లను పట్టించుకోను అన్నట్టు తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో పార్టీలో చేర్చుకున్నారు. ఇదే విషయాన్ని జీవన్‌రెడ్డి చెప్పారు. తనతో మాట మాత్రం చెప్పకుండా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. రేవంత్‌ ఫిరాయింపు రాజకీయాలపై పార్టీలోనే అసంతృప్తి నెలకొన్నది అనడానికి ఉదాహరణ జీవన్‌రెడ్డిని బుజ్జగించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబులు ఆయన ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయనను వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. కానీ రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు అయినా వీహెచ్‌, జీవన్‌రెడ్డి లాంటి వాళ్లపై ఎలా వ్యవహరిస్తున్నారన్నది అందరూ చూస్తున్నదే. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తున్నదో తెలుసుకోవాలి. రేవంత్ వైఖరి వల్లనే జీవన్‌రెడ్డి అంశం రాజకీయమైంది. దాన్ని రాజకీయంగా ఏ పార్టీ వినియోగించుకోలేదు. ఆయనను మా పార్టీలోకి రావాలని ఎవరూ కోరలేదు. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు పాలనను వదిలేసి.. ఫిరాయింపులపైనే దృష్టి సారించిన రేవంత్‌ వ్యవహారశైలి వల్లనే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News