లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది.. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి

మాజీ మంత్రి హరీశ్ రావు

Update: 2024-09-06 07:37 GMT

కాంగ్రెస్‌ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పిందని.. మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇతర నేతలతో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాంధీ హాస్పిటల్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తొమ్మిది నెలల్లోనే మహిళలపై 1,900 అత్యాచారం కేసులు నమోదయ్యాయని, 2,600 హత్యలు జరిగాయని, 230 స్మగుల్డ్ వెపన్స్‌ ను స్వాధీనం చేసకున్నారని తెలిపారు. అంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. జైనూరులో జరిగిన ఘటన అత్యంత పాశవికమైందన్నారు. మహిళపై అత్యాచారయత్నం చేసి ఆ తర్వాత రాయితో ఆమె ముఖంపై దాడి చేశారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో లేవనెత్తిన తెల్లారే హైదరాబాద్‌లో నాలుగు ఘటనలు జరిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.

కేసీఆర్‌ పాలనలో శాంతిభద్రతలకు కేరాఫ్‌గా తెలంగాణాను మార్చారని, కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడుకున్నామని తెలిపారు. కేంద్ర హోం మంత్రి, జాతీయ భద్రత సలహాదారు సైతం రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని దెబ్బతీస్తున్నారని, ఈ నగరానికి ఏమైందని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయని, కేసీఆర్‌ ఐదేళ్ల పాలనలో 200 స్మగుల్డ్‌ వెపన్స్‌ స్వాధీనం చేసుకుంటే, తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలనలో 230 సీజ్‌ చేశారని తెలిపారు. కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టి రెండు నెలల్లోనే నాలుగు మత కలహాలు జరిగాయని, నిర్మల్‌, సనత్‌ నగర్‌, గోషామహల్‌, జైనూర్‌ ఘటనలు రాష్ట్రం క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సిస్టమ్‌ మొత్తం కొలాప్స్‌ అయ్యిందని, సమర్థులైన అధికారులను సరైన స్థానంలో నియమించాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ లో మత కలహాలు జరిగితే సరిగ్గా పని చేయలేదని బదిలీ చేసిన ఎస్పీని హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా నియమించి ప్రమోషన్‌ ఇచ్చారని తెలిపారు.

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ మహిళ కమిషన్‌ కూడా స్పందించాలని కోరారు. డయల్‌ 100 పని చేయడం లేదని, పోలీసులను వాళ్ల డ్యూటీ చేసుకోనివ్వడం లేదని.. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎవరైనా ప్రశ్నించడమే పాపమన్నట్టు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఫెయిల్‌ అయ్యాయని, భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేయడంలోనూ ఫెయిల్‌ అయ్యారని అన్నారు. విద్యా వ్యవస్థను నడిపించడంలో, హోం శాఖను నిర్వహించడంలో.. ముఖ్యమంత్రిగా అన్నింటా రేవంత్‌ ఫెయిల్యూర్‌ అన్నారు. అధ్వన స్థితిలో రాష్ట్రం ఉంటే.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, లీడర్లకు కండువాలు కప్పడంలో సీఎం బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. భద్రాద్రి జిల్లాలో ఎన్‌ కౌంటర్‌ లో ఆరుగురు చనిపోయారని, కేసీఆర్‌ పాలనలో ఎన్‌ కౌంటర్లు జరిగాయా, బుల్లెట్‌ శబ్దం వినిపించిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వచ్చింది రాష్ట్రంలో మళ్లీ ఎన్‌ కౌంటర్ల సంస్కృతి వచ్చిందన్నారు. పేరుకే ప్రజాపాలన అని.. అంతటా నిర్బంధాలే కొనసాగుతున్నాయని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్‌ రెడ్డికి, గాంధీ హాస్పిటల్‌ కు వచ్చి జైనూరు బాధితురాలిని పరామర్శించడానికి టైం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఆమెకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. బాధితురాలు గిరిజన మహిళ కాబట్టే పట్టించుకోవడం లేదా.. మానవీయ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. వారి వెంట మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News