ఆ దరఖాస్తుల దుమ్మే దులుపలే.. మళ్లీ ''ప్రజాపాలన''!?

సెప్టెంబర్‌ 17 నుంచి రెండో విడత అప్లికేషన్ల పర్వం.. ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి

Update: 2024-08-27 15:11 GMT

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆరు గ్యారంటీల అమలు పేరుతో రాష్ట్ర ప్రజలందరినీ రోడ్ల మీదికి తెచ్చి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన పేరుతో నిరుడు డిసెంబర్‌ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ లలో అప్లికేషన్లు స్వీకరించారు. కొత్త ప్రభుత్వం వచ్చింది.. ఇక తమకు ఆరు గ్యారంటీలు రావడమే తరువాయి అని ప్రజలంతా ఆశగా ప్రజాపాలనలో పాలు పంచుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,25,84,383 మంది ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్నారు. అక్షరాల కోటి ఇరవై ఐదు లక్షల మందికి పైగా ప్రభుత్వ పిలుపునకు స్పందించి అప్లికేషన్లు పెట్టారు. ఇందులో ఒక్క కొత్త రేషన్‌ కార్డుల కోసమే 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు వచ్చిన దరఖాస్తులను డిజిటలైజ్‌ చేసి ప్రజలందరికీ పథకాలు వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అప్లికేషన్ల డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలైనట్టుగా చెప్పింది. ఆ తర్వాత డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఏమైందో .. ఆ డేటా ఎవరి దగ్గర ఉందోకానీ ఇప్పుడు మళ్లీ దరఖాస్తుల జాతరకు తెరతీసింది. సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ఈ విషయం వెల్లడించారు. రెండో విడత ప్రజాపాలన సెప్టెంబర్‌ 17 నుంచి పది రోజుల పాటు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

రేషన్‌ కార్డులతో పాటు ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రజల నుంచి ఇందుకోసం సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. అంటే డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ క్యూలైన్లలో నిల్చుని దరఖాస్తు చేసుకోవాలి. ఆరు గ్యారంటీల కోసం మళ్లీ అప్లికేషన్లు సరేసరి. తమ ధ్రువీకరణ నిర్దారణ కోసం రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ లు అప్లికేషన్‌ తో పాటు జత చేయడం సరేసరి. అంటే మళ్లీ ప్రజలంతా జిరాక్స్‌ సెంటర్లకు పోలోమంటూ వెళ్లాలి. తమ కార్డులను జిరాక్స్‌ చేయించుకోవాలి. సర్కారు ఇచ్చే అప్లికేషన్‌ ఫారాలను నింపి వాటికి జత చేసి ప్రజాపాలనలో భాగంగా వాళ్ల గ్రామానికో, వార్డుకో, డివిజన్‌ కో వచ్చే అధికారుల బృందానికి సమర్పించాలి. ప్రభుత్వం మళ్లీ ఆ దరఖాస్తులను డిజిటలైజ్‌ చేయిస్తుంది. ఆ కాంట్రాక్ట్‌ ను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించి వాళ్లకు కొంత సర్కారు సొమ్మును ముట్టజెప్తుంది. మళ్లీ డేటా ఏమవుతదో.. ఎవరి చేతుల్లో పడుతుందో ఎవరికి తెలియదు.. ఆ తర్వాత క్యాలెండర్‌ మారుతుంది.. మళ్లీ ప్రజాపాలన.. మళ్లీ దరఖాస్తులు.. మళ్లీ జిరాక్సులు.. మళ్లీ డిజిటలైజేషన్‌.. మళ్లీ ప్రజాపాలన.. మళ్లీ అప్లికేషన్‌ లు.. కాంగ్రెస్‌ పవర్‌ లో ఉన్నన్ని రోజులు ఈ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగడం తప్ప ప్రజలకు ఒనగూరే ప్రయోజనం అంటూ ఏమి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఒక్క కొత్త స్కీం అమలుకు బడ్జెట్‌ కేటాయింపులు లేవు. ఆసరా పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం, మహాలక్ష్మీలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 సాయం అందజేయడం.. రైతుభరోసా సాయాన్ని ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచడం సహా కాంగ్రెస్‌ గ్యారంటీలు, హామీలకు కేటాయింపులే లేవు. మరి ఇప్పుడు ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకొని వాటిని ఏం చేసుకుంటారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. గతంలో అప్లికేషన్‌ పెట్టుకున్న వారి వివరాలు ఇవి.. వాళ్లు ఈ స్కీముల కోసం దరఖాస్తు చేసుకున్నారు.. వారి వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.. వారు మినహా కొత్త వాళ్లు దరఖాస్తు చేసుకోండి అనే డేటా రిలీజ్‌ చేయగలుగుతుందా? ముమ్మాటికీ చేయదు.

ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయడం అంత సులువు కాదు. ఆ విషయం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే సీఎం రేవంత్‌ రెడ్డికి, కొందరు మంత్రులకు తెలిసి వచ్చింది. ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. అందుకే వైరా వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేయగానే ''కాంగ్రెస్‌ మాట ఇచ్చింది.. చేసి చూపించింది..'' అని ఊదరగొట్టారు. తమ నియోజకవర్గాల్లో రైతులు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చి ఆందోళనలు చేస్తుంటే.. తమ రుణాలు మాఫీ చేయాలని కోరుతూ బ్యాంకులు, వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరిగితే తప్ప వాళ్లకు వాస్తవాలేమిటో బోధ పడలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత కూడా ప్రభుత్వంపై ఇంకా మావోళ్లు భ్రమల్లో ఉన్నారని సొంత పార్టీ లీడర్లే కామెంట్‌ చేస్తున్నారు. గ్యారంటీలు, హామీల అమలు సంగతి తర్వాత.. ముందు ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటే తమ ప్రభుత్వం ఏదో చేస్తుందన్న ఫీలింగ్‌ వారిలో కలుగుతుందని ప్రభుత్వంలోని పెద్దల భావన. అందుకే మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల జాతరకు తెరతీశారు. ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలంటే ఈ సేవ కేంద్రాల్లోనే అప్లికేషన్లు పెట్టాలి. కానీ ఇప్పుడు మళ్లీ మ్యానువల్‌ దరఖాస్తులు తీసుకుంటారు. ఒకవేళ రేషన్‌ కార్డులు ఇవ్వాలనుకుంటే అప్పుడు మళ్లీ మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తారు. తమకు కార్డు వస్తే చాలు అనే ఆశతో ప్రజలు ఇదివరకు చేసిన దరఖాస్తుల గురించి మరిచి పోయి మళ్లీ కొత్త అప్లికేషన్లు పెట్టుకున్నారు. ప్రజల్లో ఉన్న ఈ ఆశనే తమకు అనుకూలంగా మలుచుకోవాలనేది సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయత్నం. అందుకే మళ్లీ కొత్త దరఖాస్తుల వ్యవహారానికి తెరతీశారు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పమే ఈ ప్రభుత్వానికి ఉంటే మొదటి విడత ప్రజాపాలనలో వచ్చిన 1,25,84,383 అప్లికేషన్లను స్క్రూటినీ చేసి అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయవచ్చు.. ఇవ్వాలనే మనసు లేదు కాబట్టే మళ్లీ దరఖాస్తుల పేరుతో మభ్య పెట్టే ప్రయత్నానికి తెరతీశారు. ప్రజలు నమ్మినంత కాలం.. తమకు ఏదో మంచి జరుగుతుందని వాళ్లు ఆశపడ్డంత కాలం ఈ అప్లికేషన్ల జాతర కొనసాగుతూనే ఉంటుంది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో మ్యానువల్‌ అప్లికేషన్లు ఏమిటో? వాటి డిజిటలైజేషన్‌ ఏమిటో..!?

Tags:    

Similar News