కొండపోచమ్మ సాగర్ కు కాళేశ్వర గంగ

ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ వరకు ఏడు పంపు హౌసుల్లో ఎత్తిపోతలు.. విషం చిమ్మిన కాళేశ్వరం నీళ్లను సద్వినియోగం చేసుకోవడం పై రేవంత్ సర్కారు దృష్టి

By :  Raju
Update: 2024-08-08 09:07 GMT

విషం చిమ్మిన కాళేశ్వరం ప్రాజెక్టు సత్తా ఏమిటో రేవంత్ సర్కారు కు తెలిసి వచ్చింది. ఇప్పుడే కాదు ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కు లైఫ్ లైన్ అని గుర్తించింది. యాసంగి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకపోవడంతోనే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టడమే కాదు శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లను డెడ్ స్టోరేజ్ కి తెచ్చామని సోయి తెచ్చుకొని చెంపలు వాయించుకుంది. ఆలస్యంగానైనా కాళేశ్వరం ఎత్తిపోతలు మొదలుపెట్టింది. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఏడు పంపు హౌస్‌లలోమోటార్లు, పంపులు ఆన్ చేసి గోదావరి గంగను ఎత్తిపోస్తోంది. సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగమ్మ ఎగసి వస్తోంది.

కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం జులై 26న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ లను సందర్శించింది. అంతకుముందు రోజే ఎల్ఎండీని పరిశీలించి వట్టి పోయిన ఆ డ్యాం ను కాళేశ్వరం నీళ్లతో నింపాలని డిమాండ్ చేసింది. ఆగస్టు 2వ తేదీలోగా కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకుంటే తామే 50 వేల మంది రైతులతో పంపు హౌస్ లను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించింది. బీఆర్ఎస్ ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం జులై 27న ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు మొదలు పెట్టింది. మిడ్ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్ట్ చేయాలని .. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాయడంతో స్పందించి మిడ్ మానేరు నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టింది. గురువారం ఎల్లంపల్లి నీటిని నంది, గాయత్రి పంపు హౌస్ ల్లోని రెండేసి మోటార్ల ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ పంప్ హౌస్ లోని రెండు మోటార్ల ద్వారా అనంతగిరికి, అక్కడి నుంచి రెండు మోటార్ల ద్వారా రంగనాయక సాగర్ కు, నాలుగు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ కు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. మల్లన్న సాగర్ నుంచి అక్కారం, మార్కూక్‌ పంప్ హౌస్ ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కు నీటిని ఎత్తిపోస్తున్నారు.

Tags:    

Similar News