బ్రిజేశ్‌కుమార్‌ను తప్పిస్తేనే ఏపీకి న్యాయం

కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్‌ నుంచి ఆయనను తప్పించాల్సిందే మాజీ సీఎం నల్లారి!

By :  Raju
Update: 2024-08-14 04:39 GMT

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి సీఎం కావడం సంతోషంగా ఉన్నదని ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయని వాటిని కేంద్రం సాయంతో పరిష్కరించాలన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వాటి పర్యవసానమే ఇప్పటి సంఘటనలని తెలిపారు. గత ప్రభుత్వం జిల్లాలు విభజించి తప్పుచేసిందని తాను సీఎంగా ఉండి ఉంటే మళ్లీ జిల్లాలు కలిపేవాడిని అన్నారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై తాను స్టే తెచ్చి 11 ఏళ్లు అవుతున్నదని.. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే బ్రిజేశ్‌కుమార్‌ను తప్పించాలన్నారు. నదీ జలాల అంశంలో అప్రమత్తంగా ఉండకుంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని కిరణ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువ ఉన్నది. కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆ జలాలను ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పంచింది. అయితే అప్పుడు ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీని కోసం ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌ అయినా లేదా కొత్త ట్రిబ్యున్‌ల్‌ ఏర్పాటు చేసినా కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో సెక్షన్‌-3 ప్రకారం తెలంగాణ నీటి వాటా హక్కులను తేల్చాలన్నారు. ఏపీ, తెలంగాణల మధ్య నీటి పంపిణీ కోసం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పనిచేస్తున్నది. దీనికి నాటి జగన్‌ ప్రభుత్వం అంగీకరించింది. కేసు ఉప సంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని, న్యాయం చేస్తామని, సమస్య పరిష్కరిస్తామని చెప్పింది.

సెక్షన్‌ -3 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జాలాలు పంపిణీ చేయాలని ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో ట్రెబ్యునల్‌ నదీ జలాల పంపిణీ కోసం విచారణ ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై ఇరు రాష్ట్రాలను స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేసును దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాలు ఎస్‌వోసీలను దాఖలు చేశాయి. అయితే వాటిని పరిశీలించిన అనంతరం విచారణకు తీసుకోవాల్సిన అంశాలు, రాష్ట్రాల తరఫున సాక్షులను విచారణకు సంబబంధిత అంశాలపై తుది ఎస్‌వోసీలను దాఖలు చేయాలని ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ఇప్పటికే స్టేట్‌మెంట్‌ దాఖలు చేసింది. ఏపీ ఎన్నికల నేపత్యంలో ఎస్‌ఓసీ దాఖలు చేయలేకపోతున్నామని కొంత సమయం కావాలని కోరింది. దీంతో ట్రిబ్యునల్‌ మే 15న విచారణను జులై 15కు వాయిదా వేసింది. అయినా ఏపీ ఎస్‌ఓసీ దాఖలు చేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకని దాఖలు చేయడానికి మరింత గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీన్ని జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ తీవ్రంగా ఆక్షేపించారు. చివరి అవకాశం ఇస్తన్నామని నాలుగు వారాల్లో ఎస్‌ఓసీ దాఖలు చేయకపోయినా తదుపరి విచారణ ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వానికి స్పస్టం చేశారు. విచారణను ఆగస్టు 28,29కి వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో నల్లారి వారు బ్రిజేశ్‌ కుమార్‌ను తప్పిస్తేనే నదీ జలాల సమస్య పరిష్కారం అవుతుందని, రాయలసీమకు న్యాయం దక్కుతుంది అన్నట్టు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారే ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉండి మరోసారి కృష్ణా జలాల్లో అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పాలకులకు ఈ సోయి లేదు. అపాయింటెడ్‌ డే కంటే ముందే తెలంగాణలోని ఏడు మండలాలను కేంద్రం ఏపీకి కట్టబెట్టింది. నా వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు ఏపీతో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది. నాడు కాంగ్రెస్‌ సీఎంగా ఆ పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని అమలు చేయకుండా చివరి బాల్‌ ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి యత్నించి విఫలమైన నల్లారి వారు మరోసారి తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కారు. నాడు అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని హెచ్చరించిన ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కులను కాలరాయడానికి కుట్రలు చేస్తున్నారు. బ్రిజేశ్‌కుమార్‌ను తప్పిస్తేనే నదీ జలాల పరిష్కారం అవుతుంది అంటున్నారు. ఇది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యాలా? ఆ పార్టీ విధానమా తేలాల్సి ఉన్నది. తెలంగాణ బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు, 8 బీజేపీ ఎంపీలు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. లేకపోతే తెలంగాణకు ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా, నీటి పారుదల శాఖమంత్రి జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News