విభజన అంశాలపై తెలంగాణ బరిగీసి నిలవాల్సిన సమయమిది

విభజన అంశాల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ అవుతున్న సందర్భంగా తెలంగాణ రాజీపడి ఇచ్చిపుచ్చుకునే ధోరణతో వ్యవహరిస్తే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందని తెలంగాణ జర్నలిస్ట్‌ అభిప్రాయపడ్డారు.

By :  Raju
Update: 2024-07-06 05:42 GMT

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ సందర్భంగా విభజన అంశాలపై తెలంగాణ బరిగీసి నిలవాల్సిన సమయమిది. నీళ్లు, భూములు, ఆస్తులు, నిధులు, విద్యుత్, ఆర్థికలావాదేవీలు వంటి అంశాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తే తెలంగాణకు ఎక్కువ నష్టం ప్రమాదం ఉన్నది. విభజనలో తెలంగాణ కొన్ని హెచ్‌వోడీ పోస్టులను కోల్పోయింది (ఉదాహరణకు డీటీసీపీ, ఇప్పటికీ పోస్టుక్రియేట్ చేసుకోలేని పరిస్థితి) అయినా ఆంధ్రప్రదేశ్ ఎంఏయుడి, హౌసింగ్ శాఖ మంత్రి నారాయణ విభజన అంశాలపై వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారు

ఇది ప్రమాదకర సంకేతం

భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడి ఆస్తులు, స్థిరాస్తులు అక్కడికే చెందుతాయని పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. సింగరేణి సంస్థకు సంబంధించిన విజయవాడలో ఉన్న భూములను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయినా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, దిల్ భూములపై ఇంకా ఆశపడుతున్నది. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వల్ల తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సర్వీసులను, ప్రమోషన్లను కోల్పోయి ఎంతో నష్టపోతున్నారు. విద్యుత్ విభజనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశాలు కొన్ని ఇంకా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ (నెల్లూరు జిల్లా) నిర్మాణానికి తెలంగాణ పవర్ జనరేషన్ ప్లాంట్లను తాకట్టుగా పెట్టి రుణాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి.అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు తెలంగాణలోని జనరేటింగ్ స్టేషన్ల యూనిట్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి ఆంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు సమకూర్చిన సంఘటనలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలల్లో ప్రధాన భూమిక పోషించిన ఐదుగురు(5)ఐఏఎస్ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పుడు ఏపీ సీఎంవోలో ఉన్నారు.

ఆనాటి అనుభవాలను గుర్తుచేసుకుందాం మిత్రులారా..

ఉమ్మడి రాష్ట్రంలో నాడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి, ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి జరిగిన నిధుల కేటాయింపులు అన్ని ఇన్ని కావు. కుప్పం నిధులు దుర్వినియోగం అంశంపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జస్టిస్ చలపతి ఏక సభ్య కమిషన్ అశోక్ నగర్ లోని తన ఇంటికి చంద్రబాబు నాయుడును పిలిపించి చెక్క కూర్చిపై కూర్చోబెట్టి దాదాపు నాలుగు గంటల పాటు విచారించి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. నాడు సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ లోపల, వెలుపల వ్యవహరించిన తీరును ప్రత్యక్షంగా ఎదుర్కొన్న జర్నలిస్టులలో నేనూ ఒకడిని. జర్నలిస్టు మిత్రులందరూ 10 ఏండ్ల వెనక్కు వెళ్లి ఆనాటి అనుభవాలను గుర్తుచేసుకొని మెలగాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది.

(తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్‌ అభిప్రాయం ఇది)

Tags:    

Similar News