టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఇప్పటివరకు టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు ఫైనల్‌కు చేరింది.

By :  Raju
Update: 2024-06-28 02:50 GMT

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ 2022 టీ20 సెమీస్‌ ఓటమికి బదులు తీర్చుకున్నది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన రోహిత్‌ సేన ఇంగ్లాండ్‌ జట్టుకు ముచ్చెమటలు పట్టించి ఇంటికి పంపింది. లీగ్‌ స్టేజీ మొదలు సూపర్‌ 8, సెమీస్‌ వరకు భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణించడంతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకోగలిగింది.

గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇండియా ఇన్సింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (57), సూర్యకుమార్‌ (47) చెలరేగి ఆడటంతో భారత్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది.

అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌ (25), బట్లర్‌ (23), ఆర్చర్‌ (21) రన్స్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ వంద పరుగుల మార్క్‌ అయినా దాటగలిగింది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌, 3, బూమ్రా 2 వికెట్లు తీశారు.

ఈ విజయంతో టీమిండియా టీ 20 ప్రపంచకప్‌లో మూడోసారి ఫైనల్‌కు చేరింది. 2007లో విజేతగా నిలిచిన భారత్‌ 2014లో పరాజయం పాలైంది. టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా భారత్‌, దక్షిణాఫ్రికాలు ఫైనల్‌ చేరడం గమనార్హం.రేపు          (29న) వెస్టిండీస్‌ బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా రాత్రి 8 గంటలకు తుదిపోరులో టైటిల్‌ కోసం సౌతాఫ్రికా, ఇండియా తలపడనున్నాయి.

Tags:    

Similar News