వాళ్లు విద్యార్థులు కాకపోతే మీరెందుకు మాట్లాడుతున్నరు?

పరీక్షల వాయిదా, జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం సహా మంత్రులు నలుగురు నాలుగు రకాలుగా స్పందించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో వీరికి తెలుసా అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వారి వ్యాఖ్యలున్నాయి

By :  Raju
Update: 2024-07-13 09:44 GMT

పరీక్షకు పరీక్షకు మధ్య వ్యవధి లేకపోవడం, సిలబస్‌ అధికంగా ఉండటంతో డీఎస్సీ, గ్రూప్‌-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు నిరసన బాట పడితే కాంగ్రెస్‌ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల నిరసనల నేపథ్యంలో హాస్టళ్లలో ఉన్న విద్యార్థి నేతలను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. కానీ మీడియాలో కూర్చుని వాళ్లెవరూ విద్యార్థులు కారని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అంతేకాదు మీ నిరసనలకు, ఆందోళనలకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని బెదిరింపులకు దిగుతున్నారు. మేం ఇట్లనే చేస్తం. మీరు ఏమైనా చేసుకోండ్రి అన్నట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రికి నిరుద్యోగుల సమస్యలపై సమీక్ష చేసే తీరికలేదు. మంత్రుల దగ్గరికి నిరుద్యోగులు వెళ్లి తమ సమస్యలు చెబితే మా పరిధిలో ఏమీ లేదని చెప్పి వాళ్లు మెల్లగా జారుకుంటున్నారు. మరోవైపు మీడియా ముందుకు వచ్చి నిరుద్యోగులు విపక్షాల ఉచ్చులో పడవద్దని చెబుతున్నారు. పరీక్షల వాయిదా, జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం, మరో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో తాము జాబ్‌ క్యాలెండర్‌ విడుద ల చేయబోతున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌ మాత్రం ఇప్పటికే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశామని చెప్పారు. నలుగురు నాలుగు రకాలుగా స్పందించి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో వీరికి తెలుసా అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వారి వ్యాఖ్యలున్నాయి

బల్మూరి వెంకట్‌ అనే ఎమ్మెల్సీ నిరుద్యోగులు డీఎస్సీ, గ్రూప్‌-2 రెండు వాయిదా వేయాలని కోరుతున్నారని.. ఇప్పుడు వాయిదా వేస్తే రెండు మూడు నెలల తర్వాత కూడా ఇదే సమస్య వస్తుంది అంటూ వితండవాదం చేస్తున్నారు. ఈ రెండింటిలో ఒక పరీక్షను ప్రభుత్వ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు ఆయన మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇప్పటికే డీఎస్సీకి సంబంధించిన హాల్‌టికెట్లను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. గ్రూప్‌-2 వాయిదాకు సంబంధించి అటు ప్రభుత్వం నుంచి గాని ఇటు సర్వీస్‌ కమిషన్‌ నుంచి గాని ఎలాంటి ప్రకటన లేదు. కానీ సీఎం సహా ఎమ్మెల్సీ వరకు అందరూ వీటిపై ఏది పడితే అది మాట్లాడుతూ ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. వీళ్ల ప్రకటలన్నీ నిరసనలు చేస్తున్న నిరుద్యోగులను మభ్యపెట్టడానికే అన్నది తెలుస్తోంది.

మొన్నటివరకు కేసీఆర్‌కు దమ్ముంటే ఓయూలో అడుగుపెట్టాలని అన్నవాళ్లు ఇప్పుడు వర్సిటీలో నిరసన చేస్తున్న వాళ్ల దగ్గరికి వెళ్లే సాహసం చేస్తారా? వాళ్లు నిరుద్యోగులు కాదని అంటున్న వాళ్లు ఇదే విషయాన్ని వాళ్ల దగ్గరికి వెళ్లి అనగలరా? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టిన వాళ్లు విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఎందుకు ఆగమౌతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News