మాఫీ నిజమైతే.. మహిళ జర్నలిస్టులపై దాష్టీకమేలా?

సీఎం సొంతూరిలో సొంత మనుషులతో అఘాయిత్యాలా.. జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకుంటారా.. ఇంత జరుగుతోన్న సీఎం రేవంత్ మౌనమెందుకు??

Update: 2024-08-22 08:13 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం రైతు రుణాలను మాఫీ చేస్తే సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మహిళ జర్నలిస్టులపై దాష్టీకానికి ఎందుకు తెగబడ్డారు. కొండారెడ్డిపల్లిలో ఉన్న రైతులెందరు.. వారిలో రుణమాఫీ ఎందరికి వర్తించింది.. ఇంకా ఎంతమంది రైతులు బ్యాంకుల చుట్టూ మాఫీ కోసం తిరుగుతున్నారనే నిజాన్ని నిగ్గు తేల్చేందుకు వెళ్లిన మహిళ జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిలతో పాటు కెమెరామెన్లపై రేవంత్ రెడ్డి అనుచరులుగా చెప్పుకునే వాళ్లు ప్రవర్తించిన తీరు మనం ఉన్నది స్వతంత్ర భారతదేశంలోనేనా అనే అనుమానాలకు తావిస్తోంది. కొండారెడ్డిపల్లి తన ప్రైవేట్ ఎస్టేట్.. అక్కడ ఎవరూ అడుగు పెట్టడానికి వీల్లేదు అని రేవంత్ పత్వా జారీ చేసినట్టుగా ఆయన మనుషులు ప్రవర్తించారు. విధి నిర్వహణలో భాగంగా వార్తా సేకరణకు వెళ్లిన మహిళా జర్నలిస్టులను టూ వీలర్లు, కార్లు, జేసీబీలతో రౌండప్ చేసి అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వాళ్లదగ్గర ఉన్న కెమెరాలను ధ్వంసం చేశారు. చిప్ లు లాక్కున్నారు. మహిళా జర్నలిస్టుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునేలా అమర్యాదగా ప్రవర్తించారు. రేవంత్ అనుచరుల దుర్మార్గం, తమపై దాడికి తెగబడటం, అత్యంత అసభ్యంగా ప్రవర్తించడంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను టూవీలర్లు, కార్లతో వెంబడించారు. అదేదో ఫ్యాక్షన్ సినిమాలో మాదిరిగా రేవంత్ అనుచరుల వ్యవహారశైలి ఉంది. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం ఇవన్నీ ఆయన ఆదేశాల మేరకు జరుగుతున్నాయనే సందేహాలకు బలం చేకూరుస్తుంది.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయ విమర్శల రూపంలో బూతుల వరద పారిస్తే దానిని కొందరు హర్షించి ఉండవచ్చు.. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదవికి హుందాతనం తెచ్చేలా వ్యవహరించాలి. సీఎం హోదాలో ఏం మాట్లాడినా అది ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి ఎవరూ చెప్పడం లేదో.. చెప్పడానికి సాహసించడం లేదో గానీ ఆయన మాటలు తెలంగాణ ప్రతిష్టను పలుచన చేస్తున్నాయి. ఇక రుణమాఫీ పేరుతో చేసిన ప్రహసనం.. సర్కస్ ఫీట్లు క్రమేణ కాంగ్రెస్ కార్యకర్తల్లోనే నమ్మకం సడలిపోయే పరిస్థితికి దారితీసింది. ఇందుకు కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే కారణం. తాను చెప్పాను కాబట్టి మాఫీ చేసి తీరాలనే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో 40 శాతం మంది రైతులకు కూడా రుణాలు మాఫీ చేయలేదు. ఫలితంగా రైతులంతా ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిథ్యం కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఆయన సొంతూరిలో అందరి రుణాలు మాఫీ అయ్యాయా లేదా అనే వార్తా సేకరణకు మహిళ జర్నలిస్టులు కొండారెడ్డిపల్లికి వెళ్లారు. కొందరు రైతులు, గ్రామ ప్రజలను కలిసి వారు ఏం చెప్తున్నారో అవే మాటలను రికార్డ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే వారిని రౌండప్ చేసిన రేవంత్ రెడ్డి అనుచరులు మహిళ జర్నలిస్టులతో పాటు కెమెరామెన్లపై దాడికి తెగబడ్డారు.

తమ కెమెరాలు ధ్వంసం చేయడం, చిప్ లు లాక్కోవడంతో ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన మహిళ జర్నలిస్టుల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యద్భుతంగా కొండారెడ్డిపల్లిని అభివృద్ధి చేసి ఉంటే కవరేజీకి వెళ్లిన మహిళా జర్నలిస్టులు ఉత్తి చేతులతో తిరిగి వస్తారు. అక్కడ రైతులందరి రుణాలు మాఫీ అయి ఉంటే మిగతా ప్రాంతాల్లోని రైతులందరి రుణాలు మాఫీ అయే ఉంటాయనే విశ్వాసానికి వస్తారు. రేవంత్ భాషలోనే చెప్పాలంటే ఆయన సమర్థతను చాటు కోవడానికి ఇదో సువర్ణావకాశం. మరి ఎందుకు రేవంత్ జార విడుచుకున్నారు. తన అనుచరులను ఎందుకు పురమాయించి మహిళ జర్నలిస్టులపై దాడి చేయించారు. దాడితోనే ఆగిపోకుండా అమానవీయంగా ఎందుకు ప్రవర్తించేలా వారిని ఎందుకు పురమాయించాడు. రాష్ట్ర పరిపాలకుడిగా ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన రేవంత్ రెడ్డి.. ఆ బాధ్యతను విస్మరించి.. తన అనచురుల రూపంలోనే ఉన్న వ్యక్తుల దాష్టీకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. తన టీమ్ లోని కొందరితో ఎదురుదాడికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలను దూషించిన రేవంత్ నే ఆయన అనుచరులు ఆదర్శంగా తీసుకున్నారు. పడ్డబెట్టి తొక్కుత, పేగుల మెడల ఏసుకుంటా.. లాంటి రక్తపు భాషలో రేవంత్ రెచ్చగొట్టడంతోనే నేడు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. జర్నలిస్టుల విధి నిర్వహణకు అడ్డుతగలడమే కాదు.. అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ప్రవర్తించారు. మహిళలను వేధించి, హింసించిన రాజ్యాలు కూకటివేళ్లతో సహా కూలిపోయిన అనుభవాలు చరిత్రలో ఉన్నాయి. ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యం.. మహామహా నియంతలే ప్రజల తీర్పుతో తెరమరుగయ్యారు. రేవంత్ దీనికి అతీతుడు ఏమీ కాదు.

Tags:    

Similar News