రుణమాఫీ నిజమైతే రైతులు ఎందుకు తిరగబడుతున్నరు

రేవంత్ సొంతూరిలో వందశాతం రుణమాఫీ అయితే రాజీనామా చేస్తానని సవాల్ చేసినా.. ఎందుకు స్పందన లేదు : కేటీఆర్

Update: 2024-08-22 09:36 GMT

సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు రైతులందరి రుణాలు మాఫీ అయితే వాళ్లే ఎందుకు తిరగబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి చేవెళ్లలో రైతు రుణాలన్నీ మాఫీ చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం బూటకపు ప్రకటనలతో రైతులంతా తిరగబడుతున్నారని, దీంతో రేవంత్ కు భయం పట్టుకుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.49 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. రూ.17 వేల కోట్లు మాఫీ చేశారని అన్నారు. సీఎం చెప్పినట్టుగా రూ.17 వేల కోట్లన్నా మాఫీ అయింది నిజమే అనుకుంటే.. ఇప్పటి వరకు రైతులకు చేరింది రూ.7,500 కోట్లేనని డిప్యూటీ సీఎం చెప్తున్నారని అన్నారు. ఎక్కడి రూ.49 వేల కోట్లు.. ఎక్కడి రూ.7,500 కోట్లు,, రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినోళ్లను గల్లా పట్టి నిలదీయాలన్నారు. రేవంత్ సీఎం అయ్యాక తమ బతులు ఆగమయ్యాయని రవీందర్ రెడ్డి అనే రైతు తనతో చెప్పారన్నారు. డిసెంబర్ 9న మొదటి సంతకం పెట్టి రూ.2 లక్షల రైతు రుణాలు మాఫీ చేస్తామని సోనియా గాంధీపై ఒట్టేసి రేవంత్ రెడ్డి చెప్పి అందరినీ మోసం చేశాడన్నారు. సచివాలయంలో లంకె బిందులు లేవు కాబట్టే రుణమాఫీ చేయలేదు అన్నట్టుగా రేవంత్ మాట మార్చాడన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కొంత టైమ్ ఇదామని తాము కూడా ఎదురుచూశామని అన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో మీటింగ్ పెట్టి రూ. 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేసేందుకు రూ.49 వేల కోట్లు కావాలని చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు చావు తెలివితేటలు మొదలు పెట్టారని అన్నారు. రూ.49 వేల కోట్లలో రూ.9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడారని, లోక్ సభ ఎన్నికల నాటికి రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు తనను నమ్మరని భావించే దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తానని చెప్పాడని గుర్తు చేశారు. ఆగస్టు 15వ తేదీ పోయినా రుణమాఫీ పూర్తి చేయకుండా ఆ దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశాడని, దైవ ద్రోహం చేసిన దుర్మార్గుడు రేవంత్ అన్నారు. కేసీఆర్ ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని అవతల పడ్డాడే తప్ప ప్రజలకు, రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. జూలైలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని సలహా ఇచ్చారని, బడ్జెట్ కేటాయింపులకు వచ్చే సరికి రూ.26 వేల కోట్లకు తగ్గించారని తెలిపారు. చివరికి రూ.17 వేల కోట్లతో మాఫీని సరిపెట్టే ప్రయత్నం చేస్తే రైతులంతా తిరగబడ్డారని అన్నారు.

రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగావడం లేదని అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి చెప్తే మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని, ఒక ఆడబిడ్డగా ఆమె నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడి అడిగినా మైక్ ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహరించాడన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తాలేకనే నిండు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి లాంటి మహిళ ఎమ్మెల్యేలను రేవంత్ అవమానించారన్నారు. కాంగ్రెస్ హామీని నెరవేర్చడంలో జరిగిన ఆలస్యానికి కూడా వడ్డీ వేస్తున్నారని నర్సాపూర్ లో ఒక రైతు చెప్పారన్నారు. ఇప్పుడు రుణమాఫీకి అమలు చేస్తున్న కొర్రీలనే రేపు రైతుభరోసాకు పెడతారని, అందుకే రైతులంతా గట్టిగా నిలబడి రుణాలన్నీ మాఫీ అయ్యే వరకు కొట్లాడాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం చేశారని, అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి ఇద్దరు మహిళ జర్నలిస్టులు వెళ్తే వారిపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సీఎం చెప్పినట్టు వందశాతం రైతు రుణాలు మాఫీ అయితే మహిళ జర్నలిస్టులపై ఎందుకు దాడులు చేయించావ్.. ఎందుకు అవమానించావో చెప్పాలన్నారు. రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు.

రుణమాఫీ కోసం ఈ రోజు పోరాటం మొదటి అడుగు మాత్రమేనని.. రూ.2 లక్షల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టబోమన్నారు. మాటలు చెప్పడం చాలా సులువని.. ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదన్నారు. చెట్టుకు కట్టేసి కొడుత.. తొండలు జొర్రకొడుత అని రేవంత్ గతంలో మాట్లాడారని.. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు అదే పని చేస్తారన్నారు. కేసీఆర్ పాలన ఎలా ఉండేదో.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. రేవంత్ అన్ని ప్రాజెక్టులను రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తున్నడని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా అన్నారు. ఈ పోరాటం రుణమాఫీతోనే ఆగదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, అన్ని డిక్లరేషన్ లు, 420 హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వం వెంట పడుతామన్నారు. రేవంత్ రెడ్డి లాగా మనం బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యయుతంగానే పోరాడుదామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News