ఎమ్మెల్యేల గౌరవం కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంటుంది

వేముల వీరేశం ఫిర్యాదుపై వివరాలన్నీ తెప్పించుకుంటా : స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

Update: 2024-09-04 12:35 GMT

శాసన సభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత శాసన సభాపతిగా నాపై ఉంటుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేకల్‌ శాసన సభ్యుడు వేముల వీరేశం తనకు జరిగిన అవమానం గురించి తనకు వివరించారని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకుంటానని, సభ్యుల హక్కులు, గౌరవానికి భంగం కలుగకుండా.. భవిష్యత్‌ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాసనసభ నియామాల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆగస్టు 30న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి అతిథులుగా వస్తున్న మంత్రులను రిసీవ్‌ చేసుకోవడానికి ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లతో ప్రొటోకాల్‌ అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితాలో వేముల వీరేశం పేరు ఉన్నా.. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు ఆయనను హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీరేశం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆకలినైనా సహిస్త కానీ అవమానాన్ని భరించనని తనను ఆపేందుకు ప్రయత్నించిన ఇతర ఎమ్మెల్యేలతో వీరేశం అన్నారు. ఈ ఘటనపై బుధవారం ఉదయం మినిస్టర్స్‌ క్వార్టర్స్  లోని స్పీకర్ నివాసం లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ను కలిసి తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు. వీరేశం ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్‌ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని సభ్యుల గౌరవం కాపాడేలా అసెంబ్లీ నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

వేముల వీరేశం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్దగా పరిచయం కూడా అవసరం లేని నాయకుడు. ఎమ్మెల్యేగా ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల మధ్యనే ఉంటారనే పేరున్న నాయకుడు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టిన మిగతా వాళ్లంతా అదే హెలీప్యాడ్‌ వద్ద దర్జాగా ఉంటే.. పోలీసులు వేముల వీరేశం నే టార్గెట్‌ చేసినట్టుగా ఆ రోజు విజువల్స్‌ చూస్తే అనిపించింది. తనకు అవమానం జరిగిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను ఆపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వీరేశం అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసు అధికారులు వీరేశం పట్ల తమకు తాముగానే అనుచితంగా ప్రవర్తించారా? ఎవరి ఆదేశాల మేరకు అవమానించారా అనేది తేలాల్సి ఉంది. దళిత నాయకుడైన వీరేశం స్వతంత్ర భావాలున్న నాయకుడు. నల్గొండ జిల్లాలో ఆదిపత్య కాంగ్రెస్‌ నాయకత్వం ఆయనపై కత్తి కట్టిందా అనే అనుమానం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు, ఇంతకు ముందు ప్రజాజీవితంలో లేనివాళ్లు దర్జాగా తిరుగుతుంటే తనను మాత్రమే పోలీసులు టార్గెట్‌ చేయడంపై వీరేశం అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలోనే స్పీకర్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రివిలేజ్‌ నోటీసులపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.

మొదటిసారి స్పందించిన స్పీకర్‌

తెలంగాణ మూడో అసెంబ్లీలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు మొదటిసారి కాదు. గెలిచిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కాంగ్రెస్‌ నాయకులను వేదికపై కూర్చోబెడుతున్నారని.. వారి చేతనే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయిస్తున్నారని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మూకుమ్మడి గా స్పీకర్‌ ను కలిసి వేర్వేరుగా ఫిర్యాదు లేఖలు అందజేశారు. వాటిలో ఏ ఒక్క ఫిర్యాదుపైనా ఇంత వరకు స్పీకర్‌ గానీ, ఆయన కార్యాలయం గానీ స్పందించిన దాఖలాలు లేవు. మొదటిసారిగా వేముల వీరేశం ఫిర్యాదుపై స్పీకర్‌ విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడేలా చూడాల్సిన బాధ్యత తనదేనని కూడా ఆయన పేర్కొన్నారు. వేముల వీరేశం ను అవమానించిన ఘటనలో వాస్తవాలు తెలుసుకుంటానని కూడా ప్రకటించారు. నివేదిక ఆధారంగా చర్యలుంటాయని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అవమానం జరిగినప్పుడే స్పీకర్‌ స్పందించి ఉంటే వీరేశం కానీ మరో ఎమ్మెల్యేకు కానీ అవమానం జరగకుండా ఉండేది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల లెక్కనే అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను లైట్‌ తీసుకున్న ఏమి కాదన్న భావన అధికారయంత్రాంగంలో కలిగే పరిస్థితులను ఈ ప్రభుత్వమే కల్పించింది. స్పీకర్‌ ధర్మబద్ధంగా వ్యవహరించి ఉంటే.. తమ మెడపై ప్రివిలేజ్‌ కత్తి వేలాడుతుందన్న భయం అధికారుల్లో ఉంటే ఒక్క శాసన సభ్యుడికి కూడా అవమానం చేసే పరిస్థితి తలెత్తదు.

Tags:    

Similar News