హైడ్రా నో అబ్జక్షన్​ సర్టిఫికెట్​ ఇస్తేనే లోన్‌!

బిల్డర్లు, నిర్మాణ సంస్థలకు తేల్చిచెప్తోన్న బ్యాంకర్లు.. హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులకు లోన్‌ ల రికవరీ భయం

Update: 2024-08-30 16:21 GMT

హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని దెబ్బతీయడమే కాదు కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కకుండా చేస్తున్నాయి. ఇది ఒకరకంగా మంచిదే అయినా అపార్ట్‌ మెంట్లు, ఇండ్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ఆ భారం సామాన్యులకే గుదిబండగా మారే ప్రమాదముంది. హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) వరుస కూల్చివేతలతో ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌, కమర్షియల్‌ బ్యాంకులు సైతం రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, కొనుగోలుదారులకు లోన్లు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ముందు వెనుకా చూసుకోకుండా లోన్లు ఇస్తే.. ఆ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ హైడ్రా కూల్చేస్తే పరిస్థితి ఏమిటని బ్యాంకర్లు హైరానా పడుతున్నారు. కొత్త ప్రాజెక్టులకైతే జాగ్రత్తలు తీసుకోవచ్చు.. ఇప్పటికే లోన్లు ఇచ్చి నిర్మాణ దశలో ఉన్నప్రాజెక్టుల పరిస్థితి ఏమిటా అని బ్యాంకర్లు టెన్షన్‌ పడుతున్నారు. ఒకవేళ వాటిని హైడ్రా కూల్చేస్తే లోన్లు రికవరీ చేయడం సాధ్యమవుతుందా అని ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌, వాటి బఫర్‌ జోన్లు, నాలాల ఆక్రమణలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రోజుకోచోట కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. మాదాపూర్‌ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ ఎఫ్‌ టీఎల్‌ పరిధిలో ఉందని హైడ్రా అధికారులు కొన్ని గంటల్లోనే కూల్చేశారు.

ఇప్పుడు హైదరాబాద్‌ శివారుల్లో నిర్మాణ దశలో ఉన్న అనేక భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులన్నీ బ్యాంకు లోన్లతో చేపట్టినవే. ఆయా ఏజెన్సీలు తక్కువ పెట్టుబడితో 70 నుంచి 80 శాతం బ్యాంకు లోన్లు తీసుకొని ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. ఆయా నిర్మాణాల్లో సగానికి పైగా ఎఫ్‌ టీఎల్‌, బఫర్‌ జోన్‌ ల పరిధిలో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఒకవేళ వాటిపై హైడ్రా ఉక్కుపాదం మోపితే.. ఆయా ప్రాజెక్టులపై భారీ బుల్డోజర్లు పంపితే తమ లోన్ల సంగతి ఏమిటా అని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బాచుపల్లి మండలం ప్రగతినగర్‌ లోని సర్వే నం.134లో గల 3.03 ఎకరాల్లో చేపట్టిన మూడు అపార్ట్‌మెంట్లను ఐదు అంతస్తులు నిర్మించిన తర్వాత హైడ్రా అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున మొదలైన ఈ కూల్చివేతలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. ఆ కూల్చివేతలను ఆపేందుకు నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేసిన అవి సక్సెస్‌ కాలేదు. ప్రగతి నగర్‌ లోని ఎర్రకుంట ఎఫ్‌ టీఎల్‌ తో పాటు బఫర్‌ జోన్‌ లో సదరు నిర్మాణాలు ఉన్నాయని అధికారులు నిర్దారించారు. ఈ మూడు ప్రాజెక్టులను నిర్మాణ సంస్థలు 70 శాతానికి పైగా బ్యాంక్‌ లోన్‌ తో నిర్మించాయి. ఇప్పుడు నిర్మాణాలు లేవు. ఎఫ్‌ టీఎల్‌, బఫర్‌ జోన్‌ అని హైడ్రా అధికారులు కూల్చేశారు. లోన్లు తిరిగి చెల్లించాలని నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చినా అవి రికవరీ అవుతాయా అనే టెన్షన్ బ్యాంక్‌ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

హైడ్రా సీరియస్‌ యాక్షన్‌ తో మేల్కొన్న బ్యాంకర్లు కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వాలంటే వాటికి సంబంధించిన విలేజ్ మ్యాప్, ఓల్డ్ మ్యాప్, ఎఫ్​ టీఎల్ క్లియరెన్స్ తో పాటు హైడ్రా నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్ వోసీ) తీసుకొని రావాలని తేల్చిచెప్తున్నారు. ఒకవేళ వాటిలో ఒక్కటి లేకున్నా లోన్లు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. బ్యాంకర్లు ఇప్పటి వరకు రెరా అప్రూవల్‌ లేకున్నా, ఇతర అనుమతులు ఉంటే లోన్లు మంజూరు చేశాయని.. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలతో లోన్‌ ఇవ్వాలంటే తప్పనిసరిగా అన్ని నిబంధనలు పాటించాలని షరతులు పెడుతున్నాయని రియల్టర్లు, బిల్డర్లు చెప్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన బ్యాంకర్లు సమావేశమై హోమ్‌ లోన్లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు లోన్లు మంజూరు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఒక రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. నిర్మాణ సంస్థలు, బిల్డర్లకే కాదు.. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి.. ప్రజలు ప్లాట్లు కొంటే వాళ్ల ఫైనాన్షియల్‌ ఎఫిషియన్సీ, సిబిల్‌ స్కోర్‌, ఇన్‌ కమ్‌ ప్రూఫ్‌, ఎంప్లాయిమెంట్‌ ప్రూఫ్‌ తో కొనుగోలు చేసే ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎక్కడ ఉంది.. ఎఫ్‌ టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందా.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు బిల్డర్ల నుంచి తీసుకున్నారా అని ఆరా తీస్తున్నారు. హైడ్రా దూకుడుతో కొత్తగా చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతున్నా.. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కొనుగోలుదారులపైనే ఎక్కువగా భారం పడే పరిస్థితులు తలెత్తాయి.

Tags:    

Similar News