ఎస్‌ఎన్‌డీపీతోనే హైదరాబాద్‌ కు వరద ముంపు తప్పింది

కేసీఆర్‌ ప్రభుత్వం ముందుచూపుతోనే ఇది సాధ్యమైంది : కేటీఆర్‌

Update: 2024-09-02 12:14 GMT

కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన స్ట్రాటజిల్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ)తో హైదరాబాద్‌ కు వరద ముంపు తప్పిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్‌ లో ముంపు సమస్య తలెత్తకపోవడంతో గొప్ప సంతృప్తినిచ్చిందని 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. ఎస్‌ఎన్‌డీపీతోనే వరద సమస్య నుంచి తప్పించుకున్నామని ముంపు ప్రాంతాల ప్రజలు చెప్తున్నారని, తమ సోషల్‌ మీడియా ఎకౌంట్లలో పోస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం అక్షరాలా నిరూపించిందన్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా లోతట్టు ప్రాంతాలకు ముంపు లేకుండా కాపాడటంలో ఎస్‌ఎన్‌డీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణకు ఎకనమిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ లో భారీ వర్షాల వల్ల వచ్చే వరద ముప్పును నివారించేందుకు అప్పటి కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఎన్‌డీపీ చేపట్టామని గుర్తు చేశారు.

సమైక్య రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యేవని, ఇళ్లలోకి వరదనీరు చేరి పేద, మధ్య తరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారేదని గుర్తు చేశారు. ఈ కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఆలోచనలో భాగంగానే ఎస్‌ఎన్‌డీపీ పురుడుపోసుకుందని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో వరదనీరు, మురుగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్ట పరిచేందుకు రూ.985 కోట్లతో 60 పనులు చేపట్టడంతోనే ఈ రోజు వరద ముప్పు తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సహకారం లేకున్నా కేసీఆర్‌ ప్రభుత్వమే మొత్తం భారం భరించి ఎస్‌ఎన్‌డీపీ పనులు పూర్తి చేసిందని తెలిపారు. చిన్న వర్షానికే పొంగిపొర్లే 36 కీలక నాలాలను అభివృద్ధి చేశామని, అందుకే ఇప్పుడు భారీ వర్షాలు కురిసినా ఆ నాలుగు ఉప్పొంగలేదన్నారు. అనేక కొత్త నాలాలు నిర్మించామని, డ్రెయినేజీ వ్యవస్థను బాగు చేశామని.. యుద్ధప్రాతిపదికన ఆ పనులన్నీ పూర్తి చేయడంతోనే ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు. ఆ రోజు ఎస్‌ఎన్‌డీపీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News