బెంగళూరు మెట్రోకు నిధుల వరద.. హైదరాబాద్ మెట్రోకు రెడ్ సిగ్నల్

మొదటి నుంచి ఇదే తీరు.. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని రేవంత్ చెప్పిన తెల్లారే బిగ్ షాక్

Update: 2024-08-16 16:13 GMT

కేంద్ర ప్రభుత్వం బెంగళూరు మెట్రోకు నిధుల వరద పారించింది. శుక్రవారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బెంగళూరు మెట్రో థర్డ్ ఫేజ్ కు ఏకంగా రూ.15,611 కోట్లు చేయూతనివ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. తాము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉన్నామని స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తెల్లారే ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ ను కనీసం కేంద్రం పరిగణలోకి కూడా తీసుకోలేదు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు సమీపంలోని అర్బన్ లోకల్ బాడీస్ లో విలీనమైతే, స్మార్ట్ సిటీల గడువు ఏడాది పొడిగిస్తే అది తన ఘనత.. తాను కేంద్రంతో స్నేహంగా ఉండటంతోనే అవి సాధ్యమైందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి మెట్రో రైల్ విస్తరణకు కేంద్రం నుంచి పైసా సాయం తేలేకపోయారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మొండి చేయి ఇచ్చినట్టుగానే మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుకూ కేంద్రం జెల్ల కొట్టింది.

హైదరాబాద్ మెట్రోను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించినా, పైసా ఇవ్వకుండా మొండి చేయి చూపించినా రేవంత్ సర్కార్ వైపు నుంచి సౌండ్ లేకుండా పోయింది. తాము చేయని పనులను సైతం ఖాతాలో వేసుకొని క్రెడిట్ పాలిటిక్స్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్ సహచరులు ఇప్పటి వరకైతే కేంద్రం వివక్షపై నోరు తెరిచే ప్రయత్నం చేయలేదు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నగరాల్లో మధ్య తరగతి అభివృద్ధికి మెట్రో రైల్ ద్వారా రవాణ సదుపాయం అత్యంత ముఖ్యమని చెప్పారు. పదేళ్ల క్రితం దేశంలోని ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 21 నగరాల్లో మెట్రో రైల్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. బెంగళూరులోని జేపీ నగర్ నుంచి కెంపాపుర, హోసెల్లి నుంచి కడపగెరె కారిడార్లలోని మెట్రో థర్డ్ ఫేజ్ కు రూ.15,611 కోట్లు కేటాయించామన్నారు. థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో కు రూ.12,200 కోట్లు ఖర్చవుతుండగా అందులో కొంత మొత్తం మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పూణె మెట్రో విస్తరణకు చేయూతనివ్వనున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే ఆ రాష్ట్రంలోని రెండు నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తో సమానంగా ఎంపీలను గెలిపించి పంపించినా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలను కనీసం పరిగణలోకి తీసుకోలేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లింక్ చేసే మెట్రో రైల్ కారిడార్ డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపి చేయూతనివ్వాలని కోరింది. ఔటర్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేస్తూ హైదరాబాద్ చుట్టూరా మరో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో రైల్ కారిడార్ ను రద్దు చేసి ఇమ్లీబన్ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కనెక్ట్ చేయాలని నిర్ణయించారు. ఎల్ బీ నగర్ నుంచి మరో ఆల్టర్నేట్ ప్రపోజల్ కూడా రెడీ చేశారు. ఇమ్లీబన్ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు కారిడార్ కు నిధులివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా కేంద్రానికి పంపామని ప్రభుత్వ పెద్దలు గతంలో తెలిపారు. కేంద్రంతో కేసీఆర్ పంచాయితీ పెట్టుకున్నా గతంలో పైసా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత స్నేహంగా ఉన్నా.. తాను చోటే భాయ్ ని అని చెప్పుకుంటున్నా గతంలో మాదిరిగానే ఇప్పుడూ పైసా విదిల్చలేదు.

Similar News