పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

లెబనాన్ లోని హెజ్ బొల్లాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు

Update: 2024-08-25 05:54 GMT

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం తెల్లవారు జామున లెబనాన్ లోని హోజ్ బొల్లాపై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు చేసింది. తమ దేశంపై ఇజ్రాయిల్ దాడులను లెబనాన్ ధ్రువీకరించిది. హెజ్ బొల్లాపై తామే క్షిపణి దాడి చేశామని ఇజ్రాయిల్ అంగీకరించింది. తమ దేశంపై రాకెట్లు, మిస్సైల్స్ తో హెజ్ బొల్లా దాడి చేసే అవకాశముందని గుర్తించామని, ఆత్మరక్షణలో భాగంగా తామే ముందస్తుగా దాడి చేశామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. అక్కడి ప్రజల ఆవాసాలపైనా దాడికి సిద్ధమని ఇజ్రాయిల్ హెచ్చరించింది. హెజ్ బొల్లా స్థావరాలకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఉత్తర ప్రాంతంలోని పౌరులకు లెబనాన్ ప్రభుత్వం సైరన్లు మోగించి అలర్ట్ చేయగా దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగాయని లెబనాన్ మీడియా కథనాలు వెలువడించాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో ఇజ్రాయిల్ లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ టెల్ అవీవ్ లోని మిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాలతో దేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని గాలంట్ ప్రకటించారు. ఇజ్రాయిల్ పై డ్రోన్ దాడులు చేస్తామని హెజ్ బొల్లా హెచ్చరించింది. ఇజ్రాయిల్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ప్రకటించింది. హమాస్ – ఇజ్రాయిల్ మధ్య కొంతకాలంగా జరుగుతున్న పోరాటంతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు హమాస్ మద్దతుగా పరోక్షంగా దాడులు చేస్తోన్న హెజ్ బొల్లా ఇప్పుడు ప్రత్యక్ష్యంగానే యుద్ధరంగంలోకి దిగింది. తమ కమాండర్ ఫాద్ షుక్ర్ హత్య తర్వాత హెజ్ బొల్లా నేరుగా యుద్ధంలోని దిగింది. ఇజ్రాయిల్ – లెబనాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇజ్రాయిల్ – హెజ్ బొల్లా మధ్య ఉద్రిక్తత పశ్చిమాసియాలో యుద్ధానికి దారితీస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News