ముందుగా నలుగురికే.. అందులో మూడు రెడ్లకు, ఒకటి బీసీకి

కేబినెట్‌ విస్తరణలో ఆరుగురికి చోటివ్వాలని భావించారు. అయితే ముందు నాలుగు బెర్తులు ఖరారు చేసి, ఇప్పటికే మంత్రులుగా ఉన్నవాళ్ల శాఖల్లో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తున్నది.

By :  Raju
Update: 2024-07-03 02:55 GMT

మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణల ఆధారంగా అన్నివర్గాలకు అవకాశం కల్పించనున్నట్టు ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం ఉత్త ముచ్చటే అని తెలుస్తోంది. అగ్రవర్ణాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొండి చేయి చూపనున్నట్టు సమాచారం. పార్టీ ఫిరాయించిన వాళ్లలో ఒకరిద్దరి అవకాశం కల్పిస్తామని బైటికి ప్రచారం చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారిని క్యాబినెట్‌లోకి తీసుకోవడం లేదని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనికి కారణం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే స్పీకర్‌ కు ఫిర్యాదు చేసింది. బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది. స్పీకర్‌ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నది. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనను కలిసిన ప్రజాప్రతినిధుల సమావేశంలో గుర్తు చేశారు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై స్పీకర్‌ ఓటు వేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని రేవంత్‌కు సవాల్ విసిరారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ మాట్లాడిన మాటలను ఉదహరించారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీటన్నింటి నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, ఇప్పుడే వాళ్లను క్యాబినెట్‌లోకి తీసుకొని ఇబ్బందులు కోరి తెచ్చుకోవద్దని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచిస్తున్నది. అందుకే వారిని పక్కనపెట్టి ముందుగా నలుగురికే అవకాశం ఇవ్వాలని అదీ కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారికి మాత్రమే అన్న హైకమాండ్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం జరిగినట్టు తెలిసింది.

అన్నీ కుదిరితే మంత్రివర్గ విస్తరణ రేపే ఉండే అవకాశం ఉన్నది. రాష్ట్రస్థాయిలో విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలనే దానిపై క్లారిటీ వచ్చిందని, అధిష్ఠానం ఆమోదం కోసం చూస్తున్నారు. హైకమాండ్‌ నుంచి ఇవాళ పిలుపు వస్తే సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్‌లతోపాటు మరికొందరు సీనియర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం ఆమోదిస్తే రాత్రికే ప్రకటన చేసి రేపు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గంలో ఇప్పటివరక ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వాలని హస్తిన పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తరణపై ఢిల్లీ పెద్దలు సీఎం , డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్‌లతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నది. నిజామాబాద్‌ నుంచి బోధన్‌ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌ల పేర్లు దాదాపు ఖరారైనట్టే. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి ఇవ్వడానికి ఏఐసీసీతో పాటు పీసీసీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్‌సాగర్‌ రావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

విస్తరణలో ఆరుగురికి చోటివ్వాలని భావించారు. అయితే ముందు నాలుగు బెర్తులు ఖరారు చేసి, ఇప్పటికే మంత్రులుగా ఉన్నవాళ్ల శాఖల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. మిగిలిన రెండింటిలో హైదరాబాద్‌ కు, మరొకటి బీసీ లేదా ఎస్టీకి రిజర్వ్‌ చేసినట్టు సమాచారం. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలనుకుంటున్నది. దానిపై క్లారిటీ వచ్చాక కోదండరామ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవచ్చు. అన్నీ కుదిరితే ఇవాళ రాత్రే ప్రకటన ఉండనున్నది.

Tags:    

Similar News