ఫ్యూడల్ బ్యాక్ గ్రౌండ్.. ఫ్యాక్షన్ పాలన

పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించడమే రేవంత్ కుట్రనా.. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు.. మహిళలు, మహిళా జర్నలిస్టులపై దాడులెందుకు?

Update: 2024-08-23 05:40 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు గురువు కాదు... తాను శిష్యుడిని కాదని... సహచరుడినని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మీడియా ఛానల్‌లో 'క్వశ్చన్ అవర్' కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ గురుశిష్యులు అంటూ ఓ ప్రశ్న సంధించారు. 'శిష్యుడి కోసం చంద్రబాబు గారు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు... ఇప్పుడు గురువుగారు అక్కడ పోటీ చేస్తున్నారు. శిష్యుడి సహకారం ఏమైనా ఉంటుందా?' అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ... 'ఎవ‌డ‌య్యా బుర్రలేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవ‌రు..? గురువు ఎవ‌రు..? నేను స‌హ‌చరుడిని అని చెప్పిన‌. ఎవ‌డ‌న్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను స‌హ‌చ‌రుడిని' అని రేవంత్‌ సమాధానం

ఇదే ముఖ్యమంత్రి గతంలో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. 'తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పమంటే మీకు పటేల్‌ పట్వారీ వ్యవస్థ గురించి మీకు తెలుసు. మా తండ్రి, మా తాత, మా ముత్తాత పోలీస్‌ పటేల్‌. మాకు 800 ఎకరాల భూమి ఉండేవి. చుట్టూ 20 ఊళ్లల్లో మేం చెప్పేదే నడిచేది. అలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌. పొలిటికల్‌గా హైదరాబాద్‌లో బిజినెస్‌ ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ కాదు. దాంట్లో దాయాదులు, దాయాదుల పంచాయతీలు, పోరులు, హత్యలు, చంపుకోవడాలు ఆ నేపథ్యం ఎక్కువ మాది. ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిస్టు సినిమాలు తీసి అట్లాంటి నేపథ్యం ఉన్నవాళ్లు కొంచెం సిగ్గుపడేలా ఈ సినిమాలను అట్లా పోట్రైట్‌ చేశారు. ఏ సినిమా కూడా మా కుటుంబం బ్యాక్‌గ్రౌండ్‌ కంటే ఎక్కువ కాదు. మేం ఏ సినిమా కంటే తక్కువ కాదు. ఏ ఊరు వాళ్లు అయినా మా ఇంటి ముందు వెళ్లాలంటే చెప్పులు వేసుకుని వెళ్లేవాళ్లు కాదు. నేను చూసినప్పుడు కూడా. చుట్టుముట్టు ఏ ఊళ్లో ఎవడు ఏ పంచాయితీ పెట్టుకున్నా మా ఇంటి ముందు ఉన్న చెట్టు కిందే పంచాయితీ తెగాలి. ఊర్లలో ఏ రాజకీయం గురించి రావాలాన్నా మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్లిపోవాలి. దీనిపై జర్నలిస్టు స్పందిస్తూ.. ఇంటి ముందు చెప్పులు వేసుకోకుండా వెళ్లాలనే వ్యూడల్‌ వ్యవస్థను మీరు సమర్థిస్తున్నారా? అంటే వంద శాతం మాది ఫ్యూడల్‌ కుటుంబమే' అని చెప్పుకున్నారు.

అట్లాంటి రేవంత్‌రెడ్డి ప్రజాస్వామికవాదిగా ఎందుకు మారుతాడు. ప్రజలు మా చేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారు. రోగి ఏది కోరుకుంటే డాక్టర్‌ అదే ఇస్తాడని ఆయనే గతంలో చెప్పారు. ఇట్లా ఎనుముల రేవంత్‌రెడ్డిలో అనేక కోణాలున్నాయి. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అని కొంతమంది అనుకున్నారు. కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయనలో ఉండే అపరిచితుడు మెల్లగా బైటికి వస్తున్నాడు. విమర్శలను తట్టుకోలేకపోతున్నాడు. ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నిస్తరా? అన్నట్టు నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. సినిమాల్లో భూస్వాములు ఎలా వ్యవహరిస్తారో రేవంత్‌రెడ్డి వ్యవహారం కూడా అలానే ఉన్నది. ఆయనేమీ దాచుకోవడం లేదు. దొరతనానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన ప్రతి అడుగు కనిపిస్తుంది. అందుకే రుణమాఫీ అయిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ గొప్పగా ప్రచారం చేసుకుని ఊరూరా హోర్డింగ్స్‌, పోస్టర్ల ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. రాష్ట్రం మొత్తం కాదు కనీసం సీఎం సొంత ఊరులో కొండారెడ్డి పల్లిలో అయినా సంపూర్ణంగా రుణమాఫీ అయిందా అని తెలుసుకుందామని వెళ్తే.. ఆయనే గతంలో చెప్పినట్టు తనలోని ఫ్యూడల్‌ ఆలోచనలను కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తల ద్వారా అమలు చేశారు. ఆయ్‌ మా ఊరికి వచ్చి బతికి బట్టకడుతారా? అన్నట్టు మీడియా వాళ్లపై వెంటపడ్డారు. మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా అక్కడికి వచ్చి వారి దౌర్జన్యాన్ని చూపెట్టారు. ఇదంతా నిన్న సోషల్‌ మీడియాలో కొన్ని మీడియా ఛానళ్లలో కనిపించింది.

పదేళ్లు ఫ్యాక్షన్‌ రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్‌ భావజాలాన్ని, ఫ్యాక్షన్‌ కల్చర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఒకవైపు రాష్ట్రంలో అప్పులపాలైందని ప్రచారం చేస్తూ.. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు వస్తారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను విఫల రాష్ట్రంగా చేసే ప్రయత్నంలో రేవంతే చెప్పినట్టు ఆయన సహచరుడు సూత్రధారి అయితే పాత్రధారి ఈయనే. ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నమరొకాయన ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు. ఇలాంటి వాళ్లు తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారో తొమ్మిది నెలలుగా వారి పాలనా విధానాలు, వారి మాటలు చూస్తుంటే తెలిసిపోతుంది.

Tags:    

Similar News