రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు

వ్యవసాయ విధానం లేకపోవడంతో దేశవ్యాప్తంగా 1995 - 2022 వరకు సుమారు నాలుగు లక్షల మంది రైతులు ఏర్పాటు చేసుకున్నట్లు NCRB నివేదికలు తెలుపుతున్నాయి.

By :  Raju
Update: 2024-07-27 02:45 GMT

భారతదేశ వ్యవసాయదారుడు "అప్పుల్లోనే పుట్టి అప్పుల్లోని చనిపోతారు". స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన పైన ఉన్న నానుడి లో ఎలాంటి మార్పు లేకపోగా నిత్యం రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు 2000 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలస పోతున్నారు. మిగతా 40 శాతం మంది వ్యవసాయంలో లాభాలు వచ్చే వ్యవసాయం చేయడం లేదు. మిగతా వారు లాభాలు వచ్చి వ్యవసాయం చేయడం లేదు. కేవలం వారు ఉన్న ఊరును, కన్నతల్లిని, భార్యా పిల్లలను వదిలిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్లలేక బిక్కు బిక్కు మంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మనదేశంలో మానవ సంపద చాలా పుష్కలంగా ఉన్నది. ప్రపంచంలో పండే అన్నిరకాల పంటలూ పండే భూములు వాతావరణం, పండించే రైతులు దేశంలో ఉన్నారు. కేవలం ఆదాయభద్రతలేని ఏకైక రంగం వ్యవసాయం. కనీసం పెట్టిన పెట్టుబడులు రాక కుటుంబాన్ని పోషించుకోలేక తెచ్చిన అప్పులను తీర్చే మార్గం లేక వారి వారి పంట పొలాల్లోనే ఉరికొయ్యలను ముద్దాడుతున్న రైతుల శవాలను నిత్యం దినపత్రికలలో చూస్తూనే ఉన్నాం.

ఇప్పటికీ భారత దేశ ప్రజలు సుమారు 63 శాతం వ్యవసాయరంగంపై ఆధారపడి వ్యవసాయ ప్రాధాన్యం గల దేశంగా పేరుగాంచిన మనదేశంలో ఇప్పటికి వ్యవసాయ విధానం లేకపోవడం వ్యవసాయం పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు లేవని మార్చిలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు లేవు అనడం రైతుల పట్ల నాయకులకు, ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నట్లు లెక్క! ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అబద్ధాలు మాట్లాడటం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రభుత్వంలోకి వచ్చినంక ఇంకొక మాట రెండు నాలుకల ధోరణి రైతుల పట్ల సరైనది కాదు.పార్లమెంటు ఎన్నికల ముందు మార్చ్ నెలలో నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సభలో చెప్పారు. అట్టి ఆధారాలను సీఎంఓ కు పంపినట్లు కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ అన్నట్లు రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదు.

అటు ప్రతిపక్షమైనా ఇటు ప్రభుత్వం అయినా రైతుల బతుకులకు భరోసానిచ్చే మాటలు మాట్లాడాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడే మాటలు మాట్లాడటం మంచిది కాదు. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగవు. వ్యవసాయ విధానం లేకపోవడంతో దేశవ్యాప్తంగా 1995 - 2022 వరకు సుమారు నాలుగు లక్షల మంది రైతులు ఏర్పాటు చేసుకున్నట్లు NCRB నివేదికలు తెలుపుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాలలో NCRB రిపోర్ట్ ప్రకారం రైతు ఆత్మహత్యల వివరాలు:-

2004- 2030

2005 -1802

2006 -1932

2007- 1071

2008 -1575

2009 1213

2010-1536

2011 -1316

2012 -1576

2013 -2014

2014 - 449

Total:-16,494

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల్లో జరిగిన రైతు ఆత్మహత్యల వివరాలు:-

2014- 898 (02-06-2014 నుండి)

2015-1400

2016- 645

2017 -851

2018 -908

2019 -499

2020 -471

2021-352

2022 -178.

(NCRB రిపోర్ట్ ప్రకారం)

2023-215

2024- 121 (20-07-2024 నాటికి)

Total:- 6,538

ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య తగ్గిన మాట వాస్తవం.

భవిష్యత్తులో సాగునీరు అందక, ప్రకృతి కరుణించక కరువు పెరిగి ఇంకా ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది.ఈ సంవత్సరం యాసంగి పంట ప్రతి గ్రామంలో సుమారు 20 శాతం పంటలు ఎండిపోవడం మనం చూశాం. దీనికి ముఖ్యంగా గత వానకాలంలో అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలు మళ్లీ వర్షాలు లేకపోవడంతో, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ లోపంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం, ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు లేక నీళ్లు లేకపోవడం. దీనితో రాష్ట్ర రైతాంగం మళ్లీ పది సంవత్సరాల తర్వాత పంటలు ఎండిపోవడంతో పంటలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి బోర్లు వేస్తూ బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోవడంతో పాటు అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్లీ 10 సంవత్సరాల తర్వాత యాసంగి పంటను కాపాడుకోవడానికి బోర్లు వేయడం మొదలుపెట్టారు. ఈ వాన కాలంలో వర్షాలు సకాలంలో పడక ఆరుతడి పంటలన్నీ ఒకటికి రెండుసార్లు విత్తనాలు పెట్టిన సరిగ మొలవకపోవడంతో రైతులు అప్పలపాలయ్యారు. చాలా జిల్లాల్లో వానాకాలం పంటల మీద ఆశలు వదులుకున్నారు. ఈ సూచనలతో తెలంగాణలో కరువు ప్రధాన గంటికలు మోగిస్తుంది. ఈ కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువా? ప్రకృతి తెచ్చిన కరువా? గత ప్రభుత్వం తెచ్చిన కరువా? అనేది పక్కన పెట్టి ఇప్పుడు రైతాంగానికి బతుకు పైన భరోసా ఇచ్చి రైతాంగని కాపాడుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నీటి కరువు ఒక వైపు, అప్పుల భారం ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు రైతును ఎప్పుడు కుంగదీస్తూనే ఉండడంతో భవిష్యత్తు మీద భరోస లేక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని రకాల వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు GO .Ms.NO.194 ప్రకారం ప్రతి కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది.

యాసంగి, వానాకాలంలో ఈ కరువు పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ,పౌర సమాజం పైన ఉంది. రైతన్నలారా ఎవరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు అండగా తెలంగాణ సమాజం ఉంది.

పులి రాజు,

సామాజిక కార్యకర్త,

9908383567

Tags:    

Similar News