నిండా ముంచి.. అన్నగా అండగా ఉంటానంటే నమ్ముతరా?

అధికారంలోకి వచ్చాక కనిపించడమే మానేసిన సీఎం, ఆందోళన చేస్తున్నది నిరుద్యోగుల కాదు, రాజకీయ నిరుద్యోగులు అని అడ్డగోలుగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పడు మళ్లీ అన్నగా అండగా ఉంటానంటే ఎవరూ నమ్మరు అంటున్నారు.

By :  Raju
Update: 2024-07-27 02:15 GMT

అగ్నిమాపక శాఖ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న సీఎం తన ప్రసంగంలో అక్కడ కూడా అబద్ధాలు ఆడారు. కాంగ్రెస్‌ హయాంలో 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. గత ప్రభుత్వ ఇచ్చిన 15,640 కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు, ఫిజికల్‌ టెస్టులు అన్నీ పూర్తయ్యాక కోర్టు కేసుల కారణంగా నియామక ప్రక్రియ ఆగిపోయింది. ఈ కేసు వేసింది కూడా కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నేతలే. ఇదీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకున్నది. గురుకుల పోస్టులతో సహా అన్నీ గత ప్రభుత్వ హయాంలోనే వచ్చినవే. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేసింది. దానికి కొనసాగింపుగా కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కూడా శ్వేత పత్రం రిలీజ్‌ చేసి నిజాయితీని నిరూపించుకోవాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

రానున్న మూడు నెలల్లో మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని మీకు అన్నగా అండగా ఉంటానని సీఎం అనడంపైనా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమరణ నిరాహారదీక్షలు చేసినా, నెల రోజులు ఆందోళనలు చేసినా ఎన్నడూ పిలిచి మాట్లాడలేదు. నిరుద్యోగుల డిమాండ్లు ఏమిటో అడగలేదు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై బట్టికాల్చి మీద వేసినట్టు అబద్ధాలు ప్రచారం చేసి, నిరుద్యోగులను రెచ్చగొట్టి, తాము అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని తీరా అధికారంలోకి వచ్చాక కనిపించడమే మానేసిన సీఎం, ఆందోళన చేస్తున్నది నిరుద్యోగుల కాదు, రాజకీయ నిరుద్యోగులు అని అడ్డగోలుగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పడు మళ్లీ అన్నగా అండగా ఉంటానంటే ఎవరూ నమ్మరు అంటున్నారు.

రానున్న మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి వాటిలో బీఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన గ్రూప్‌-1 503 పోస్టులను 60 పోస్టులు కలిపి 563 పోస్టులు తామే ఇచ్చినవే. ఇవి కూడా కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటున్నది. అలాగే గత ప్రభుత్వం 5,059 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీని రద్దు చేసి దానికి అదనంగా 6,000 పోస్టులు కలిపి 11,062తో మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను దగా చేసింది. గ్రూప్‌-2లో 783, గ్రూప్‌-3 లో 1365 పోస్టులకు బీఆర్‌ఎస్సే నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటికి పరీక్షలు ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటున్నవి ఉద్యోగాలు ముఖ్యమంత్రి స్వయంగా గత ఏడాది మార్చిలో అసెంబ్లీలో కేసీఆర్‌ 80 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రకటన మేరకే విడులయ్యాయి. ఆ నియామకాల భర్తీ ప్రక్రియనే రేవంత్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల హామీలో ఆచరణలో అమలు కాలేదు. బడ్జెట్‌లో ప్రభుత్వ విధానం చూసిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాల మాట ఓ స్త్రీ రేపు రా అని చిన్నప్పుడు గోడల మీది రాత లెక్కనే కనిపిస్తున్నది.

Tags:    

Similar News