రూ.లక్ష వరకు అప్పులున్నోళ్లు 11.50 లక్షల మందేనా?

రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ గోల్ మాల్..గత ఐదేళ్లలో భారీగా పెరిగిన రుణ గ్రహీతలు.. అయినా లబ్ధిదారుల సంఖ్య భారీ గా తగ్గించి చూపించిన ప్రభుత్వం

Update: 2024-07-18 10:09 GMT

బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) నుంచి షార్ట్ టర్మ్ క్రాప్ లోన్లు 11.50 లక్షల మందేనా.. వాళ్లు తీసుకున్న అప్పుల మొత్తం కూడితే రూ.7 వేల కోట్లేనా..? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది నిజమేనా.. గోల్ మాల్ గోవిందం ఏమైనా జరుగుతోందా..? ఇప్పుడు అందరినీ ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు బ్యాంకులు, పీఏసీఎస్ ల నుంచి క్రాప్ రూణాలు తీసుకున్న రైతుల సంఖ్య భారీగా పెరిగింది. అయినా రేవంత్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం 11.50 లక్షల మంది అప్పులు మాత్రమే మాఫీ చేయబోతుంది. రూ.2 లక్షల వరకు లోన్లు తీసుకున్నారని చెప్తోన్న ఇంకో 14 లక్షల మందికి మరో రెండు విడతల్లో రుణమాఫీ చేయడానికి ప్రయత్నిస్తోంది. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ అంటే లబ్ధిపొందే రైతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అనుకున్నారంతా.. కానీ రేవంత్ సర్కారు తన మంత్రదండంతో లబ్ధిదారుల సంఖ్యను 55 శాతం తగ్గించింది. తద్వారా ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకొని రైతులపై అప్పుల భారాన్ని అలాగే ఉంచింది.

స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్ లో 2023 –24 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.64,940 కోట్ల షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్లు ఇచ్చినట్టు తమ నివేదికలో వెల్లడించారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరం నుంచి క్రాప్ లోన్లు తీసుకుంటున్న రైతుల సంఖ్యతో పాటు వాళ్లు అప్పుగా తీసుకునే మొత్తం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2020 –21లో రూ.41 వేల కోట్లకు పైగా క్రాప్ లోన్లు తీసుకుంటే వాటిని రీ షెడ్యూల్ చేయడం.. కొత్త లోన్లు తీసుకోవడంతో ఆ పరిమితి 2023 –24 నాటికి రూ.64,940 కోట్లకు చేరింది. ఇంత పెద్ద మొత్తంలో రైతులు క్రాప్ లోన్లు తీసుకున్నా ఎందుకు రైతు రుణమాఫీకి చేసే వ్యయంతో పాటు లబ్ధిదారుల సంఖ్య తగ్గింది అంటే దాని వెనుక పెద్ద కథనే ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 2018లో 37 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198 కోట్ల అప్పులు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. అప్పుడు రూ.లక్ష వరకు లోన్లు ఉన్న రైతులను లెక్కలోకి తీసుకుంటే 37 లక్షల మంది లబ్ధిదారులుగా తేలారు. వాళ్లకు మాఫీ చేయాల్సిన మొత్తం రూ.19,198 కోట్లుగా లెక్కకు వచ్చింది. ఆ తర్వాత అప్పులు తీసుకున్నోళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.. అలాగే వాళ్లు తీసుకున్న అప్పు మొత్తం కూడా ఎక్కువే ఉంది. అయినా రేవంత్ సర్కారు రుణమాఫీ చేయబోయే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి ఏకైక కారణం.. రేషన్ కార్డు అనే నిబంధన మాత్రమే.. రేషన్ కార్డులు లేని 6 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఈ మేరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. ఇంకోవైపు వేర్వేరు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్లు రేషన్ కార్డులో ఒకే కుటుంబంగా ఉన్నారు. దీంతో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్న ఆ కుటుంబం మొత్తం తీసుకున్న లోన్లనే గరిష్టంగా రూ.2 లక్షల వరకే మాఫీ చేయబోతున్నారు. ఫలితంగానే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య మూడింతలు తగ్గిపోయింది.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు పర్యాయాలు రుణమాఫీ చేస్తే ఏ ఒక్కసారి కూడా కుటుంబాన్ని యూనిట్ గా గుర్తించేందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టలేదు. దీంతో మొదటి సాని 35.50 లక్షల మంది రైతులు లబ్ధిదారులు కాగా, రెండోసారి 37 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. అప్పుడు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాకపోవడంతో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేశారు. అతడికి పింక్ రేషన్ కార్డు ఉన్నా, అసలు కార్డు లేకపోయినా మాఫీ వర్తింపజేశారు. ఈసారి నోటిమాటగా పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పినా, రేషన్ కార్డుతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుతున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పడంతో లబ్ధిదారుల సంఖ్య మూడింతలు తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల అప్పుల విలువ రూ.49,500 కోట్లు అని అంచనా వేస్తున్నారు. అందులో రూ.31 వేల కోట్లు మాఫీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే ఏకంగా రూ.18,500 కోట్ల అప్పులను మాఫీ చేయకుండా తప్పించుకోబోతున్నారు. ఒక్క రేషన్ కార్డు అనే నిబంధనను అడ్డుగా పెట్టుకొని రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేయబోతుంది. ఏటా పంట రుణాలు పెరిగినప్పుడు రుణమాఫీతో లబ్ధిపొందేవారి సంఖ్య కూడా పెరగాలి కదా అని రైతు సంఘాల నాయకులు వ్యవసాయ శాఖ అధికారులను నిలదీసినా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. రైతులు, రైతు సంఘాల ఆందోళనలతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక కొర్రీలతో తన హామీలకు నిలువెల్లా తూట్లు పొడుస్తున్నారు. పైపెచ్చు రాహుల్ గాంధీ మాట ఇచ్చిండంటే నెరవేరుతది అన్న నమ్మకాన్ని దేశానికి కల్పించబోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నరు.

Similar News