మాఫీ చేసినమని ఇన్ని రోజులు.. ఆందోళన వద్దని ఇప్పుడు!!

రుణమాఫీపై కాంగ్రెస్‌ నేతల్లోనే కన్ఫ్యూజన్‌.. సీఎం, మంత్రుల ప్రకటనలతో మరింత గందరగోళం.. ఆగమవుతున్న అన్నదాతలు

Update: 2024-08-21 12:31 GMT

రూ.2 లక్షల వరకున్న క్రాప్‌ లోన్లన్నీ మాఫీ చేశామని రెండు రోజుల క్రితం వరకు గట్టిగా చెప్పిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు డిఫెన్స్‌ లో పడ్డారు. తమ మండలం, నియోజకవర్గం పరిధిలోనే వేలాది మంది రైతులు రుణాలు మాఫీ కాక బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) ల చుట్టూ తిరుగుతుండటంతో మాఫీ విషయంలో తొందరపడి వ్యాఖ్యలు చేస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తించారు. ఆగస్టు 15న వైరా వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి తమ ప్రభుత్వం రికార్డు సమయంలోనే రూ.31 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిందని చెప్పడంతో అదంతా నిజమేనని నమ్మి పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు రుణమాఫీపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాళ్ల ఫాలోవర్లు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ ఇన్‌చార్జీలను అనుసరించి వాళ్లు అదే విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జెడ్పీటీసీ, మున్సిపల్‌ చైర్మన్‌ స్థాయి పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్‌ లీడర్లు సైతం తమ సోషల్‌ మీడియా పేజీల్లో కాంగ్రెస్‌ తోనే రైతు రాజ్యం సాకారమైందని.. హామీ ఇచ్చాం.. రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆగస్టు 15 తర్వాత నాలుగైదు రోజుల పాటు రుణమాఫీని కాంగ్రెస్‌ లీడర్లు గొప్పగా ప్రచారం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని ప్రయత్నించారు. క్షేత్ర స్థాయిలో సీన్‌ రివర్స్‌ కొట్టడంతో రుణమాఫీపై ప్రచారానికి పుల్‌ స్టాప్‌ పెట్టారు. రుణమాఫీపై ఆందోళన వద్దని.. అందరు రైతుల రుణాలు మాఫీ అవుతాయని డ్యామేజ్‌ కంట్రోల్‌ కు ప్రయత్నిస్తున్నారు.

చాలెంజ్‌ చేశాం కాబట్టి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేశామని అనిపించుకోవడానికి సీఎం రేవంత్‌ రెడ్డి వ్యవహరించిన తీరు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి ముందరకాళ్ల బంధం వేసింది. రైతు రుణాల మాఫీ పేరుతో పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ఆశపడ్డారు. అందుకే రుణమాఫీపై మాట తప్పారని బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తే వారిపై రాజకీయంగా ఎదురుదాడికి ప్రయత్నించారు. సీఎం చెప్పారంటే రైతులందరి రుణాలు మాఫీ అయిపోయాయనే కాంగ్రెస్‌ లీడర్లందరూ అనుకున్నారు. రైతులు రోడ్ల మీదికి వచ్చిన తర్వాతకాని వారికి తత్వం బోధ పడలేదు. మొదటి రోజు సీఎం శవయాత్ర చేస్తే అది బీఆర్‌ఎస్‌ కుట్ర అన్నారు. రెండో రోజు నుంచి బ్యాంకులు, పీఏసీఎస్‌ ల దగ్గర రైతుల పడిగాపులు, తిప్పలు చూసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఆ కింది స్థాయి కాంగ్రెస్‌ లీడర్ల ఫ్యూజులు పేలిపోయాయి. రుణమాఫీ పేరుతో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాలు, మేయర్‌ పదవులు, సర్పంచ్‌ సీట్లు దక్కించుకుందామని అనుకుంటే రేవంత్‌ రెడ్డి మొదటికే మోసం తెచ్చారనే హైరానా వారిలో మొదలైంది. బ్యాంకులు, ఏవో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్న అన్నదాతలను నేరుగా కలిసే ధైర్యం కూడా కాంగ్రెస్‌ నేతలు చేయలేకపోతున్నారు. ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుండబద్దలు కొడితే.. రైతులకు రుణమాఫీ రూపంలో ప్రభుత్వం ఇంకా రూ.12 వేల కోట్లు బాకీ ఉందని మరో మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. రుణమాఫీలో వాస్తవాలు ఇంత దారుణంగా ఉన్నాయని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్‌ నేతలు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. రుణమాఫీ కాని రైతులెవరూ ఆందోళన చెందొద్దని.. అందరి రుణాలు మాఫీ చేసే బాధ్యత తమదని నిత్యం ప్రెస్‌ నోట్లు రిలీజ్‌ చేస్తున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేసీఆర్‌ నాలుగో విడత (రూ.99 వేల వరకు ఉన్న రుణాలు) రుణమాఫీ చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి.. ''కేసీఆర్‌ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసిండు.. ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల వరకు లోన్లు తెచ్చుకోండి.. డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది.. నేనే ఆ లోన్లు మాఫీ చేస్తా'' అని హామీ ఇచ్చారు. రేవంత్‌ మాటలు నమ్మి కొందరు క్రాప్‌ లోన్లు తెచ్చుకున్నారు. అప్పటికే రైతులు తీసుకున్న క్రాప్‌ లోన్లు కూడా కలిపితే రూ.49 వేల కోట్లు రైతులు రుణాలు తీసుకున్నట్టుగా ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆ రుణాలన్నీ డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యంలో మాఫీ చేయబోతున్నామని నమ్మబలికారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేవంత్‌ సీఎం అయ్యాక రూ.40 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రైతులందరి రుణాలు మాఫీ చేయబోతున్నామని చెప్పారు. అప్పుడు ఏ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే ఆ దేవుడిపై ఒట్టు పెట్టి రుణమాఫీ చేసి తీరుతానని హామీ ఇచ్చారు. కేబినెట్‌ సమావేశంలో రైతు రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమని తీర్మానం చేశారు. బడ్జెట్‌ లో రుణమాఫీకి రూ.26 వేల కోట్లు కేటాయించారు. మూడు విడతల్లో కలిపి 22 లక్షల మందికి పైగా రైతులకు సుమారు రూ.18 వేల కోట్లు మాఫీ చేశారు. తాము మాట ఇచ్చినట్టుగా రుణమాఫీ పూర్తి చేశామని.. తమను సవాల్‌ చేసిన హరీశ్‌ రావు పదవికి రాజీనామా చేయాలని రాయడానికి వీలు లేని భాషలో సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. అదే రోజు ముఖ్యమంత్రి సవాల్‌ ను సాక్ష్యాధారాలతో సహా హరీశ్‌ తిప్పికొట్టారు. అంతే రేవంత్‌ మౌస్‌ పీస్‌ మ్యూట్‌ మోడ్‌ లోకి వెళ్లింది. తనకు రెస్క్యూగా రావాలని.. రుణమాఫీపై ప్రెస్‌మీట్‌ లు పెట్టి సమర్థించాలని మంత్రులను వేడుకోవాల్సిన పరిస్థితి రేవంత్‌ కు ఎదురైంది. ఈ నిజాలన్నీ క్షేత్ర స్థాయి కాంగ్రెస్‌ నేతలకు ఆలస్యంగా తెలియడంతో.. ''డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది'' అని సైలెంట్‌ అయిపోయారు. అలాగే మ్యూట్‌ మోడ్‌ లోనే ఉంటే పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో నిండా మునుగుతామని గుర్తించి రైతులు ఆందోళన చెందొద్దు.. హైరానా పడొద్దు.. అందరి రుణాలు మాఫీ అవుతాయని ధైర్యం చెప్పే ప్రయత్నం ప్రకటనల ద్వారా చేస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్‌ నేతల్లో ఎంతలో ఎంత తేడా?! ''తాకితే గానీ మొగ్గడు.. తడిస్తేగానీ గుడిసె కప్పడు'' అన్న వాస్తవాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ లీడర్లు రానున్న రోజుల్లో ఇంకెన్ని విన్యాసాలు చేయాల్సి వస్తుందో!??

Tags:    

Similar News