రేవంత్ మెడకు ‘హైడ్రా’ ఉచ్చు

లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన కాంగ్రెస్ హైకమాండ్.. ఏమిటా ఏకపక్ష కూల్చివేతలని ఆగ్రహం.. మాజీ కేంద్ర మంత్రి వెంచర్ లో కూల్చివేసిన నిర్మాణాలను మళ్లీ నిర్మించాలని ఆదేశం

Update: 2024-08-23 12:56 GMT

సీఎం రేవంత్ రెడ్డి మెడకు ‘హైడ్రా’ ఉచ్చు చిక్కుకుంది. ఢిల్లీకి పిలిపించి మరి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ముఖ్యమంత్రికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది.. ఏమిటా ఏకపక్ష కూల్చివేతలు.. అసలు ఏం చేద్దామనుకుంటున్నావ్.. పార్టీని ఉంచుతావా ముంచుతావా.. పర్సనల్ ఎజెండాతో పని చేయొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ హైకమాండ్ లోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇద్దరు కలిసే రేవంత్ రెడ్డికి క్లాస్ పీకారు. హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ యూపీఏ –2 ప్రభుత్వంలో కేంద్రంలో టాప్ –5 పోర్ట్ఫోలియోల్లో ఒక ప్రధాన శాఖకు సహాయ మంత్రిగా పని చేసిన సీనియర్ నేత సమక్షంలోనే జరిగింది. సదరు మాజీ మంత్రి ఫిర్యాదు మేరకే కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అర్జంట్ గా ఢిల్లీకి రావాలని ఆదేశించారు. రాహుల్ గాంధీ సిరియస్ గా ఉన్నారని.. వెంటనే ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించారు. కేసీ వేణుగోపాల్ ఫోన్ తో ఆగమేఘాల మీద ఢిల్లీలో ల్యాండ్ అయిన రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయమే పార్టీ హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యారు.

నిర్మాణాలకు ప్రభుత్వంలోని శాఖలే పర్మిషన్ లు ఇచ్చి నిర్మాణాలు సగానికి పైగా పూర్తయిన తర్వాత కూల్చివేతలు ఏమిటని కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కూల్చేసే ముందు అవి ఎవరి నిర్మాణాలో తెలుసుకోవాలి కదా.. ఎఫ్ టీఎల్ పేరుతో పట్టా భూముల్లోని నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటీ? ఏవైనా ఇరెగ్యులారిటీస్ ఉంటే ముందు నోటీసులు ఇవ్వాలి.. తర్వాతే కదా యాక్షన్ తీసుకోవాల్సింది.. ? ఏకపక్షంగా భారీ యంత్రాలు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. సదరు మాజీ కేంద్ర మంత్రి నిర్మాణాల్లో అక్రమాలు ఏమున్నాయో చెప్పాలని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు నిలదీశారు. ఏమి చెప్పాలో అర్థం కాక ముఖ్యమంత్రి అక్కడ నీళ్లు నమిలినట్టుగా తెలిసింది. సదరు మాజీ కేంద్ర మంత్రికి చెందిన స్థలంలో ఎంత వరకు నిర్మాణాలు పూర్తయ్యాక కూల్చివేశారో అప్పటి వరకు మళ్లీ భవన నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. అంతేకాదు హైడ్రా పేరుతో దూకుడుగా వెళ్లొద్దని.. సామాన్యులను ఇబ్బంది పెడితే అది కాంగ్రెస్ పార్టీకి పెను నష్టం తెస్తుందని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు అందితే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ అగ్రనేతలిద్దరు మద్దెల ధరువులాగా చెరోవైపు వాయించడంతో మాజీ మంత్రి వెంచర్ ను రీ కన్స్ట్రక్షన్ చేసి తిరిగి అప్పగిస్తానని హామీ ఇచ్చారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అసలు ఈ సందర్భంగా ఎలాంటి చర్చ జరగలేదని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఈ క్లాస్ తర్వాత బతుకు జీవుడా అని సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి బయటపడ్డారని చెప్తున్నారు.

యూపీఏ ప్రభుత్వంలో పదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన ఉమ్మడి ఏపీకి చెందిన సీనియర్ నాయకుడికి గాంధీ కుటుంబ పెద్దలతో సాన్నిహిత్యం ఉంది. అందుకే యూపీఏ –2 ప్రభుత్వంలో ఆయనకు టాప్ –5 పోర్ట్ఫోలియోల్లో కీలకమైన మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రిని చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతిన్న సదరు మాజీ మంత్రికి పార్టీ హైకమాండ్ దగ్గర పరపతి అలాగే ఉంది. అలాంటి కాంగ్రెస్ సీనియర్ నేత వెంచర్ పైకి రేవంత్ రెడ్డి హైడ్రాను పంపారు. ఆయన పార్టీలోని సీనియర్ లీడర్ల ద్వారా రేవంత్ రెడ్డిని అప్రోచ్ కావడానికి ప్రయత్నిస్తే రేవంత్ లైట్ తీసుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మాజీ మంత్రి ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ ను కలిసి హైడ్రా పేరుతో రేవంత్ సాగిస్తున్న హైడ్రామాను వివరించారు. తర్వాత రాహుల్ గాంధీని కలిసి ఏం జరిగిందో వివరించారు. రేవంత్ ను వెంటనే ఢిల్లీకి పిలిపించాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. సదరు కేంద్ర మంత్రి ఇష్యూ సెటిల్ చేయడంతో పాటు రేవంత్ ను సెట్ రైట్ చేయాల్సి ఉందని కాస్త కటువుగానే రాహుల్ చెప్పారట. ఈ ముచ్చట తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా సదరు కేంద్ర మాజీ మంత్రికి ఫోన్ చేశారు. హైదరాబాద్ కు వస్తే కలిసి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకుందామని ఆఫర్ ఇచ్చారు. అందుకు సదరు కేంద్ర మంత్రి ససేమిరా అన్నారు. దీంతో రేవంత్ కు ఢిల్లీకి ప్రయాణం కాకతప్పలేదు. ఢిల్లీకి వెళ్లి హైకామండ్ తో చీవాట్లు తినకా తప్పలేదు. కాంగ్రెస్ లో ఎప్పుడూ తన మాటే చెల్లుబాటు అవుతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే రేవంత్ ఏకపక్షంగా అడుగులు వేసి అడ్డంగా బుక్కయ్యారని.. రానున్న రేవంత్ ప్రతి కదలికపై హైకమాండ్ సర్వేలెన్స్ ఉంటుందని పార్టీ ముఖ్యులు చెప్తున్నారు.

Tags:    

Similar News