కాంగ్రెస్‌ చేసింది గోరంత.. చెప్పుకుంటున్నది కొండంత: పల్లా

రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా సీఎం ,మంత్రులను రైతులను మాయ చేస్తున్నారు. రైతులకు అంతా మేమే చేశామని, కేసీఆర్ హయం లో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారని పల్లా విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-19 07:12 GMT

కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు చూసి గోబెల్స్ బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునే వారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,కోవా లక్ష్మి ,బీ ఆర్ ఎస్ నేతలు రాకేష్ రెడ్డి ,రాం బాబు యాదవ్ ,తుంగ బాలులతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ కోసం విడుదల చేసింది 6 వేల కోట్ల రూపాయలేనని, ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం ..డబ్బులపరంగా చూస్తే 20 శాతం మాత్రమేనని అన్నారు. సీఎం చెబుతున్న లెక్కల ఆధారంగానే మేము మాట్లాడుతున్నామని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత ..కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారు.

రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా సీఎం ,మంత్రులను రైతులను మాయ చేస్తున్నారు. రైతులకు అంతా మేమే చేశామని, కేసీఆర్ హయం లో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయం లో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించాం. రెండో విడత లో 19 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీకి సిద్ధంగా ఉంచుకుని 12 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. ఇంకా ఏడు వేల కోట్లు కాంగ్రెస్ ఈసీ కి చేసిన పిర్యాదు తో చెల్లించకుండా మిగిలిపోయాయి. ఆ ఏడు వేల కోట్లు మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లాయని ఆరోపించారు. లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయం లో 19 వేల కోట్లు ఉంటే ఇపుడు 6 వేల కోట్ల కు ఎలా తగ్గింది? ఎవర్ని మోసం చేస్తున్నారు? ఆంక్షల పేరిట కాంగ్రెస్‌ సర్కార్‌ రైతుల రుణ మాఫీ ని కొందరికే పరిమితం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ హయం లో రైతుల అకౌంట్ల లోకి పదేళ్ల లో లక్ష కోట్ల రూపాయలు చేరింది. 70 వేల కోట్లు రైతు బంధు కింద రైతులకు ఇచ్చారు. 30 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కింద ఇచ్చారు. 7 వేల కోట్లు లక్షా 20 వేల మంది రైతుల కుటుంబాలకు బీమా కింద చెల్లించారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబరాలు చేసింది. ఆయన కట్టిన సచివాలయం నుంచి రైతు రుణ మాఫీ చేశారని తెలిపారు.కాంగ్రెస్ నేతలకు బూతులు తప్ప రైతుల మీద శ్రద్ధ లేదన్నారు. మా హయం లో పంట ఉత్పత్తి ఉత్పాదకత పెంచాం ప్రతి గింజ కొన్న్నాం రైతుల ఆనందాన్ని పెంచాం. రైతు భరోసా ఎందుకు వేయలేదు ..ఇంకా డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు.

వీటిపై మంత్రులకు వాస్తవాలు తప్ప అన్నీ వస్తున్నాయి. రైతులు కూడా టాక్స్ పేయర్స్ అని, వారిని కించపరిచేలా మంత్రులు మాట్లాడొద్దు సూచించారు. కాంగ్రెస్ చెప్పింది ఏమీ చేయలేదని, ఆపార్టీ నేతల మొహం లోనే ఆనందం కనిపిస్తుంది తప్ప రైతుల మొహం లో లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. రైతు భరోసా కింద 12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రుణ మాఫీ కింద 6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి.

రుణ మాఫీని కేసీఆర్ ఏ ఆంక్షలు లేకుండా అమలు చేసినట్టు రేవంత్ అమలు చేయాలని పల్లా డిమాండ్‌ చేశారు.హరీష్ రావు రాజీనామా సవాలు ను సీఎం కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారు. ఆరు గ్యారంటీలు ,పదమూడు హామీలతో పాటు రైతు రుణ మాఫీ ఆగస్టు 15 లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు సవాల్ విసిరారు.ఇప్పటీకీ ఆయన ఆ సవాల్ కు కట్టుబడి ఉన్నారు.

రాజీనామాల నుంచి పారి పోయింది రేవంత్ అని నిలకడ గా నిలబడ్డది హరీష్ రావు మాత్రమే అన్నారు. గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్న రేవంత్ మాట నిలుపుకోలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. మల్కాజ్ గిరి ,చేవెళ్ల ఇన్‌చార్జి గా బాధ్యత తీసుకున్న మీరు కాంగ్రెస్ ఓడిపోతే రాజీనామా చేశావా రేవంత్ అని నిలదీశారు. రైతు భరోసా కింద రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించాలి . ఏ ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. సిద్ది పేట కలెక్టర్‌ కాంగ్రెస్ నేతల సంబరాల్లో పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రేవంత్ సీఎం పదవిలోనూ అబద్ధాలు:కేపీ వివేకానంద

ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. రుణమాఫీపై రేవంత్ దేవుళ్ల పై ఒట్టు వేసి వాటిని నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. పైసా పైసా కూడబెట్టాం ..నిద్ర లేని రాత్రులు రుణ మాఫీ కోసం గడిపామని సీఎం అంటున్నారు. అంత కస్టపడి కూడబెడితే వంద కోట్ల రూపాయలు ప్రకటనలకు ఎందుకు ఖర్చు పెట్టారు ? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రకటనల కోసం వృథాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని రేవంత్ ఆరోపించి ఇపుడు ఏం చేస్తున్నారు ? ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు రేవంత్ తాత దా ? అని నిలదీశారు. మా నియోజక వర్గంలోని బౌరం పేట ప్రాథమిక సొసైటీ లో ఆరు వందల మంది ఉంటే వారిలో 5 వందల మంది లక్షలోపు రుణ మాఫీ కి అర్హులని మాఫీ అయింది 11 మందికి మాత్రమే అన్నారు. దూలపల్లి సొసైటీ లో కూడా చాలా తక్కువ మందికే రుణ మాఫీ వర్తించింది. కాంగ్రెస్ పార్టీ ని రైతులు వదిలిపెట్టరని..ముందున్నది మొసళ్ల పండగ అన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలతో రేవంత్ మోసం చేశారు ..ఇపుడు సీఎం పదవిలోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారని వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 9 న రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కొంతే చేసి ఎలా సంబరాలు చేసుకుంటారు ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి ..వాటి పై ప్రజలు నిలదీస్తూనే ఉంటారు. కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారు మా నాయకుడు ఏం చేశారో రైతులకు తెలుసని.. కాంగ్రెస్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితి లో లేరన్నారు.

రేవంత్ సీఎం లాగా వ్యవహరించాలి:కోవా లక్ష్మి

ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ.. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం కేవలం కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నదని, నాడు కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రజలను అడిగే హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇపుడు హామీల్లో కోత విధించేందుకు అభిప్రాయాల పేరు తో నాటకమాడుతున్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు.మేము ఎమ్మెల్యేలు గా గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఒక్క పైసా రాలేదు అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఓ న్యాయం ఇతర పార్టీలకు ఓ న్యాయం అన్నట్టు ఉన్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరు ఉన్నదన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ విషయం లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓ న్యాయం విపక్ష ఎమ్మెల్యేలకు ఓ న్యాయం అన్నట్టుగా ఉన్నది. రేవంత్ సీఎం లాగా వ్యవహరించాలి తప్ప పీసీసీ అధ్యక్షుడిగా కాదన్నారు. కేసీఆర్ హయంలో ఎమ్మెల్యేలందరినీ ఒకేలా చూశారని కోవా లక్ష్మి గుర్తు చేశారు. 

Tags:    

Similar News