కొలువుల భర్తీపై కాంగ్రెస్‌ కాలయాపన

ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి వింతగా ఉన్నది. గ్రూప్‌ 2,3 లలో పోస్టులు పెంచాలని, మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ ప్రకటన అనే మాటను నిలబెట్టుకోవాలని అడిగితే ఎదురుదాడి చేస్తున్నది.

By :  Raju
Update: 2024-06-19 04:38 GMT

ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి వింతగా ఉన్నది. గ్రూప్‌ 2,3 లలో పోస్టులు పెంచాలని, మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ ప్రకటన అనే మాటను నిలబెట్టుకోవాలని అడిగితే ఎదురుదాడి చేస్తున్నది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు నీటి మీది రాతలయ్యాయని ఇటీవల కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే దానికి నిదర్శనం అంటున్నారు. నిరుద్యోగులను నిండా ముంచుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను రెచ్చగొట్టి అనేక ఆశలు చూపెట్టింది. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లపై, ఉద్యోగాల నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయించింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ వేసిన కేసుల వల్లనే కొన్ని నియామకాల ప్రక్రియ ఆగిపోయిన విషయాన్ని విద్యార్థి సంఘాల నేతలతో పాటు నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇవాళ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దానికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణిని అవలంబిస్తున్నారు. నిన్నటిమొన్నటి దాకా బీఆర్‌ఎస్‌పై ఒంటికాలిపై లేచిన మేధావులు ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ ఏదీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, పూర్తైన పరీక్షలకు నియామకపత్రాలు అందించి అదే మా ఘనత అని ప్రచారం చేసుకోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

మొదటి క్యాబినెట్ లోనే మెగా డీఎస్పీకి ఆమోదం తెలుపుతామని ఇచ్చిన హామీకి తిలోదకాలు ఇచ్చింది.బీఆర్‌ఎస్‌ హయాంలో బిశ్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. తమకు అవకాశం ఇస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాగ్దానం చేసింది. వాటినే నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు అడిగితే పట్టించుకోవడం లేదు. వారి విజ్ఞప్తులను స్వీకరించడం లేదు. దీంతో నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ నేతల వద్దకు వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలని అడుగుతున్నది. విపక్ష నేతలు ప్రశ్నిస్తే దాన్ని తప్పుపడుతూ వాళ్లపైనే విమర్శలు చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగుల సమస్యలు ఇలా ఉంటే నియామకపత్రాలు అందుకుని పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికీ ఈ ప్రభుత్వంలో నిరాశే ఎదురవుతున్నది. అంతేకాదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రక్రియను ఈ ఆరునెలల కాలంలో పూర్తి చేసి ఉండేది. వాళ్లు ఇచ్చిన హామీ మేరకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేదని అంటున్నారు. కానీ ఎన్నికల్లో గెలవడానికి అలవికాని హామీలు ఇచ్చి ఇప్పుడేమో కారణాలు చెప్తూ, గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నది. కాంగ్రెస్‌ అంటేనే కాలయాపన. ఉద్యమకాలం నుంచి ఆపార్టీ వైఖరి అందరికీ అనుభవంలో ఉన్నది. ఉద్యోగాలు భర్తీ చేయడంపై ప్రభుత్వానికి చిత్తుశుద్ధి లేకనే కాలయాపన చేస్తున్నదని నిరుద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తున్న వారికి వాళ్లు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ సంగతేమో గాని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియనైనా పూర్తి చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News