అప్పుడూ.. ఇప్పుడూ కేంద్రానిది అదే తీరు!

వరదలు ముంచెత్తి సర్వస్వం కోల్పోయినా కనికరించని మోదీ సర్కారు.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులతో వరద సహాయక చర్యలు చేపట్టాలని సలహా

Update: 2024-09-04 10:19 GMT

''ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ గడిగడికి కయ్యం పెట్టుకున్నడు.. ప్రధాని హైదరాబాద్‌ కు వచ్చినా మర్యాద కోసమైన పోయి స్వాగతం పలుకలేదు.. అందుకే కేంద్రం తెలంగాణపై కక్ష గట్టింది.. రాష్ట్రానికి నిధులూ ఇవ్వలేదు.. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్నా, ప్రధాని మోదీని పెద్దన్నగా భావిస్తా.. తెలంగాణ ప్రగతి కోసం ఎన్నిసార్లయినా ప్రధాని దగ్గరికి, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల దగ్గరికి వెళ్లి కలుస్తా.. రాష్ట్రానికి అవసరమైన నిధులు సాధిస్తా..'' కొన్ని రోజుల వరకు క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలివి. కేసీఆర్ కేంద్రంతో పేచీ పెట్టుకున్నారు కాబట్టే తెలంగాణపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అవసరమైన నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతోందనే భ్రమలో రేవంత్ ఉండేవారు. తాను ముఖ్యమంత్రి అయి ఎక్కే విమానం.. దిగేవిమానం అన్నట్టు ఫ్లైట్‌ మోడ్‌లో ఢిల్లీకి అప్‌ అండ్‌ డౌన్‌ చేశాక కానీ రేవంత్‌ కు తత్వం బోధ పడలేదు. ప్రధానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అతిథి మర్యదలు చేసినంత మాత్రాన వాళ్లు కరుణించే రకం కాదు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి పోచంపల్లి ఇక్కత్‌ శాలువతో సన్మానించి.. కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ కళాఖండాలను బహుమానంగా ఇచ్చినంత మాత్రాన చలించిపోరు. వాళ్లు చేయాలనుకుంటే ఔట్‌ ది బాక్స్‌ కూడా సాయం చేయగలరు. చేయాల్సిన అవసరం ఉన్నా తెలంగాణకు ఎప్పటిలాగే మొండిచేయి చూపుతూనే ఉంటారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పదే పదే విజ్ఞప్తి చేశారు.. చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఎప్పటి మాదిరిగానే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, ఆ నిధులను వరద సహాయం కోసం ఉపయోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకేసి చీఫ్‌ సెక్రటరీకి లేఖ కూడా రాసింది.

కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ చొరవ తీసుకొని కేంద్రం నుంచి వరద సాయం కోసం 50 శాతం నిధులు తెస్తే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అంటే అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా రేవంత్‌ రెడ్డి ప్రకటన ఉంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్‌ రెడ్డి వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు రేవంత్‌ కేవలం రూ.5 లక్షల పరిహారం మాత్రమే ప్రకటించారు. తన పాత హామీ ఇప్పుడు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోననే భయంలో రేవంత్‌ ఉన్నారు. అందుకే రూ.25 లక్షల పరిహారం హామీ నుంచి తప్పించుకునేందుకు కేంద్రం నుంచి రాని అదనపు సాయం ముచ్చటను లంకె పెట్టారు. సీఎం డిమాండ్‌ తో తమ పార్టీ ఎక్కడ బద్నాం అవుతుందేమోనని కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ జాగ్రత్త పడ్డారు. వరద సాయం కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరారు. కేంద్ర మంత్రులు కోరడమే తరువాయి.. తెలంగాణలో ఉన్న నిధులే ఖర్చు చేసుకోండని కేంద్రం తేల్చిచెప్పింది.

స్టేట్‌ ఎకౌంటెంట్‌ జనరల్‌ నివేదిక ప్రకారం తెలంగాణలో 2024 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి రూ.1,345 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉన్నాయని తెలిపారు. 2022 -23 ఆర్థిక సంవత్సరం రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ రూ.188.80 కోట్లను 2023 జూలై 10న, 2023 -24 ఆర్థిక సంవత్సరం నిధులు రూ.198 కోట్లను ఈ ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేశామని తెలిపారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం ఫస్ట్‌ ఇన్‌ స్టాల్‌మెంట్‌ కింద రూ.208.40 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. గతంలో విడదుల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు సమర్పించక పోవడంతో ఆ నిధులు రిలీజ్‌ చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు యుసీలు సమర్పిస్తే కేంద్రం దానికి అనుగుణంగా సెంట్రల్‌ ఫండ్‌ రిలీజ్‌ చేస్తుందని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఉన్న రూ.1,345 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వరద సహాయక చర్యలకు ఉపయోగించుకోవాలని, ఆ వినియోగం యూసీలు కూడా తమకు సమర్పించాలన్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం ఏడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ లను బోట్లతో సహా సిద్ధంగా ఉంచామని, హకీంపేటలో రెండు రెండు ఐఏఎఫ్‌ హెలీక్యాప్టర్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో విపత్తులు సంభవించినప్పుడు ఈ తరహా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయినప్పుడు కూడా ఇలాగే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులే ఖర్చు చేసుకోవాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ఎంత సన్నిహితంగా ఉంటున్నా.. బడే భాయ్‌ అంటూ మోదీని భుజాన మోస్తున్నా.. జాతీయ విపత్తుగా ప్రకటించండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నా కేంద్రం గతంలో మాదిరిగానే రెస్పాండ్‌ అయ్యింది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు ఉదారంగా నిధులు విడుదల చేసే మోదీ.. తన చోటే భాయ్‌ రేవంత్‌ కు మాత్రం సారీ బ్రదర్‌ అంటూ ఝలక్‌ ఇచ్చారు. పాఫం చోటే భాయ్!!


ఎస్ డీఆర్ ఎఫ్ నిధులు వినియోగించుకోవాలని తెలంగాణకు కేంద్రం రాసిన లేఖ కోసం కింది లింక్ క్లిక్ చేయండి


Tags:    

Similar News