బడ్జెట్‌ పూర్తిగా అంకెల గారడీ..ఆసరా పెన్షన్‌ల పెంపు లేదు : హరీష్‌ రావు

బడ్జెట్‌లో ఆసరా పెన్షన్‌ల పెంపు ప్రస్తావనే తీసుకురాలేదని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు.

By :  Vamshi
Update: 2024-07-25 12:04 GMT

రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశకు గురి చేసిందని బీఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గ్యారంటీల గారడీ బడ్జెట్‌లో అంకెల గారడీ ప్రదర్శించిందని విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, బడ్జెట్‌లో ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని హరీష్‌రావు ఆరోపించారు. ఆసరా పెన్షన్‌ల ప్రస్తావన తేకుండా వితంతువులు, వృద్ధులు, వికలాంగులను ప్రభుత్వం నిరాశపర్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారుకు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని గొప్పలకు పోయిన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తేకపోవడం దారుణమని అన్నారు. ఆర్భాటంగా అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఊసెత్తలేదని మండిపడ్డారు. ఆసరా పింఛన్‌లు పెంచుతామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని, వృద్ధుల పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు చేయలేదని హరీష్‌రావు ప్రశ్నించారు.

ఇచ్చిన మాట తప్పడం ద్వారా ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న సర్కారు.. ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదని, మాయమాటలతో విద్యార్థులను మోసం చేసిందని హరీష్‌రావు మండిపడ్డారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారని, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరి కారణంగా ఇప్పటికే 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్‌రావు గుర్తుచేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదని హరీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News