లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిషాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను నియమించారు.

By :  Raju
Update: 2024-06-20 16:14 GMT

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిషాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 95 (1) ప్రకారం ఆయన లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. భర్తృహరి ఒడిషాలోని కటక్‌ నియోజకవర్గం నుంచి ఏడు విజయం సాధించారు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. 18 లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారని.. ఆయనకు కె. సురేశ్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే)తో పాటు రాధామోహన్‌ సింగ్‌ (బీజేపీ), ఫగ్గన్‌సింగ్‌ కులస్తే (బీజేపీ), సుదీప్‌ బంధోపాధ్యాయ( టీఎంసీ) ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

భర్తృహరి బీజూ జనతాదళ్‌లో సుదీర్ఘకాలం కొనసాగారు. కటక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున ఆరు సార్లు గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆపార్టీని వీడి బీజేపీలో చేరారు. కటక్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. వివాదరహితుడిగా ఆయనకు పేరున్నది. మరోవైపు 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 24,25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనున్నది. జూన్‌ 6న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీకర్‌గా ఓం బిర్లాకే మరోసారి అవకాశం దక్కవచ్చనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ స్పీకర్‌ పదవి ఆశించింది కానీ తాజాగా బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తామని ప్రకటించింది. 

Tags:    

Similar News