మళ్లీ తెలంగాణ ఉద్యమం నాటి సీన్‌

టీజీపీఎస్సీ ఎదుట భారీగా పోలీసుల మోహరింపు.. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు

By :  Raju
Update: 2024-07-05 06:07 GMT

టీజీపీఎస్సీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సర్వీస్‌ కమిషన్‌ ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను, నిరుద్యోగులను రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముళ్లకంచెలు, బారికేడ్లను దాటుకుని నిరుద్యోగులు సర్వీస్‌ కమిషన్‌ వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గాంధీభవన్‌, బీజేపీ స్టేట్‌ ఆఫీస్‌, టీజీపీఎస్సీ కార్యాలయ పరిసరాలన్నీ హైటెన్షన్‌ మారాయి.




 


టీజీపీఎస్పీ ముట్టడికి నిరుద్యోగ ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో టీజీపీఎస్సీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు ఛలో టీజీపీఎస్సీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున సర్వీస్‌ కమిషన్‌ ముట్టడికి అక్కడి వచ్చారు. బీఆర్‌ఎస్‌ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ నేతృత్వంలో అక్కడికి బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు భారీగా వచ్చారు. విద్యార్థి సంఘాల నేతలు సర్వీస్‌ కమిషన్‌ ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోకపోవడంపై గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.




 


మూడు డిమాండ్లతో నిరుద్యోగ సంఘాల ఐకాస టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకే నిరుద్యోగులు సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. భారీగా నిరుద్యోగులు అక్కడి వస్తారని పోలీసులు 8 గంటలకే బారికేడ్లు ఏర్పాటు చేసింది. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. నిరుద్యోగులు రాకుండా అటు బీజేపీ ఆఫీస్‌, ఇటు సర్వీస్‌ కమిషన్‌కు మధ్యలో ఉన్న డివైడర్‌పై ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. ఇన్ని అడ్డంకులు సృష్టించినా విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు సర్వీస్‌ కమిషన్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ ఐకాస నేతలు మాట్లాడుతూ .. గతంలో హామీ ఇచ్చిన మేరకు గ్రూప్‌ 2,3 లలో పోస్టులు పెంచి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలి. అలాగే డీఎస్సీని వాయిదా వేసి 25 వేల పోస్టులతో అక్టోబర్‌లోనే పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ ఐకాస డిమాండ్‌ చేస్తున్నది. గ్రూప్‌-1లో మెయిన్స్‌ కోసం 1:50 పద్ధతిలోనే ఎంపిక చేస్తామని సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన నేపథ్యంలో 1:100 చొప్పున అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.

Tags:    

Similar News