మళ్లీ రాష్ట్రానికి మోసమే

జాతీయపార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 16 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపితే వాళ్ల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకోవడానికే తప్పా తెలంగాణకు అక్కరకు వచ్చే ఒక్క పని చేయపోయారు అన్నది ఇవాళ బడ్జెట్‌ను చూస్తే అర్థమౌతుంది.

By :  Raju
Update: 2024-07-23 08:28 GMT

కేంద్రంలో మూడోసారి మోడీ 3.0 ప్రభుత్వ ఏర్పడటానికి జేడీయూ, టీడీపీలు ఎంత ముఖ్యమో తెలంగాణ కూడా అంతే ముఖ్యం. కేంద్రానికి ఎనిమిది మంది ఎంపీలను అందించింది. గత ఎన్నికల్లో నలుగురు ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఎలాంటి నిధులు లేదు. కనీసం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పదేళ్లుగా అడిగినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నీతిఆయోగ్‌ సిఫార్సు చేసిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు నిధులకు ఇవ్వలేదు. అందుకే కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రాన్ని నమ్మకోకుండా రాష్ట్రంలో ప్రాధాన్య రంగాల వారీగా నిధులు కేటాయించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసింది. ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇతోధికంగా నిధులు కేటాయించింది. ఫలితంగా సాగునీటి లభ్యత పెరిగింది. పంటల ఉత్పత్తి పెరిగింది. రైతుల ఆదాయం పెరిగింది. ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది.

కానీ కేంద్రంలోని కాషాయ పార్టీకి తెలంగాణలో ఓట్లు కావాలి. సీట్లు కావాలి. కానీ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన ఆకాంక్షలను నెరవేర్చడానికి మాత్రం ఆపార్టీకి ఎన్నడూ మనసు రాదు. దీనికి కారణం తెలంగాణ అస్తిత్వాన్ని అంగీకరించడం మోడీకి ఇష్టం లేదు. అందుకే అనేక సందర్భాల్లో ఆయన పార్లమెంటు వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలకులు తెలంగాణ పదాన్ని ఉచ్చరించకూడదు అన్నట్టే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడలేదు. ఎనిమిది ఎంపీలను అందించిన రాష్ట్ర ప్రజలకు బడ్జెట్‌లో కేటీఆర్‌ ట్వీట్‌ చేసినట్లు పదేళ్ల కాలంలో మాదిరిగానే పెద్ద గుండు సున్నాపెట్టింది. కేబినెట్‌ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ మోడీని పొగడ్తలతో మోయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎన్నడూ కేంద్రాన్ని నిలదీయలేదు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజిపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి కేంద్రాన్ని ఒప్పించలేదు.

ఇక రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల గురించి ఎంత తక్కవ మాట్లాడితే అంత మంచిది. వాళ్లంతా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీను పార్టీలోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉంటున్నారు. పార్లమెంటులో తెలంగాణ ప్రాజెక్టులు, హక్కుల గురించి మాట్లాడటం మా పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. జాతీయపార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 16 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపితే వాళ్ల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకోవడానికే తప్పా తెలంగాణకు అక్కరకు వచ్చే ఒక్క పని చేయపోయారు అన్నది ఇవాళ బడ్జెట్‌ను చూస్తే అర్థమౌతుంది. అందుకే మొన్నటి లోక్‌సభ ఎన్నికల సందర్బంగా 10-12 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఇవాళ బడ్జెట్‌లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను చూస్తే ..'న్యాయం గెలుస్తుంది' అన్నమాట నిజమే కానీ.. గెలిచినదంతా న్యాయం కాదు అన్న శ్రీశ్రీ మాటలు మరోసారి గుర్తుకు వచ్చాయి.

Tags:    

Similar News