గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి

త్వరలో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ల నియామకం.. ప్రభుత్వానికి సీసీఎల్ఏ ప్రతిపాదనలు

By :  Raju
Update: 2024-08-02 04:52 GMT

త్వరలో రెవెన్యూ గ్రామానికో జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్వో)ను నియమించనున్నారు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనున్నది.రెవెన్యూ సేవలు అందించడానికి 2020 అక్టోబర్‌కు ముందు వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థలు ఉండేవి. ఈ రెండు విభాగాల్లో రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి బీఆర్‌ఎస్‌ వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. దీంతో గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించింది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి, సమస్యలు పరిష్కరించడానికి మరో నిర్ణయం తీసుకోనున్నది.

విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు , ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు వంటి సమాచారం అందించడానికి క్షేత్రస్థాయిలో వీఆర్‌వో, వీఆర్‌ఏలు కీలకంగా పనిచేసేవారు. ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ వంటి బాధ్యతలు వీళ్ల చేతుల్లోనే ఉండేవి. ఇటీవల రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష చేశారు. ఇందులో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను అధికారులు సీఎం, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం పాటు సమస్యల పరిష్కారానికి సిబ్బందిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ మేరకు రెవెన్యూ గ్రామానికో జూనియర్‌ రెవెన్యూ అధికారిని నియమించనున్నారు. గతంలో పనిచేసిన వీఆర్వోవో, వీఆర్‌ఏలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై సీసీఎల్‌ఏ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయనున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలను పట్వారీలు చూసే వారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక పటేల్, పట్వారీ వ్యవస్థ ను రద్దు చేశారు. ఆ తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థ తీసుకువచ్చారు. వీఆర్వోలు ప్రజలను పట్టి పీడిస్తున్నారని కేసీఆర్ ఆ వ్యవస్థ ను రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను పునరుద్ధరిస్తోంది.

Tags:    

Similar News