మా అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్

Byline :  Vamshi
Update: 2024-06-06 12:23 GMT

బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో అరెస్టైన నటి హేమ మా సభ్యత్వం రద్దు చేశారు. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వెెల్లడించారు. హేమను సస్పెండ్ చేసే అంశంపై నిన్న సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు 'మా' సభ్యులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హేమకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని 'మా' సెక్రటరీ రఘుబాబు తెలిపారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మా అసోసియేషన్ నుంచి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.బెంగళూర్ రేవ్ పార్టీ విషయంలో హేమకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను సీసీబీ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనేకల్ జేఎంఎఫ్‌సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు.. హేమను 24 గంటల పాటు విచారణ జరిపేందుకు పోలీసులు అనుమతి తీసుకున్నారని తెలిసింది.

Tags:    

Similar News