రేవంత్‌ కు 'ఆగస్టు' టెన్షన్‌!

ఎప్పుడు ఎవరు ప్లేటు ఫిరాయిస్తారోనని హైరనా.. డిప్యూటీ సహా ఇంకెవ్వరినీ నమ్మలేని స్థితిలో సీఎం

రేవంత్‌ కు ఆగస్టు టెన్షన్‌!
X

సీఎం రేవంత్‌ రెడ్డికి ఆగస్టు సంక్షోభం టెన్షన్‌ పట్టుకుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన కోసం ఫ్లైట్‌ ఎక్కిన ముఖ్యమంత్రి మరికాసేపట్లో న్యూయార్క్‌ లో ల్యాండ్‌ అవబోతున్నారు. తాను అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే రెండో విడత రుణమాఫీ చేయబోతున్నట్టు కొన్ని రోజుల క్రితమే సీఎం ప్రకటించారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు ఐటీ, ఇండస్ట్రీస్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కూడా వెళ్తున్నారు. సీఎం శనివారం తెల్లవారుజామునే బయల్దేరగా, మంత్రి శ్రీధర్‌ బాబు కొందరు అధికారులతో కలిసి ఆదివారం అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో సీఎం, మంత్రి ఇద్దరు కలిసి పలు ప్రతిష్టాత్మక సంస్థల ముఖ్యులను కలిసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఈనెల 14న హైదరాబాద్‌ కు తిరిగి చేరుకుంటారు. అంటే ఆయన ఫ్లైట్‌ ఎక్కిన సమయం నుంచి హైదరాబాద్‌ కు తిరిగి రావడానికి మధ్య 11 రోజుల వ్యవధి ఉంది. ఈ 11 రోజుల్లోనే తెలంగాణలో ఏదైనా జరగొచ్చు అనే హైరానా సీఎం రేవంత్‌ క్యాంపులో ఉందని కాంగ్రెస్‌ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ బైపాస్‌ సర్జరీ కోసం అమెరికాకు వెళ్తే ఆయనను గద్దె దించి నాదెండ్ల భాస్కర్‌ రావు ముఖ్యమంత్రి అయినట్టే.. తెలంగాణ కాంగ్రెస్‌ లోనూ తిరుగుబాటుకు అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. కాంగ్రెస్‌ లో ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే.. వారి తిరుగుబాటును పార్టీ హైకమాండ్‌ యాక్సెప్ట్‌ చేసి తీరాలి. హైకమాండ్‌ ఆశీస్సులుంటే తప్ప కాంగ్రెస్‌ లో తిరుగుబాటు సక్సెస్‌ కాదు.. ఈ ఒక్కటి మాత్రమే రేవంత్‌ కు ఊరటనిచ్చే అంశమని ఆయన వర్గీయులు చెప్తున్నారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లోకి వచ్చిన రేవంత్‌ రెడ్డిని సీఎం చేయడాన్ని హస్తం పార్టీలోని పలువురు సీనియర్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటికి ముఖ్యమంత్రి వెంటే తామంతా ఉన్నామని చెప్తోన్న.. లోలోపల తమకు చాన్స్‌ రాలేదని మదన పడుతున్నారు. ఎప్పుడు చాన్స్‌ వచ్చినా వదులుకోవద్దనే పట్టుదలతోనూ ఉన్నారు. రేవంత్‌ ను కాకుండా తమలో ఒకరిని సీఎం చేయాలని పలువురు సీనియర్‌ లీడర్లు పార్టీ హైకమాండ్‌ పెద్దలను కోరినట్టుగానూ చెప్తున్నారు. వారి కోరికను పార్టీ నాయకత్వం మన్నించి గో అ హెడ్‌ అన్నదా.. గప్‌ చుప్‌ గా ఉండాలని హెచ్చరించిందా అనే అంశంపై కాంగ్రెస్‌ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన సీనియర్లు సీఎం రేవంత్‌ తీరుపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అందరినీ కలుపుకొని పోయినట్టు కనిపించిన సీఎం తీరులో మార్పు వచ్చిందని.. ఇప్పుడంతా వన్‌ మ్యాన్‌ షో అన్నట్టే వ్యవహరిస్తున్నాడని ఆ జిల్లాల లీడర్లు రుసరుసలాడుతున్నారు. ప్రభుత్వంలో సీఎం సహా 12 మంది మంత్రులుండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఇంకెవరినీ తన వాళ్లు అని నమ్మే పరిస్థితుల్లో సీఎం లేరు. సందర్భాన్ని బట్టి కొందరు మంత్రులకు కొన్ని పనులను అప్పగిస్తున్నా వారి వెనుకే తన వేగులను పెట్టి ఆ పని సక్రమంగా చేస్తున్నారా లేదా అని ఆరా తీయిస్తున్నారు. అధికారం ఎవరికి చేదు కాదని.. ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అంటే ఎవరైనా ప్లేట్‌ ఫిరాయించడం పెద్ద విషయం కాదనే క్లారిటీలోనే రేవంత్‌ ఉన్నారు. అందుకే అమెరికా ఫ్లైట్‌ ఎక్కడానికి ముందే మంత్రులు, సీనియర్‌ లీడర్లపై ఓ కన్నేసి ఉంచాలని ఇంటెలిజెన్స్‌ తో పాటు తన షాడో టీమ్‌ ను పురమాయించారని సమాచారం. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఘర్‌ వాపసీకి ప్రయత్నిస్తే వారిని ఎలాగో భుజ్జగించి ప్రస్తుతానికి కాంగ్రెస్‌ లోనే కొనసాగేలా చేశారు. వారిలో ఒకరిద్దరు గోడ దూకిన తన నాయకత్వంపై బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలకూ నమ్మకం లేకుండా పోతుందన్న భయం రేవంత్‌ కు ఉంది. అందుకే ఒక్కరూ జెల్ల కొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి రేవంత్‌ కీలకంగా పని చేయడం.. అంగబలం, అర్థబలం.. అదృశ్య శక్తుల రాజకీయ అండదండలు కూడా ఉండటంతోనే రేవంత్‌ ను పార్టీ హైకమాండ్‌ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా హస్తం పార్టీలోని అతిరథ మహారథలంతా వచ్చి రేవంత్‌ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. మొదట్లో రేవంత్‌ పై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నమ్మకంతోనే ఉందని.. ప్రధాని నరేంద్రమోదీని బడే భాయ్‌ గా రేవంత్‌ అభివర్ణించిన తర్వాత రేవంత్‌ కు లిట్మస్‌ టెస్టులు మొదలు పెట్టింది. ఇలా పెట్టిన మొదటి లిట్మస్‌ టెస్ట్‌ లోక్‌సభ ఎన్నికలు.. ఆ పరీక్షలో రేవంత్‌ ఫెయిల్‌ అయ్యారు. ఒకానొక దశలో తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు పక్కా అని పార్టీ స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు హైకమాండ్‌ కు రిపోర్టులు ఇచ్చారు. ఫలితాల వరకు వచ్చేసరికి పార్టీ బొక్కబోర్లా పడింది. ఇందుకు రేవంత్‌ రెడ్డినే కారణమని పీజే కురియన్‌ నేతృత్వంలోని కమిటీ కూడా హైకమాండ్‌ కు నివేదిక ఇచ్చిందని గాంధీ భవన్‌ సర్కిల్స్‌ లో చర్చ సాగుతోంది. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేందుకు రేవంత్‌ రెడ్డి బలహీనమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడమే కారణమని ఆ కమిటీ తేల్చేసిందని చెప్తున్నారు. కురియన్‌ కమిటీ నివేదిక బయటికి రాకున్నా దానిపై పార్టీలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం పెరగడానికి కారణాలేమిటో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో పాటు రేవంత్‌ కు సన్నిహితులుగా ముద్రపడిన నాయకులంతా ఒకే తరహా స్టేట్‌ మెంట్లు ఇచ్చారు. వాళ్లంతా కూడబలుక్కొన ఒకే తరహా వివరణలు ఇవ్వడం సైతం పార్టీ హైకమాండ్‌ సీరియస్‌ గానే తీసుకుందని సమాచారం.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ప్రతిసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ హైకమాండ్‌ వెంట పంపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది రేవంత్‌ ఫాలోవర్స్‌ కావడంతో తేడా వస్తే వాళ్లంతా పక్కకు జరుగుతారనే హైరానా ఢిల్లీ పెద్దలకూ ఉంది. అందుకే రేవంత్‌ ను ఇప్పటికిప్పుడు డిస్టర్బ్‌ చేయవద్దనే యోచనలో టెన్‌ జన్‌ పథ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్‌ వ్యవహార శైలి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేస్తోందని.. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడానికి రేవంత్‌ వ్యవహార శైలే కారణమని సీనియర్లు హైకమాండ్‌ కు ఫిర్యాదులు చేస్తున్నారు. రేవంత్‌ దేశంలో ఉన్నప్పుడు ఆయనను పక్కకు జరపడం కష్టమైన పని కాబట్టి అమెరికా టూర్‌ నుంచి తిరిగి వచ్చేలోపు కాగల కార్యం గంధర్వులు చక్కబెట్టినట్టు ఖమ్మం, నల్గొండ లీడర్లను ముందు పెట్టేసి కావాల్సిన లాంఛనాలు పూర్తి చేయించే ఆలోచనలో ఢిల్లీ పెద్దలూ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారమే సీఎం రేవంత్‌ కు ముచ్చమటలు పట్టిస్తోంది. ప్రభుత్వంలో తన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెంట ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే క్లారిటీ రేవంత్‌ కు ఉంది. ఆయన ఇతర సీనియర్‌లతో చేతులు కలిపితే ఏదైనా జరగొచ్చు అనే ఊహాగానాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఎహే.. ఇదంతా ఉట్టి ప్రచారం.. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డినే ఉంటారు.. ఆయనను మార్చడం ఎవరితరం కాదు.. ఆగస్టు 15న జాతీయ జెండా కూడా ఎగరేస్తాడు చూడండి అని ఆయన వర్గీయులు చెప్తున్నారు. నిప్పులేనిదే పొగరాదు అంటారు.. అక్కడే నిప్పుమాత్రమే కాదు.. భగభగమండే అగ్ని కీలలు కూడా ఉన్నాయి. అవి చప్పున చల్లారి రేవంత్‌ నాయకత్వాన్ని బలపరుస్తాయా? చూపిస్తాం.. మా ప్రతాపం అంటూ తొడగొడుతాయా అన్నదే తేలాల్సి ఉంది..!


డిప్యూటీనా.. షాడోనా? స్టోరీని చదివేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి

Next Story