డిప్యూటీనా.. షాడోనా!?

ప్రధాని, కేంద్ర హోం మంత్రిని సీఎం కలిసిన ప్రతిసారి రేవంత్‌ వెంటనే భట్టి.. పార్టీ హైకమాండ్‌ సూచనలతోనే!

డిప్యూటీనా.. షాడోనా!?
X

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మాత్రమేనా.. పార్టీ అధినాయకత్వం దృష్టిలో ఆయన షాడో సీఎం కూడానా? అనే అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసిన ప్రతిసారి సీఎం వెంట భట్టి ఎందుకు ఉంటున్నారు.. సీఎం వెంటనే ఉండాలని ఎవరు చెప్తున్నారని కాంగ్రెస్‌ నేతలను అడిగితే పార్టీ హైకమాండ్‌ ఆదేశాలతోనే అని సమాధానమిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలోనే (2023 డిసెంబర్‌ 26న) ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క హెలీక్యాప్టర్‌లో బయల్దేరాల్సి ఉంది. అంతకు కొన్ని గంటల ముందే ఢిల్లీ హైకమాండ్‌ నుంచి భట్టి నివాసానికి ఫోన్‌ వచ్చింది. ఖమ్మం టూర్‌ రద్దు చేసుకొని అర్జంట్‌గా ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించారు. భట్టి ఖమ్మం పర్యటన రద్దు చేసుకొని.. ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యారు. సీఎంతో పాటే నీవు ప్రధాని, కేంద్ర హోం మంత్రితో మీటింగ్‌కు హాజరుకావాలని భట్టికి పార్టీ హైకమాండ్‌ సూచించింది. హైకమాండ్‌ ఆదేశాల మేరకు భట్టి సీఎం రేవంత్‌ వెంట ప్రధాని, హోం మంత్రితో సమావేశంలో పాల్గొన్నారు.





తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్‌ రెడ్డి మాస్‌ ఫాలోయింగ్‌ దోహద పడిందనే నమ్మకంతోనే ఆయనను ముఖ్యమంత్రి చేశారని పార్టీ పెద్దలు చెప్తున్నారు. రాహుల్‌ గాంధీ దగ్గర మొన్నటి వరకు రేవంత్‌ మాటకు ఎదురుండేదే కాదని కూడా చెప్తుంటారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలవడం వెనుక రేవంత్‌ లోపాయకారి సహకారం ఉందనే అనుమానం పార్టీ హైకమాండ్‌ పెద్దలకు బలపడింది. ఇటీవల పార్లమెంట్‌లో రేవంత్‌ తనను కలిసినప్పుడు సోనియాగాంధీ ఇదే విషయాన్ని ఆయన ముఖం మీదే అడిగేశారు. రేవంత్‌ పనితీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఆ రోజు రేవంత్‌ దూకుడుకు బ్రేకులు వేస్తున్నారు. ఈక్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్‌ పార్టీని ఇన్నాళ్లు అంటిపెట్టుకుని ఉన్న సీనియర్‌ లీడర్లకు ప్రయారిటీ ఇస్తున్నారు. కేబినెట్‌ విస్తరణ, పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు బుధవారమే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్‌ ఢిల్లీకి వెళ్లలేదు. రేవంత్‌ ఢిల్లీ టూర్‌ ఎంపీ కె. కేశవరావు చేరిక కార్యక్రమానికే పరిమితమైంది. ఎట్లాగూ ఢిల్లీకి వెళ్లాం కదా.. ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలువాలని రేవంత్‌ వారి అపాయింట్‌మెంట్‌ కోరారు. వారి అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ హైకమాండ్‌ భట్టిని మళ్లీ ఢిల్లీకి పిలిపించింది. రేవంత్‌ వెంట భట్టిని కూడా హోం మంత్రితో సమావేశానికి పంపింది.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణ ఆ పార్టీకి చాలా కీలకం. ఇక్కడ అధికారాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు. తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండే తరహా ప్రయోగాలు ఉండొచ్చని అనుమానిస్తోంది. అందుకే ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారిని సైతం ఆ పార్టీ నమ్మడం లేదు. అందుకే సీఎం వెంటనే డిప్యూటీని కూడా ప్రధాని, హోం శాఖ మంత్రి వద్దకు పంపుతోంది. మిగతా కేంద్ర మంత్రులు ఆయా శాఖల కేంద్ర మంత్రులను స్వేచ్ఛగా కలిసేందుకు అవకాశం కల్పించింది. సీఎం రేవంత్‌ రెడ్డికి ఇతర కేంద్ర మంత్రులను కలిసే వెసులుబాటు ఇచ్చింది. ఒక్క ప్రధాని, హోం మంత్రి వద్దకు వెళ్తే మాత్రమేనే భట్టిని తోడు పంపుతోంది. అందుకే ఇప్పుడు భట్టి డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ మెచ్చిన షాడో సీఎం కూడా అని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డినే భట్టికి ప్రాధాన్యత ఇచ్చారే అనుకుందాం.. ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన ఫొటో కూడా ఉండనివ్వడం లేదు.. ఆయన శాఖల్లోనూ వేళ్లు, కాళ్లు పెడుతున్నట్టుగా ఆరోపణలు సరేసరి. ఒకవేళ సీఎంతో సమానంగా డిప్యూటీని గౌరవించారు అనుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నరు. ఆయన వెంట ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు కన్నా పవన్‌ కళ్యాణే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు ఇప్పుడు సన్నిహితంగా ఉంటున్నారు. పవన్‌ ను వెంట బెట్టుకొని వెళ్తే ఏపీకి సంబంధించిన పెండింగ్‌ సమస్యలు చకచకా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా చంద్రబాబు ఒక్కరే ఢిల్లీ వెళ్లారు. సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఈ లెక్కన చూసుకున్న భట్టిని పార్టీ హైకమాండ్‌ షాడో సీఎంగానే పరిగణిస్తోందని కాంగ్రెస్‌ నేతలే చెప్తున్నారు.

Next Story