ఎట్టకేలకు తెలంగాణకు ''వైజయంతి'' వరద సాయం

రూ.20 లక్షల విరాళం ప్రకటించిన అశ్వినీదత్‌ సంస్థ

Update: 2024-09-04 11:09 GMT

వరద సాయంలో తెలంగాణపై వివక్ష ఎందుకని సోషల్‌ మీడియా విమర్శలు గుప్పించడంతో దిగివచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ రూ.20 లక్షల సాయం ప్రకటించింది. ఈమేరకు సంస్థ బుధవారం ట్వీట్‌ చేసింది. భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకున్న ఏపీలో సహాయక చర్యల కోసం ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్‌ నిర్మాణ సంస్థ ఈనెల రెండో తేదీన రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. అశ్వనీదత్‌ ఇటీవల నిర్మించి కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ బ్లస్టర్‌ అయ్యింది. 50 ఏళ్లుగా తెలుగు సినిమా ప్రొడక్షన్‌ రంగంలో ఉన్న వైజయంతి మూవీస్ ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో తెలంగాణ (నైజాం) వాటా ఎంతో ఉంది. అయినా ఏపీలో వరద సహాయక చర్యలకు విరాళం ప్రకటించి తెలంగాణను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమా రంగంలోని ప్రముఖులకు ఇక్కడి నుంచి డబ్బులు కావాలే తప్ప ఆపదలో ఉంటే ఆదుకోరా అని సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్‌ చేశారు. దీంతో దిగివచ్చిన వైజయంతి మూవీస్‌ తెలంగాణకు వరద సాయంగా రూ.20 లక్షలు ప్రకటించారు.

మెగా ప్రిన్స్‌ రూ.కోటి సాయం

వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగా ప్రిన్స్‌ రామ్‌ చరణ్‌ తేజ రూ.కోటి సాయం ప్రకటించారు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. తన వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరారు. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి రెండు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు కోటి చొప్పున సాయం ప్రకటించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ వంతుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.

Tags:    

Similar News