బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనస్‌

తన దేశం కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్‌ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు.

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనస్‌
X

బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వస్తున్న డిమాండ్లకు నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ అంగీకరించారు. తనపై విశ్వాసంతో బాధ్యతలు చేపట్టాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌కు నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహించనున్నారు. ప్రధాని హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. మొదట తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్‌ తాత్కాలిక సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి ఆయన ప్రకటన వెలువరించారు. యూనస్‌ 2012-2018 వరకు స్కాట్‌లాండ్లోని గ్లాస్గో కలెడోయన్‌ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలు అందించి బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు.

మహమ్మద్‌ యూనస్‌ నేపథ్యమిది

చిట్టగాంగ్‌ 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్‌, ఆర్థికవేత్త, మైక్రోఫైనాన్స్‌ ద్వారా లక్షమందిని పేదరికం నుంచి బైట పడేసిన ఘనత సాధించారు. దీనికి 2006లో యూనస్‌ నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్‌ లో నిరసన కారుల ప్రధాన డిమాండ్‌. తాత్కాలిక సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కార్‌ను, సైన్యం మద్దతు ఉండే మరే ప్రభుత్వాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కార్‌తో ఘర్షణ పడినందున యూనస్‌పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరున్నర నెలల శిక్ష పడింది. తన దేశం కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్‌ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌ సైన్యంలో మేజర్‌ జనరల్‌గా ఉన్న జియావుల్‌పై వేటు పడింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మహమ్మద్‌ సైఫుల్‌ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాంచారు. మరికొందరు లెఫ్టినెంట్‌ జనరల్‌ లను వారి స్థానాల నుంచి తప్పించారు. మరోవైపు బంగ్లాను వీడి భారత్‌కు బయలుదేరిన ఇద్దరు మంత్రులను ఢాకా విమానాశ్రంలో అదుపులోకి తీసుకున్నారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. హసీనాను ఆమె సోదరిని అరెస్టు చేసి ఆ దేశానికి పంపాలని ఆ దేశ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉద్దీన్‌ ఖోఖోన్‌ భారత్‌ను కోరారు.

అడుగు పెట్టిన దేశంలోఆశ్రయం పొందడం ఉత్తమ మార్గం

బంగ్లాదేశ ప్రధాని లండన్‌లో ఆశ్రయం పొందుతారన్న వార్తల నేపథ్యంలో బ్రిటన్‌ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆశ్రయం కోరుతూ లేఖ రాసిన ఒక వ్యక్తి శరణార్థిగా తమ దేశం వచ్చేందుకు బ్రిటన్‌ వలస చట్టాలు అంగీకరించవని జాతీయ మీడియాకు వెల్లడించారు. అవసరం ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకే కు గర్వించదగిన రికార్డు ఉన్నదన్నారు. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి యూకేకు వచ్చేలా అనుమతించే నిబంధనేమీ లేదని తెలిపారు. అంతర్జాతీయ రక్షణ కోరే వారు మొదట చేరుకున్న దేశంలోనే ఆశ్రయం అడగాలని పేర్కొన్నారు. అదే వారి రక్షణ కు అత్యంత వేగవంతమైన మార్గమని వెల్లడించారు. భారత్‌లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

మా అమ్మ ఎక్కడా ఆశ్రయం కోరలేదు: హసీనా తనయుడు

బంగ్లా మాజీ ప్రధాని ఆశ్రయం విషయంలో యూకే, యూఎస్‌ ప్రభుత్వాలు స్పందించడం లేదనే విషయంలో నిజం లేదని ఆమె తనయుడు సాజీబ్‌ వాజెద్‌ పేర్కొన్నారు. వీసా రద్దుపై అమెరికాలో ఎలాంటి చర్చల జరగలేదన్నారు. హసీనా ఆశ్రయం పొందడంపై వస్తున్న వార్తలపై ఈ మేరక స్పష్టతనిచ్చారు.

ఢిల్లీ విమానాశ్రయానికి 205 మంది భారతీయులు

మరోవైపు బంగ్లాలో సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు 205 మంది ఎయిర్‌ ఇండియా విమానం ద్వారా ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానంలో 199 మంది ప్రయాణికులు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

Raju

Raju

Writer
    Next Story