ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా: జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా: జీవన్‌రెడ్డి
X

కాంగ్రెస్‌ ఫిరాయింపు రాజకీయాలు ఆ పార్టీలో కుంపటి రాజేశాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక ఆపార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. పార్టీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తీసుకోవడాన్ని వ్యతిరేకించిన జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినా బెడిసి కొట్టాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. బేగంపేటలో తన నివాసంలో అనుచరులతో సమావేశం అయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి శాసనమండలికి వెళ్లి రాజీనామా లేఖ ఇవ్వాలని అనుకున్నారు. శాసనమండలిలో ఛైర్మన్‌ అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి రాజీనామా ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే ఆయనను బుజ్జగించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబులు జీవన్‌రెడ్డి ఇంట్లోనే మధ్యాహ్నం వరకు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున చట్టసభల్లో నాయకుల్లో జీవన్‌రెడ్డి చాలా సీనియర్‌. అలాగే అతి ముఖ్యమైన నాయకుడు. వారు మనస్థాపం చెందారని తెలిసి మేమంతా కదిలి వచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారి ఆలోచనను, వారి మనస్థాపానికి కారణమైన విషయాన్ని తప్పనిసరిగా పార్టీ అధిష్ఠానం దృష్టిలోకి తీసుకెళ్తాన్నారు. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతున్నది. వారి గౌరవానికి ఎక్కడా భంగం కలుగకుండా చూస్తామన్నారు.అయినా జీవన్‌రెడ్డి నిర్ణయంలో మార్పేమీ లేదని తెలుస్తోంది.

దీనికంతటికీ కారణం సీఎం రేవంత్‌ వైఖరేనని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారు. 64 సీట్లలో గెలిపించారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలోనూ ఆపార్టీ అభ్యర్థి గెలువడంతో అసెంబ్లీలో ఆ పార్టీ 65కు చేరింది. సీపీఐ నుంచి గెలిచిన కూనమనేని సాంబశివరావు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. బలం ఉన్నా బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఏమున్నదని వీహెచ్‌ లాంటి ఇప్పటికే రేవంత్‌ను ప్రశ్నించారు. కానీ బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆయన వ్యక్తిగత అజెండానే అమలు చేస్తున్నారని పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు ఆరోపిస్తున్నారు. అయినా రేవంత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మరో షాక్‌ ఇచ్చేలా ఆయనపై గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కి సీఎం రేవంత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పారు. పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో భగ్గుమన్న ఎమ్మెల్సీ జవన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌ చేరికపై కార్యకర్త మనోభావాలు పట్టించుకోలేదని మండిపడ్డారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ.. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

దీంతో ఆయనను బుజ్జగించడానికి మంత్రి శ్రీధర్‌ బాబు రంగంలోకి దిగారు. జీవన్‌రెడ్డితో చర్చలు జరిపారు. జీవన్‌రెడ్డి 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారని ఆయన అసంతృప్తిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, జాతీయ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తెసుకెళ్తాను అన్నారు. ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో తాను లేను అన్నారు. దీన్నిబట్టి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వాళ్లలోనూ అంతర్గతంగా అసంతృప్తి ఉన్నదనేది అర్థమౌతున్నది. శ్రీధర్‌బాబుతో చర్చల అనంతరం నిన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నియమ నిబంధనలు పాటిస్తాను అన్నారు. అయితే జీవన్‌రెడ్డి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ పరిణామాలే ఆయనను ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తాననే వరకు తీసుకొచ్చాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Raju

Raju

Writer
    Next Story