కాల్వలు తవ్వి.. అడ్వాన్స్ లు ఇచ్చి.. తుమ్మిడిహెట్టి ఎందుకు కట్టలే!

ప్రాణహిత - చేవెళ్ల హెడ్‌ వర్క్స్‌ లో తట్టెడు మట్టి ఎందుకు తవ్వలే?

కాల్వలు తవ్వి.. అడ్వాన్స్ లు ఇచ్చి.. తుమ్మిడిహెట్టి ఎందుకు కట్టలే!
X

తుమ్మిడిహెట్టి వర్సెస్‌ మేడిగడ్డ/ప్రాణహిత - చేవెళ్ల వర్సెస్‌ కాళేశ్వరం.. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ గా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో కరువును పారద్రోలేందుకు ఈ భారీ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశామని కాంగ్రెస్‌ చెప్తోంది. ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే కాంగ్రెస్‌ కు పేరు వస్తుందని, కమీషన్లు రావనే కేసీఆర్‌ ప్రాణహిత - చేవెళ్లను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్న మాటలన్నీ నిజమే అనుకుందాం.. 2014 వరకు ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు తుమ్మిడిహెట్టి ఎందుకు కట్టలేకపోయింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత - చేవెళ్ల లిఫ్ట్‌ స్కీంకు ప్రాణమే తుమ్మిడిహెట్టి బ్యారేజీ. అక్కడ ప్రాణహితకు అడ్డంగా బ్యారేజీ నిర్మించే నీళ్లు మళ్లించాలే.. ఇంత ప్రధానమైన బ్యారేజీ పనులను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా రెండు పర్యాయాలు తెలంగాణ నాయకులే ఉన్నా ఎందుకు సాధ్యం కాలేదు? ఈ ప్రశ్నలకు మాత్రం ప్రస్తుత ప్రభుత్వ పెద్దల దగ్గర సమాధానాలు లేవు.

జలయజ్ఞంలో భాగంగా అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007 మే నెలలో రూ.17,875 కోట్లతో ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించాలని నిర్ణయించింది. మొదట 12.21 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని అనుకోగా, తర్వాత సాగు విస్తీర్ణం ఇంకో నాలుగు లక్షల ఎకరాలు పెంచి 2008లో రూ.38,500 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌ (జీవో ఎంఎస్‌ నం.238 ద్వారా) శాంక్షన్‌ ఇచ్చింది. అంటే ఏడాదిలోనే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్లు పెంచేశారు. అదే ఏడాది అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి కొన్ని నీళ్లను ఒకపాత్రలో తీసుకెళ్లి చేవెళ్ల చెరువులో పోసి గోదావరి (ప్రాణహిత) జలాలు తేబోతున్నామని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోని వివిధ ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ లు కూడా ఇచ్చారు. తుమ్మిడిహెట్టి సమీపంలో నుంచి మైలారం వరకు 71 కి.మీ.ల పొడవైన కాల్వ తవ్వి దానికి సిమెంట్‌ లైనింగ్‌ కూడా చేశారు. మైలారం నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాల్సిన ప్రాంతంలో సింగరేణి కోల్‌ మైన్స్‌ ఉండటంతో పనులు ముందుకు సాగలేదు. అక్కడ ఓపెన్‌ కెనాల్‌ కాకుండా పైప్‌ లైన్‌ ద్వారా నీటిని తరలించాలని రూ.350 కోట్లతో పైపులు కూడా తెప్పించారు. మైలారం దగ్గర పంపుహౌస్‌ నిర్మించి, అక్కడి నుంచి పైపులైన్‌ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాల్సి ఉండేది. సింగరేణి అభ్యంతరాలతో ఆ ప్యాకేజీ పనులకు బ్రేక్‌ పడింది. తుమ్మిడిహెట్టి నిర్మాణాన్ని పట్టించుకోని అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా ఎక్కడెక్కడో కాల్వలు, టన్నెళ్లు తవ్వింది. వీటన్నింటిపై 2014 నాటికే రూ.9 వేల కోట్లు ఖర్చు చేసింది. ఆరేళ్లలో ఈ ప్రాజెక్టుపై రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదనే ప్రశ్నకు ప్రస్తుత పాలకుల వద్ద సమాధానం లేదు.

2004 నుంచి 2014కు మధ్య కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉండేవి. తుమ్మిడిహెట్టి వద్ద సముద్రమట్టానికి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి ప్రాణహిత నీళ్లను ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 5.09 టీఎంసీలు నిల్వ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో 5,247 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని గుర్తించారు. మహారాష్ట్రలోని చాప్రాల్‌ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ముంపునకు గురవుతున్న భూభాగంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రుల స్థాయిలో లేఖలు రాశారు. 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ తమ రాష్ట్రంలో ముంపునకు అనుమతించేది లేదని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇరిగేషన్‌ మంత్రిగా హరీశ్‌ రావు పలుమార్లు మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రితో చర్చలు జరిపారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు సమక్షంలో మహారాష్ట్ర రాజ్‌ భవన్‌ లో తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు కేసీఆర్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే 152 మీటర్ల హైట్‌ లో బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించనప్పుడు.. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన తానెలా ఒప్పుకుంటానని ఫడ్నవీస్‌ ప్రశ్నించారు. బ్యారేజీ హైట్‌ తగ్గించుకొని ముంపు ప్రభావం లేకుండా చేస్తే బ్యారేజీ నిర్మాణానికి ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి.

148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే నీటి నిల్వ 5.09 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు తగ్గిపోతుందని, అప్పటికే తవ్విన గ్రావిటీ కాల్వలోని నీటిని మళ్లించాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర కూడా ఒక లిఫ్ట్‌ ఏర్పాటు చేయాల్సిందేనని ఇంజనీర్లు తేల్చిచెప్పారు. అంటే ఎల్లంపల్లి వరకు నీళ్లు చేరాలంటే 2 స్టేజీల్లో (తుమ్మిడిహెట్టి, మైలారం) పంపుహౌస్‌ లు తప్పనిసరిగా నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుమ్మిడిహెట్టి వద్ద 10 మీటర్లు, మైలారం దగ్గర 40 మీటర్లు అంటే 50 మీటర్లు నీటిని ఎత్తిపోస్తే తప్ప ఎల్లంపల్లికి నీళ్లు చేరవు. ఇంకోవైపు తుమ్మిడిహెట్టి వద్ద 75 శాతం డిపెండబులిటీ వద్ద 165.38 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పిన సీడబ్ల్యూసీ అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోని నీళ్లు అని స్పష్టం చేసింది. అంటే ఎగువ రాష్ట్రాలు భవిష్యత్‌ లో ఆ నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తే 63 టీఎంసీల నీటి కొరత తుమ్మిడిహెట్టి వద్ద ఉండబోతుందని సీడబ్ల్యూసీనే హెచ్చరించింది. అదే సమయంలో తుమ్మిడిహెట్టి నిర్మాణ ప్రాంతంలో బ్యారేజీ నిర్మించేందుకు ఇన్వెస్టిగేషన్‌ చేయగా భారీ సాంకేతిక లోపం బయట పడింది. బ్యారేజీ నిర్మించే ప్రదేశంలో ప్రాణహిత ప్రవాహం 40 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రవాహానికి అడ్డంగా 40 డిగ్రీల కోణంలో వంపుతిరిగి బ్యారేజీ నిర్మించడం సాంకేతికంగానూ అనేక సవాళ్లతో కూడుకున్నది. ఇలా వంపు తిరిగి బ్యారేజీ నిర్మించడానికి సివిల్‌ ఇంజనీరింగ్‌ పరిభాషలో 'స్క్యూ' అంటారు. అలాంటి బ్యారేజీలు ప్రపంచంలో ఎక్కడా లేవని తేలింది. తుమ్మిడిహెట్టి దగ్గర 6.5 కి.మీ.ల పొడవైన బ్యారేజీ నిర్మించాలి. దానికి 110 గేట్లు బిగించాలి. నది ప్రవాహం 40 డిగ్రీల కోణంలో ఉన్నచోట ఆమేరకు వంపు తిరిగి బ్యారేజీ నిర్మించాలి.. అప్పుడు ఆ ప్రాంతంలో గేట్ల ఏర్పాటు సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి అనేక ఇబ్బందికర పరిస్థితులు వర్క్‌ సైట్‌ లో ఉండటంతోనే కేసీఆర్‌ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చింది. కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో తుమ్మిడిహెట్టి నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అసెంబ్లీ, కౌన్సిల్‌ లోనూ ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. ఆ తర్వాతగాని ప్రభుత్వానికి తుమ్మిడిహెట్టి నిర్మాణానికి ఉన్న సాంకేతిక అవరోధాలు ఏమిటోగాని తెలిసిరాలేదు. అందుకే ఇప్పుడు నిపుణుల సూచనల మేరకు తుమ్మిడిహెట్టి లేదా ఇంకో ప్రాంతంలో బ్యారేజీ నిర్మిస్తామని చెప్తోంది. ఏదైనా తనదాకా వస్తే గాని తత్వం బోధ పడదు అంటారు.. కాంగ్రెస్‌ హామీల సంగతి అంతే.. ఇక ఆరోపణలు సరేసరి.

Next Story