ఉద్యోగాలు ఎప్పుడిస్తరు..? నిరుద్యోగుల ఆందోళన

ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపించారు.

ఉద్యోగాలు ఎప్పుడిస్తరు..? నిరుద్యోగుల ఆందోళన
X

ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. గ్రూప్‌-1లో 1:100 చొప్పున క్వాలీఫై చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ చిక్కడపల్లి గ్రంథాలయంలో ఉస్మానియా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్‌-2, 3లలో పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేశారు. హామీలు ఇచ్చి మరిచిపోయే పద్ధతులు మానుకోవాలని విద్యార్థులు సూచించారు. ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే కారణమని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున అంగీకరించారు. అందుకే మీరు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నామన్నారు. హామీల అమలుపై ఇప్పటివరకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగామని అయినా సరైన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇచ్చిన హామీలను మీరే తుంగలో తొక్కడానికి కారణమేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులు ప్రశ్నిస్తుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో ఉన్నారని మంత్రి శ్రీధర్‌బాబు సహా అధికారపార్టీ నేతలు మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. తాము రాజకీయాలు మాట్లాడటం లేదని, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామన్నారు.

తాము అధికారంలోకి వస్తే గ్రూప్‌-1 లో 1:100 చొప్పున అవకాశం కల్పిస్తామని ఆనాడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా వాగ్దానం చేశారు. అదే విషయాన్ని గుర్తు చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి దగ్గరికి వెళ్తే చూద్దాం, చేద్దామంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని .. న్యాయపరమైన చిక్కులు వస్తాయని కారణాలు చెబుతున్నారు. లీగల్‌ ప్రాబ్లమ్స్‌ ఉంటే ఎందుకు హామీ ఇచ్చారని నిరుద్యోగులు నిలదీస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. పక్క రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అక్కడి ప్రభుత్వం నెరవేరుస్తున్నది. మీరేమో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే ఆయన అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం శిష్యుడే కదా.. ఆయన బాధ్యతలు చేపట్టగానే విద్యార్థులను కలిశారు. కానీ రేవంత్‌ ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడిచినా ఒక్క విద్యార్థిని, ఒక విద్యార్థి సంఘాన్ని కలవడం లేదు, మా సమస్యలు వినడం లేదని మండిపడ్డారు.

Raju

Raju

Writer
    Next Story