వీసీల నియామకం ఎప్పుడు?

పోస్టుల కోసం జోరుగా పైరవీలు.. ఎంపిక ఆలస్యానికి ఇదే కారణమనే ఆరోపణలు

వీసీల నియామకం ఎప్పుడు?
X

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వీసీల ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మే 21న వీసీల పదవీ కాలం ముగిసింది. అయితే రేవంత్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వర్సిటీలలో ఖాళీల భర్తీ, వీసీల ఎంపిక తదితర అంశాలపై గప్పాలు కొట్టింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటనలు ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 26న 15 రోజుల్లో వీసీలను నియమిస్తామని చెప్పారు. అలాగే వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లనూ నియమిస్తామని తెలిపారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వర్సిటీల్లో వీసీ ఎంపిక, ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, పూర్తి చేసిన పరీక్షలకు నియామక పత్రాలు అందించి ఆరు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నది. నెలలు గడిచినా వీసీ నియామకాలకే దిక్కులేదు. ఇప్పటికే రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 70 శాతం బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తంగా 4,500 ఖాళీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, వాటి దుస్థితిపై దృష్టి సారించాలని విద్యావేత్తలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దీని గురించి సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. అంతెందుకు విశ్వవిద్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం గ్రూప్‌-4 ప్రకటన విడుదల చేసి, పరీక్ష పూర్తి చేసింది. ఆ భర్తీ ప్రక్రియను కూడా ప్రస్తుతం ప్రభుత్వం పూర్తిచేయలేపోయింది.

అలాగే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వర్సిటీలలో ఖాళీలను ఏ విధంగా భర్తీ చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ వీసీల ద్వారానే ఈ భర్తీ ప్రక్రియ చేయాలనుకుంటే మే నెలలోనే వారి పదవీ కాలం పూర్తయ్యింది. కొత్తవారి నియామకానికి సెర్చ్‌ కమిటీలు వేశారు. దరఖాస్తులు తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల వల్ల వీసీల నియామకం ఆలస్యమైందని.. ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్‌ కూడా వీసీలను నియమించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలు ముగిసి ఇంతకాలమైనా ప్రభుత్వం వీసీల నియామకాలు పూర్తి చేయలేదు. పకడ్బందీగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్న రేవంత్‌ సర్కార్‌ ఈ విషయంలో ప్రకటనలకే పరిమితమౌతున్నది. రాజకీయ జోక్యం లేకుండా వీసీలను ఎంపిక చేస్తామన్న రేవంత్‌ ప్రభుత్వం మాటలు ఉత్తవే అని తేలిపోయింది.

వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు జరుగుతున్నాయనని, ఆశావహులు సర్కార్‌ పెద్దలు, మంత్రులను కలుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీసీల ఎంపిక ఆలస్యం కావడానికి ఇదే కారణమనే విమర్శలు వస్తున్నాయి. 11 వర్సిటీలలో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ ,కాకతీయ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ తెలంగాణ వర్సిటీ వీసీల కోసం పోటీ ఎక్కువగా ఉన్నది. వీటిని దక్కించుకోవడానికి సీఎం, మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వవర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. అలాగే ఎమ్మెల్సీలు కోదండరామ్‌, తీన్మార్‌ మల్లన్న, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళీ లకు సన్నిహితులుగా ఉన్నవాళ్లు వారు వీసీ పోస్టులు దక్కించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మే 21 వీసీల పదవీ కాలం ముగిసిన నాటి నుంచి ఇన్‌ఛార్జ్‌లతోనే కాలం వెళ్లదీస్తున్నది. వర్సిటీలలో బోధన, బోధనేతర ఖాళీల భర్తీ వీసీల ఎంపికతో ముడిపడి ఉన్నది. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. కానీ రేవంత్‌ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం, బోధన, బోధనేతర సిబ్బంది భర్తీ అంశాన్ని ప్రకటనలకే పరిమితం చేసింది. 15 రోజుల్లోనే వీసీల ఎంపిక అన్నప్రభుత్వ ప్రకటనల వాలిడిటీ అనేకసార్లు ముగిసింది. ఆగస్టు 26న సీఎం రేవంత్‌ ప్రకటన అయినా కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది చూడాలి.

Raju

Raju

Writer
    Next Story