అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యలు అటకెక్కాయి: హరీశ్‌రావు

నిరుద్యోగుల సమస్యలపై వారం రోజులుగా మోతీలాల్‌ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై కపట ప్రేమ చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఇప్పుడు వారి గుండె మీద తన్నుతున్నదని ధ్వజమెత్తారు.

అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యలు అటకెక్కాయి: హరీశ్‌రావు
X

అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి సంతకం ఇప్పుడు ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ ను హరీశ్‌రావు పరామర్శించారు. మోతీలాల్‌ను దీక్ష విరమించమని హరీశ్‌ కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు విరమించనని ఆయన చెప్పారు. మోతీ లాల్‌కు ప్రాణహాని కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హరీశ్‌ హెచ్చరించారు.

వారం రోజులుగా మోతీలాల్‌ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై కపట ప్రేమ చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఇప్పుడు వారి గుండె మీద తన్నుతున్నదని ధ్వజమెత్తారు. అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.





కాంగ్రెస్‌ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ సహా అనేక అంశాలను అటకెక్కించిందని మండిపడ్డారు. జాబ్‌ క్యాలెండ్‌ విడుదల చేస్తామని హామీ ఇస్తూ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క సంతకాలు చేసి బాండ్‌ పేపర్లు రాసి ఇచ్చారు. మీ బాండ్‌ పేపర్ల, సంతకాలు ఏమయ్యాయి? అసెంబ్లీ లో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే భట్టి విక్రమార్క గ్రూప్‌-1 మెయిన్స్‌లో 1:100 చొప్పున అవకాశం కల్పించాలని అడిగారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు పెట్డడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట ఉంటుందా? ఆ రోజు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నిరుద్యోగులను కాంగ్రెస్‌ ఆఫీసుకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ నిరుద్యోగ యువతీ, యువకులు మాట్లాడితే ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మీరు ప్రొఫెసర్‌ కదా, మీకు తెలియదా? మీరు మేధావులు కదా! అని నిలదీశారు.

అయినా అది చేయడానికి అవకాశం ఉన్నది. గతంలో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్‌ వస్తే ఆరోజు 1:100కు అవకాశం కల్పించిన విషయాన్ని హరీశ్‌ గుర్తు చేశారు. మొన్నటిదాకా ఏపీలో అధికారంలో ఉన్న జగన్‌ ప్రభుత్వం కూడా అక్కడి నిరుద్యోగ యువత డిమాండ్‌ మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత 1:100 అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో, కొత్తగా ఏర్పడిన ఏపీలో సాధ్యమైనప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యంకాదో రేవంత్‌రెడ్డి, కోదండరామ్‌రెడ్డి లు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story